
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కుక్కల దాడి ఘటనల పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యి పరిష్కారం చూపాలని హైకోర్టు సూచించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.
కాగా, నిన్న జవహర్ నగర్‌లో కుక్కల దాడిలో ఏడాదిన్నర బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కుక్కల దాడుల ఘటనపై వేసిన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వీధి కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది.
ఈ క్రమంలో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి. కుక్కల దాడి ఘటనలను నివారించడానికి స్టేట్ లెవల్ కమిటీ చేశాము. హైదరాబాద్‌లో ఆరు కేంద్రాల వద్ద కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నారు. ఒక్కో కేంద్రం వద్ద రోజుకు సుమారు 200 కుక్కలకు స్టెరిలైజేషన్ జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు.. స్టెరిలైజేషన్ ద్వారా ఎలా దాడులను ఆపుతారని ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కుక్కలను షెల్టర్ హోమ్స్‌కు తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. నాగపూర్‌లో దాదాపు 90వేల కుక్కలను షెల్టర్ హోమ్‌లో పెట్టినట్టు చెప్పారు. దీంతో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యి పరిష్కారం చూపాలని హైకోర్టు సూచించింది. అనంతరం, పిటిషన్లపై తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment