సదాశివనగర్(ఎల్లారెడ్డి): అట్టహాసంగా ప్రారంభించిన హరితహారం లక్ష్యం అభాసుపాలవుతోంది.. ప్రారంభంలో మొక్కలపై ఉన్న శ్రద్ధ ప్రస్తుతం లేకపోవడంతో పెరిగిన మొక్కలు నర్సరీల్లో బిక్కుబిక్కుమంటున్నాయి. పట్టించుకునే నాథులే లేకపోవడంతో చాలామొక్కలు నర్సరీల్లోనే చనిపోతున్నాయి.
గతేడాది హరితహారం కార్యక్రమం కింద ఉత్తునూర్ గ్రామంలోని ఎల్లమ్మగుడి ఆలయ ప్రాంగణంలో ఏడాది క్రితం అటవీశాఖ ఆధ్వర్యంలో లక్ష మొక్కలతో వన నర్సరీని ఏర్పాటు చేశారు. నర్సరీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు.
దీంతో ఏర్పాటు చేసిన లక్ష మొక్కలకు నీరు పట్టే వారు లేక నర్సరీలోనే ఎండిపోయాయి. నర్సరీని ఏర్పాటు చేయడానికి తీసుకున్న స్థల నిర్వహకులకు కూడా ఇప్పటికీ డబ్బులు కూడా చెల్లించలేదు. ఇవన్ని కలిపి హరితహారం పథకానికి తూట్లు పొడుస్తున్నాయి. ప్రస్తుతం సగానికి పైకా మొక్కలు చనిపోయాయి.
రికార్డుల్లో ఘనం..
గ్రామాల్లో హరితహారం కింద లక్షల్లో మొక్కలు నాటినట్లు రికార్డులు సృష్టించారే తప్పా గ్రామాల్లో మొక్కలు నాటలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరిత తెలంగాణగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం అడుగడుగున నిర్వీర్యం అవుతుంది. వన నర్సరీల్లో ఏర్పాటు చేసిన మొక్కలు చెట్లుగా మారుతున్నా. పట్టింపు లేదు. అధికారుల నిర్లక్షం కూడా తోడవుతుంది. దీనంతటికి కారణం క్షేత్ర స్థాయిలో అధికారులు పట్టించుకోక పోవడం, ఏర్పాటు చేసిన నర్సరీలపై కనీసం దృష్టి సారించక పోవడంతో హరిత లక్ష్యం హరీమంటుంది. గ్రామాల్లో 40 వేల చొప్పున మొక్కలు నాటాలని విధించిన నిబంధన ఏ మాత్రం ప్రయోజనం లేకుండా ఉందని తెలుస్తోంది. మొక్కల సంరక్షణకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో పథకం అభాసుపాలవుతుంది. పథకం అమలులో సరైనా ప్రణాళిక లేకపోవడంతో హరితహారం పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికైన అధికారులు స్పందించి హరితహారం పథకాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.
మొక్కలను వృథా చేశారు..
గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో పెంచిన లక్ష మొక్కలను వృథా చేశారు. ఎండిపోయిన మొ క్కలను అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తయారైంది.
– వెంకట్రావ్, ఉత్తునూర్
ఎండబెట్టారు
హరితహారంలో నాటాల్సిన మొక్కలను ఎండబెట్టారు. దీంతో ప్రభుత లక్ష్యం నీరుగారింది. నర్సరీని ఏర్పాటు చేసిన అధికారులు నర్సరీపై దృష్టి పెట్టకపోవడంతో మొక్కలు ఎండుముఖం పట్టాయి. అధికారులు దృష్టి సారించి పథకాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది.
– రాజు, ఉత్తునూర్
Comments
Please login to add a commentAdd a comment