రైతును రాజుగా చూడాలనేది తన ఆశ అని తరచూ చెబుతుండే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఆ వైపుగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకవైపు బంజరు భూముల్లో సిరులు పండించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతూనే.. మరోవైపు నుంచి సాగులోకి వచ్చే భూముల్లో ఎలాంటి పంటలు పండుతాయో వ్యవసాయ శాస్త్రవేత్తలతో పరిశోధనలు చేయిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పంట కాలనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, మహిళా సంఘాల బలోపేతం వంటి అంశాలపై వారితో చర్చించారు. ఈ క్రమంలో రైతుల వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు. మొత్తం 30 అంశాల మీద రైతు సర్వే జరగనుంది. సర్వే తర్వాత వచ్చిన రిపోర్టు ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు.
సాక్షి, సిద్దిపేట : రాష్ట్రంలో మెజారిటీ భాగం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనంసాగిస్తారు. వర్షాలు కురిస్తేనే పంటలు పండే పరిస్థితి. పంటలు పండిస్తేనే చాలా మందికి కూలీ దొరికేంది. లేదంటే ఉపాధి కోసం పరాయి రాష్ట్రాలు, గల్ఫ్ దేశాలకు వలసపోవడం తప్ప మరో దారిలేదు. తెలంగాణలో ఇలాంటి దుస్థితిని లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చాలనే కసితో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. బంజరు భూములను సాగులోకి తేవడం తెచ్చి వ్యవసాయాన్ని పండగ చేయాలని తపన పడుతున్నారు. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ తీరు, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. అందుకోసం రైతుల పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో పొందు పరచాలని, భూసారం, నీటివనరులు, పంటల సాగు, మార్కెటింగ్ వివరాలు మొత్తం అందుబాటులోకి వస్తాయని, తద్వారా ద్వారా అసలు రైతులకు ఏం అవసరమో తేలిపోతుందనే ఆలోచనకు వచ్చారు. ఇందులో భాగంగానే ఈనెల 23 రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతోపాటు, డీఆర్‌డీఏ, సెర్ప్, పరిశ్రమలు, మార్కెటింగ్ అధికారులతోపాటు అన్ని జిల్లాల వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించి రైతు సమగ్ర సర్వే అవసరం, ఆవశ్యకతను వివరించారు. ఇందుకుసంబంధించిన ప్రొఫార్మను తయారు చేసి అందచేశారు.
30 అంశాలపై సమాచార సేకరణ
రైతు పేరు నుంచి మొదలుకొని మొత్తం 30 అంశాల ద్వారా రైతు పూర్తి సమాచారం తీసుకునేందుకు అధికారులు సిద్దమయ్యారు. రైతు పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్, రైతు పేరు, ఆధార్ నెంబర్, తండ్రి లేదా భర్త వివరాలు, జండర్, ధరణీ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాలు, పుట్టిన తేదీ, సెల్ నెంబర్‌తోపాటు బ్యాంకు వివరాలు సర్వే ద్వారా సేకరిస్తారు. అదేవిధంగా కులం, భూమి వివరాలు సర్వే నెంబర్లతో సహా, ఇందులో సాగుకు అనుకూలంగా ఉన్న భూమి, లేని భూమి వివరాలు పొందుపరుస్తారు. ఆయా పంటల సాగుకు అందుబాటులో ఉన్న ప్రధాన నీటి వనరులైన బావులు, బోర్లు, చెరువు, కాల్వలు, వర్షాధారం ఇలా మొత్తం వనరుల వివరాలు తీసుకుంటారు. అదేవిధంగా సూక్ష్మ, బిందు, తుంపర సేద్యం మొదలైన వివరాలు, భూసార పరీక్షల కార్డు నెంబర్ వంటి వివరాలతోపాటు భూమి రకం నల్లరేగడి, ఎర్ర నేలలు మొదలైన నేలల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదుచేస్తారు. వీటితోపాటు గత ఖరీఫ్‌లో సాగు చేసిన పంట వివరాలు, దిగుబడి, అదేవిధంగా రబీ పంట సాగు, దిగుబడి వివరాలు పొందుపరుస్తారు. ఇవే కాకుండా పండ్లు, కూరగాయలు, మల్బరీ మొదలైన పంటలు సాగు చేస్తే వాటి వివరాలు నమోదు చేస్తారు. వచ్చే వానాకాలం, యాసంగిలో ఏం పంటలు వేస్తారో వివరాలు తెలుసుకుంటారు. అదేవిధంగా వ్యవసాయ పరికరాల వినియోగం, క్రాప్‌లోన్ వివరాలు, పంటల బీమా, పండిన పంటలను విక్రయించేందుకు మార్కెటింగ్ సౌకర్యం, విత్తనాల ఉత్పత్తి మొదలైన వివరాలు సేకరిస్తారు. వీటితోపాటు ఇప్పటికే మీ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉంటే వాటి వివరాలు, అదేవిధంగా రైతు స్మార్ట్ ఫోన్ వాడితే అందులో వ్యవసాయ సమాచారం కోసం ఏం యాప్ వినియోగిస్తారో కూడా సర్వే సందర్భంగా నమోదు చేస్తారు.
ఫిబ్రవరి ఒకటి నుంచి సర్వే మొదలు
ఈ వివరాలు సేకరిస్తే కానీ ఏ ప్రాంతంలో రైతులు ఏ పంటలు పండిస్తారు. నీటి వసతి, మార్కెటింగ్ మొదలైన వివరాలు రావు. దీంతోనే పంటల కాలనీ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయవచ్చు. అందుకోసం ఈ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మార్చి నెల చివరి వరకు ప్రతీ రైతు చిట్టాను సేకరించాలి. జిల్లా వ్యాప్తంగా 5.66 లక్షల ఎకరాల భూమిని సాగుచేసే 2.6లక్షల రైతుల వివరాలు సేకరించాలి. ఇందుకోసం ఇప్పటికే జిల్లా స్థాయిలో మండల వ్యవసాయ అధికారులకు, మండల, డివిజన్ స్థాయిల్లో వ్యవసాయ విస్తరణ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే వచ్చే వ్యవసాయ సీజన్ జూన్ నాటికి రైతుల వివరాలు, పంటల కాలనీ మొదలైన సమాచారంతో నూతన వ్యవసాయా పద్ధతికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.
రైతు అనే నేను ...
Published Tue, Jan 29 2019 10:48 AM | Last Updated on Tue, Jan 29 2019 10:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment