సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమ, అనధికార భవనాల క్రమబద్ధీకరణకు చివరిసారిగా అవ కాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచి స్తోంది. భవనాల క్రమబద్ధీకరణ పథకాన్ని (బీఆర్‌ఎస్) మరోసారి ప్రవేశపెట్టి కొత్త దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప డ్డాక 2015 అక్టోబర్ 31న బీఆర్‌ఎస్‌ను ప్రవేశ పెడుతూ ప్రభుత్వం జీవో నం. 145 తీసుకురాగా దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలు గత ఐదేళ్లుగా రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసు విచారణ చివరి దశకు చేరుకోవడంతో త్వరలో తీర్పు వచ్చే అవకాశాలున్నాయి.
ఈ కేసులో అను కూలంగా తీర్పు వస్తే మరోసారి కొత్త బీఆర్ ఎస్‌ను ప్రవేశపెట్టి దరఖాస్తులు స్వీకరించా లని ప్రభుత్వం భావిస్తోంది. బీఆర్‌ఎస్ 2015–16 కింద దరఖాస్తు చేసుకోలేక పోయిన వారికి మరో అవకాశం ఇవ్వడంతో పాటు ఆ తర్వాత కాలంలో నిర్మించిన అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు చివరి సారిగా అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. పెండింగ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ 2015–16 దరఖాస్తులతో పాటు కొత్తగా తీసుకురానున్న బీఆర్‌ఎస్ కింద వచ్చే దరఖాస్తులను కలిపి పరిష్కరించే అవకాశాలున్నాయి.
ప్రభుత్వానికి విజ్ఞప్తులు...
బిల్డింగ్ ప్లాన్‌ను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాల క్రమబద్ధీకరణ కోసం హైదరాబాద్ ప్రజలతోపాటు బిల్డర్ల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. బిల్డింగ్ ప్లాన్ ఉల్లంఘనల విషయంలో క్రమబద్ధీకరణ జరగక నగరంలోని వేలాది ఫ్లాట్ల విక్రయాలు జరగట్లేదు. ఎల్‌ఆర్‌ఎస్–2020 కింద అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 25 లక్షలకుపైగా దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ. 20 వేల కోట్లకు ఆదాయం రానుందని అంచనా వస్తున్నారు. కొత్తగా తేవాలనుకుంటున్న బీఆర్‌ఎస్ ద్వారా భారీ ఆదాయం వచ్చే అవకాశముంది. ఈ నిధులతో ఆయా నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
కఠిన నిబంధనలతో అమలు..
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు చివరి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠిన నిబంధనలతో గతేడాది ఆగస్టులో ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇదే తరహాలో కఠిన నిబంధనలతో అక్రమ కట్టడాలు, గృహాల క్రమబద్ధీకరణకు చివరి అవకాశం కల్పిస్తూ కొత్త బీఆర్‌ఎస్‌ను తేవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఎల్‌ఆర్‌ఎస్ తరహాలోనే బీఆర్‌ఎస్ కింద క్రమబద్ధీకరణను తప్పనిసరి చేసేలా నిబంధనలు ఉండనున్నాయని, క్రమబద్ధీకరణ ఫీజులు సైతం గతంలోకన్నా అధిక మొత్తంలో ఉండవచ్చని రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి.
ఒకవేళ అక్రమ ఇళ్లను క్రమబద్ధీకరించుకోకుంటే ఇప్పటికే ఉన్న మున్సిపల్ చట్ట నిబంధనల ప్రకారం జరిమానాగా 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులను అధికంగా వసూలు చేయడం, నల్లా బిల్లులను సైతం కొంత వరకు పెంచి వసూలు చేయడం, నోటీసులు లేకుండా కూల్చేయడం వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment