BRS Applications
-
మరోసారి బీఆర్ఎస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమ, అనధికార భవనాల క్రమబద్ధీకరణకు చివరిసారిగా అవ కాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచి స్తోంది. భవనాల క్రమబద్ధీకరణ పథకాన్ని (బీఆర్ఎస్) మరోసారి ప్రవేశపెట్టి కొత్త దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప డ్డాక 2015 అక్టోబర్ 31న బీఆర్ఎస్ను ప్రవేశ పెడుతూ ప్రభుత్వం జీవో నం. 145 తీసుకురాగా దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలు గత ఐదేళ్లుగా రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసు విచారణ చివరి దశకు చేరుకోవడంతో త్వరలో తీర్పు వచ్చే అవకాశాలున్నాయి. ఈ కేసులో అను కూలంగా తీర్పు వస్తే మరోసారి కొత్త బీఆర్ ఎస్‌ను ప్రవేశపెట్టి దరఖాస్తులు స్వీకరించా లని ప్రభుత్వం భావిస్తోంది. బీఆర్ఎస్ 2015–16 కింద దరఖాస్తు చేసుకోలేక పోయిన వారికి మరో అవకాశం ఇవ్వడంతో పాటు ఆ తర్వాత కాలంలో నిర్మించిన అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు చివరి సారిగా అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. పెండింగ్‌లో ఉన్న బీఆర్ఎస్ 2015–16 దరఖాస్తులతో పాటు కొత్తగా తీసుకురానున్న బీఆర్ఎస్ కింద వచ్చే దరఖాస్తులను కలిపి పరిష్కరించే అవకాశాలున్నాయి. ప్రభుత్వానికి విజ్ఞప్తులు... బిల్డింగ్ ప్లాన్‌ను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాల క్రమబద్ధీకరణ కోసం హైదరాబాద్ ప్రజలతోపాటు బిల్డర్ల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. బిల్డింగ్ ప్లాన్ ఉల్లంఘనల విషయంలో క్రమబద్ధీకరణ జరగక నగరంలోని వేలాది ఫ్లాట్ల విక్రయాలు జరగట్లేదు. ఎల్ఆర్ఎస్–2020 కింద అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 25 లక్షలకుపైగా దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ. 20 వేల కోట్లకు ఆదాయం రానుందని అంచనా వస్తున్నారు. కొత్తగా తేవాలనుకుంటున్న బీఆర్ఎస్ ద్వారా భారీ ఆదాయం వచ్చే అవకాశముంది. ఈ నిధులతో ఆయా నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కఠిన నిబంధనలతో అమలు.. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు చివరి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠిన నిబంధనలతో గతేడాది ఆగస్టులో ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇదే తరహాలో కఠిన నిబంధనలతో అక్రమ కట్టడాలు, గృహాల క్రమబద్ధీకరణకు చివరి అవకాశం కల్పిస్తూ కొత్త బీఆర్ఎస్ను తేవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఎల్ఆర్ఎస్ తరహాలోనే బీఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణను తప్పనిసరి చేసేలా నిబంధనలు ఉండనున్నాయని, క్రమబద్ధీకరణ ఫీజులు సైతం గతంలోకన్నా అధిక మొత్తంలో ఉండవచ్చని రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అక్రమ ఇళ్లను క్రమబద్ధీకరించుకోకుంటే ఇప్పటికే ఉన్న మున్సిపల్ చట్ట నిబంధనల ప్రకారం జరిమానాగా 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులను అధికంగా వసూలు చేయడం, నల్లా బిల్లులను సైతం కొంత వరకు పెంచి వసూలు చేయడం, నోటీసులు లేకుండా కూల్చేయడం వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
బీఆర్ఎస్.. బీ రెడీ..
సాక్షి, హైదరాబాద్ : దాదాపు రెండేళ్ల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భవనాల క్రమబద్ధీకరణ పథకం(బీఆర్ఎస్) అమలుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 1 నుంచి బీఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రారంభించాలని నిర్ణయించారు. వాస్తవంగా బీఆర్ఎస్పై గతంలో హైకోర్టు స్టే విధించింది. కానీ, ఖజానాకు రూ. వెయ్యి కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో ఇటీవల అధికారులు స్టే తొలగించాలని హైకోర్టుకు విన్నవించారు. స్పందించిన న్యాయస్థానం.. మొదట బీఆర్ఎస్కు అర్హమయ్యే దరఖాస్తులు ఎన్ని ఉన్నాయో తేల్చాలని ఆదేశించింది. దీంతో 2015 అక్టోబర్ 28 లోపు నిర్మించిన అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అందిన దరఖాస్తులను పరిశీలించాలని నిర్ణయించారు. ఆ తర్వాత తదుపరి చర్యలు చేపడితే.. గ్రేటర్ ఖజానాకు భారీ ఆదాయం లభించే అవకాశం ఉంది. నెల రోజుల్లో ప్రాథమిక పరిశీలన పూర్తి.. 2015 అక్టోబర్ 28 లోపు నిర్మించిన అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం అందిన దరఖాస్తులను జీహెచ్ంఎసీ అధికారులు ఇప్పటి వరకూ పరిశీలించలేదు. బీఆర్ఎస్ ఫైళ్ల పరిష్కారంపై స్టే విధించిన హైకోర్టు.. వాటి ఉల్లంఘనలను వర్గీకరించి సదరు జాబితాను తమకు అందజేశాక, తాము వాటిని పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశాకే దరఖాస్తుల్ని పరిష్కరించాలని ఆదేశించింది. అధికారులు వాటిని పరిశీలించొచ్చని సూచించింది. అయితే అధికారులు ఇప్పటి వరకూ ఒక్కటి కూడా పరిశీలన చేయలేదు. జీహెచ్ఎంసీ ఖజానా రోజురోజుకూ దిగజారుతుండటంతో ఆదాయ మార్గాలపై దృష్టి సారించిన అధికారులు.. బీఆర్ఎస్ను కొలిక్కి తేవాలని నిర్ణయించారు. బీఆర్ఎస్కు అర్హమయ్యే దరఖాస్తులెన్ని ఉన్నాయో వివరాలందజేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించడంతో అందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 1 నుంచి బీఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రారంభించి నెల రోజుల్లో ప్రాథమిక పరిశీలన పూర్తి చేయనున్నట్లు జీహెచ్ంఎసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి తెలిపారు. వీటికి నో.. అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు బీఆర్ఎస్ను తెచ్చినప్పటికీ, క్లియర్ టైటిల్ డీడ్ లేకుండా ప్రభుత్వ భూములు, చెరువులు తదితర ప్రాంతాల్లో నిర్మించిన వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమబద్ధీకరించరు. సదరు దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్లు దరఖాస్తుదారులకు సమాచారమిస్తారు. ఆ తర్వాత వాటిని అక్రమ నిర్మాణాలుగా పరిగణించి కూల్చివేస్తారు. దిగువ అంశాలను పరిగణనలోకి తీసుకుని బీఆర్ఎస్ దరఖాస్తుల్ని తిరస్కరిస్తారు. – నాలాలు, చెరువుల స్థలాల్లో నిర్మించిన భవనాలు – ప్రభుత్వ, యూఎల్సీ భూముల్లో నిర్మించినవి – మాస్టర్‌ప్లాన్‌లోని రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో నిర్మించినవి – పార్కింగ్ ఉల్లంఘనలు ఉన్నవి – ఫైర్ సేఫ్టీ లేని 18 మీటర్ల ఎత్తుమించిన భవనాలు – బీఆర్ఎస్ గడువు తర్వాత నిర్మించినవి పై వాటితోపాటు కోర్టు వివాదాలున్నవి, అక్రమమని జీహెచ్ఎంసీ సుమోటోగా నిర్ణయించినవి, ప్రజల నుంచి ఫిర్యాదులు ఉన్న వాటిని బీఆర్ఎస్ కింద పరిష్కరించడం కుదరదు. గడువు తర్వాతా అక్రమ నిర్మాణాలు.. 2015 అక్టోబర్ 28 లోపు నిర్మించిన అక్రమ నిర్మాణాలను మాత్రమే బీఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేసేందుకు అవకాశముండగా, ఆ తర్వాత సైతం నగరంలో కుప్పలు తెప్పలుగా అక్రమ నిర్మాణాలు జరిగాయి. అలాంటి అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు శాటిలైట్ చిత్రాలను అధికారులు ఉపయోగించుకోనున్నారు. -
అర్హత పొందేవెన్ని..? తిరస్కరించేవెన్ని..?
బీఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు చర్యలు హైకోర్టు ఆదేశాలతో జీహెచ్ఎంసీ కార్యాచరణ సాక్షి, హైదరాబాద్: బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్(బీఆర్ఎస్) కింద జీహెచ్ఎంసీకి అందిన 1.39 లక్షల దరఖాస్తుల్లో క్రమబద్ధీకరణకు అనుమతి పొందేవెన్ని..? తిరస్కరించేవి ఎన్ని..? అనే వివరాలు కొద్దిరోజుల్లో తెలియనున్నాయి. బీఆర్ఎస్ దరఖాస్తుల గడువు ముగిసి ఇప్పటికే ఏడు నెలలు దాటింది. అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులు ఆ దరఖాస్తుల్ని పూర్తిస్థాయిలో పరిశీలించలేదు. అయితే దరఖాస్తుల్లో క్రమబద్ధీకరణకు అర్హత లేనివెన్నో గుర్తించి.. ఆ మేరకు వారికి సమాచారమివ్వాల్సిందిగా హైకోర్టు గత వారం సూచించడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆ దిశగా చర్యలకు సిద్ధమయ్యారు. తిరస్కరించిన వారికి సమాచారమివ్వాలంటే అందిన అన్ని దరఖాస్తుల్నీ పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. అలాగే క్షేత్రస్థాయి పరిశీలనలూ చేయాలి. దీంతో తగిన కార్యాచరణకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా నిర్మాణాలు చేసిన వారు.. ప్రభుత్వ స్థలాలు, యూఎల్సీ భూముల్లో నిర్మించుకున్న వారు బీఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరణ చేయించుకోవచ్చని భావిస్తున్నారని, అయితే వారు ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందిగా సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, ఎఫ్టీఎల్లు, యూఎల్సీ భూములు, మాస్టర్‌ప్లాన్ ప్రకారం రహదారులు, ఓపెన్ ప్లేసెస్‌లో నిర్మాణాలు జరిపిన వారు బీఆర్ఎస్కు అర్హులు కారని, వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తామని చెపుతున్నారు. గతంలో బీఆర్ఎస్కు సంబంధించిన ఒక పిటిషన్ పై హైకోర్టు స్పందిస్తూ.. అనుమతి పొందిన ప్లాన్ కంటే 20 శాతం వరకు ఉల్లంఘనల్ని క్రమబద్ధీకరించడం న్యాయమని పేర్కొంది. బీఆర్ఎస్ కోసం అందిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి, ఉల్లంఘనలను బట్టి వర్గీకరించి సదరు జాబితాను తమకు సమర్పించాలని అప్పట్లో ఆదేశించిన కోర్టు వాటిని పరిశీలించాక తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. వీటిపై వేటు తప్పదు.. గత ఏడాది అక్టోబర్ 28కి ముందు నిర్మించిన భవనాలకు మాత్రమే బీఆర్ఎస్ వర్తిస్తుంది. ఆ తర్వాత కూడా అక్రమంగా నిర్మించిన భవనాలను గుర్తించే పనిలో పడ్డ జీహెచ్ఎంసీ.. ఫిబ్రవరి నెలాఖరు వరకు 355 భవనాలను గుర్తించింది. గడువు ముగిశాక నిర్మించిన వాటన్నింటినీ కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం నాలాల విస్తరణ కోసం కూలుస్తున్న భవనాలతోపాటు వాటికి దగ్గర్లో ఇటీవల కట్టిన అక్రమ నిర్మాణాలనూ కూలుస్తున్నారు. గడువు ముగిశాక వెలసిన అక్రమ నిర్మాణాలు ఇంకా ఉన్నాయని భావిస్తున్న అధికారులు గడువుకు ముందు.. తర్వాత భవనాలను శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తిస్తున్నారు.