అర్హత పొందేవెన్ని..? తిరస్కరించేవెన్ని..?
బీఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనకు చర్యలు
హైకోర్టు ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్(బీఆర్‌ఎస్) కింద జీహెచ్‌ఎంసీకి అందిన 1.39 లక్షల దరఖాస్తుల్లో క్రమబద్ధీకరణకు అనుమతి పొందేవెన్ని..? తిరస్కరించేవి ఎన్ని..? అనే వివరాలు కొద్దిరోజుల్లో తెలియనున్నాయి. బీఆర్‌ఎస్ దరఖాస్తుల గడువు ముగిసి ఇప్పటికే ఏడు నెలలు దాటింది. అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులు ఆ దరఖాస్తుల్ని పూర్తిస్థాయిలో పరిశీలించలేదు. అయితే దరఖాస్తుల్లో క్రమబద్ధీకరణకు అర్హత లేనివెన్నో గుర్తించి.. ఆ మేరకు వారికి సమాచారమివ్వాల్సిందిగా హైకోర్టు గత వారం సూచించడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ దిశగా చర్యలకు సిద్ధమయ్యారు. తిరస్కరించిన వారికి సమాచారమివ్వాలంటే అందిన అన్ని దరఖాస్తుల్నీ పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. అలాగే క్షేత్రస్థాయి పరిశీలనలూ చేయాలి. దీంతో తగిన కార్యాచరణకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా నిర్మాణాలు చేసిన వారు.. ప్రభుత్వ స్థలాలు, యూఎల్‌సీ భూముల్లో నిర్మించుకున్న వారు బీఆర్‌ఎస్ ద్వారా క్రమబద్ధీకరణ చేయించుకోవచ్చని భావిస్తున్నారని, అయితే వారు ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందిగా సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, ఎఫ్‌టీఎల్‌లు, యూఎల్‌సీ భూములు, మాస్టర్‌ప్లాన్ ప్రకారం రహదారులు, ఓపెన్ ప్లేసెస్‌లో నిర్మాణాలు జరిపిన వారు బీఆర్‌ఎస్‌కు అర్హులు కారని, వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తామని చెపుతున్నారు. గతంలో బీఆర్‌ఎస్‌కు సంబంధించిన ఒక పిటిషన్ పై హైకోర్టు స్పందిస్తూ.. అనుమతి పొందిన ప్లాన్ కంటే 20 శాతం వరకు ఉల్లంఘనల్ని క్రమబద్ధీకరించడం న్యాయమని పేర్కొంది. బీఆర్‌ఎస్ కోసం అందిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి, ఉల్లంఘనలను బట్టి వర్గీకరించి సదరు జాబితాను తమకు సమర్పించాలని అప్పట్లో ఆదేశించిన కోర్టు వాటిని పరిశీలించాక తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.
వీటిపై వేటు తప్పదు..
గత ఏడాది అక్టోబర్ 28కి ముందు నిర్మించిన భవనాలకు మాత్రమే బీఆర్‌ఎస్ వర్తిస్తుంది. ఆ తర్వాత కూడా అక్రమంగా నిర్మించిన భవనాలను గుర్తించే పనిలో పడ్డ జీహెచ్‌ఎంసీ.. ఫిబ్రవరి నెలాఖరు వరకు 355 భవనాలను గుర్తించింది. గడువు ముగిశాక నిర్మించిన వాటన్నింటినీ కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం నాలాల విస్తరణ కోసం కూలుస్తున్న భవనాలతోపాటు వాటికి దగ్గర్లో ఇటీవల కట్టిన అక్రమ నిర్మాణాలనూ కూలుస్తున్నారు. గడువు ముగిశాక వెలసిన అక్రమ నిర్మాణాలు ఇంకా ఉన్నాయని భావిస్తున్న అధికారులు గడువుకు ముందు.. తర్వాత భవనాలను శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తిస్తున్నారు.