సాక్షి, హైదరాబాద్ : గచ్చిబౌలి బయోడైవర్సిటీ పార్కు వద్ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) చేపట్టిన ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు నిర్మాణ పనులు చేపట్టవద్దని అధికారులను ఆదేశిస్తూ స్టే ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గతవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. భూ సేకరణ పరిహారం ఖరారుపై చట్టం నిర్దేశించిన గడువు ను ప్రభావిత వ్యక్తులకు ఇవ్వకపోవడం భూ సేకరణ చట్టం–2013 నిబంధనలకు విరుద్ధమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.
శేరిలింగంపల్లి, రాయదుర్గం పన్మక్త సర్వే నెంబర్ 83/1లో ఏసియన్ గ్లోబల్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు 2,515 చదరపు గజాల స్థలం ఉంది. ఇందులో వాణిజ్య సముదాయ నిర్మాణం నిమిత్తం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోగా, ఆయన దాన్ని తిరస్కరించారు. రోడ్డు విస్తరణ నిమిత్తం ఏసియన్ గ్లోబల్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ స్థలాన్ని భూ సేకరణ చట్టం–2013 కింద సేకరించాలని అధికారులు నిర్ణయించి ఆ మేర ఆ కంపెనీకి నోటీసులిచ్చారు. 1,310 చదరపు అడుగల స్థలాన్ని సేకరించనున్నట్లు అందులో పేర్కొన్నారు.
దీంతో ఆ కంపెనీకి వాణిజ్య సముదాయం నిర్మించే అవకాశం లేకుండా పోయింది. ఏసియన్ యాజమాన్యం జిల్లా కలెక్టర్ ముందు అభ్యంతరాలను వినిపించగా.. వాటిని తోసిపుచ్చుతూ జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఆ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్నది కలెక్టర్ అయితే జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంపై హైకోర్టు విస్మ యం వ్యక్తం చేసింది. భూమికి పరిహారం చెల్లించే విషయమై అభ్యంతరాలు వెల్లడించాలంటూ ఏసియన్ యాజమాన్యానికి కలెక్టర్ మరో నోటీసు ఇచ్చారు.
అభ్యంతరాలు సమర్పించేందుకు 30 రోజు ల గడువు కావాలని ఏసియన్ యాజమాన్యం జిల్లా కలెక్టర్‌ను కోరింది. అయితే అధికారులు గడువు వర కు వేచి చూడకుండా పరిహారం నిర్ణయిస్తూ స్థలాన్ని ఖాళీ చేయాలని ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఏసియన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించగా.. ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై స్టే విధిస్తున్నట్లు వెల్లడిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment