సాక్షి, హైదరాబాద్ : దాదాపు రెండేళ్ల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భవనాల క్రమబద్ధీకరణ పథకం(బీఆర్‌ఎస్) అమలుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 1 నుంచి బీఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రారంభించాలని నిర్ణయించారు. వాస్తవంగా బీఆర్‌ఎస్‌పై గతంలో హైకోర్టు స్టే విధించింది. కానీ, ఖజానాకు రూ. వెయ్యి కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో ఇటీవల అధికారులు స్టే తొలగించాలని హైకోర్టుకు విన్నవించారు. స్పందించిన న్యాయస్థానం.. మొదట బీఆర్‌ఎస్‌కు అర్హమయ్యే దరఖాస్తులు ఎన్ని ఉన్నాయో తేల్చాలని ఆదేశించింది. దీంతో 2015 అక్టోబర్ 28 లోపు నిర్మించిన అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అందిన దరఖాస్తులను పరిశీలించాలని నిర్ణయించారు. ఆ తర్వాత తదుపరి చర్యలు చేపడితే.. గ్రేటర్ ఖజానాకు భారీ ఆదాయం లభించే అవకాశం ఉంది.
నెల రోజుల్లో ప్రాథమిక పరిశీలన పూర్తి..
2015 అక్టోబర్ 28 లోపు నిర్మించిన అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం అందిన దరఖాస్తులను జీహెచ్‌ంఎసీ అధికారులు ఇప్పటి వరకూ పరిశీలించలేదు. బీఆర్‌ఎస్ ఫైళ్ల పరిష్కారంపై స్టే విధించిన హైకోర్టు.. వాటి ఉల్లంఘనలను వర్గీకరించి సదరు జాబితాను తమకు అందజేశాక, తాము వాటిని పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశాకే దరఖాస్తుల్ని పరిష్కరించాలని ఆదేశించింది. అధికారులు వాటిని పరిశీలించొచ్చని సూచించింది. అయితే అధికారులు ఇప్పటి వరకూ ఒక్కటి కూడా పరిశీలన చేయలేదు.
జీహెచ్‌ఎంసీ ఖజానా రోజురోజుకూ దిగజారుతుండటంతో ఆదాయ మార్గాలపై దృష్టి సారించిన అధికారులు.. బీఆర్‌ఎస్‌ను కొలిక్కి తేవాలని నిర్ణయించారు. బీఆర్‌ఎస్‌కు అర్హమయ్యే దరఖాస్తులెన్ని ఉన్నాయో వివరాలందజేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించడంతో అందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 1 నుంచి బీఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రారంభించి నెల రోజుల్లో ప్రాథమిక పరిశీలన పూర్తి చేయనున్నట్లు జీహెచ్‌ంఎసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి తెలిపారు.
వీటికి నో..
అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు బీఆర్‌ఎస్‌ను తెచ్చినప్పటికీ, క్లియర్ టైటిల్ డీడ్ లేకుండా ప్రభుత్వ భూములు, చెరువులు తదితర ప్రాంతాల్లో నిర్మించిన వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమబద్ధీకరించరు. సదరు దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్లు దరఖాస్తుదారులకు సమాచారమిస్తారు. ఆ తర్వాత వాటిని అక్రమ నిర్మాణాలుగా పరిగణించి కూల్చివేస్తారు. దిగువ అంశాలను పరిగణనలోకి తీసుకుని బీఆర్‌ఎస్ దరఖాస్తుల్ని తిరస్కరిస్తారు.
– నాలాలు, చెరువుల స్థలాల్లో నిర్మించిన భవనాలు
– ప్రభుత్వ, యూఎల్‌సీ భూముల్లో నిర్మించినవి
– మాస్టర్‌ప్లాన్‌లోని రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో నిర్మించినవి
– పార్కింగ్ ఉల్లంఘనలు ఉన్నవి
– ఫైర్ సేఫ్టీ లేని 18 మీటర్ల ఎత్తుమించిన భవనాలు
– బీఆర్‌ఎస్ గడువు తర్వాత నిర్మించినవి
పై వాటితోపాటు కోర్టు వివాదాలున్నవి, అక్రమమని జీహెచ్‌ఎంసీ సుమోటోగా నిర్ణయించినవి, ప్రజల నుంచి ఫిర్యాదులు ఉన్న వాటిని బీఆర్‌ఎస్ కింద పరిష్కరించడం కుదరదు.
గడువు తర్వాతా అక్రమ నిర్మాణాలు..
2015 అక్టోబర్ 28 లోపు నిర్మించిన అక్రమ నిర్మాణాలను మాత్రమే బీఆర్‌ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేసేందుకు అవకాశముండగా, ఆ తర్వాత సైతం నగరంలో కుప్పలు తెప్పలుగా అక్రమ నిర్మాణాలు జరిగాయి. అలాంటి అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు శాటిలైట్ చిత్రాలను అధికారులు ఉపయోగించుకోనున్నారు.