సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎన్నో పార్కులు ఉన్నప్పటికీ, వాటికి సంబంధించి వివరాలు మాత్రం లేవు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా వందలాది పార్కుల నిర్వహణ కొనసాగుతోంది. వీటి అభివృద్ధి కోసం రూ.కోట్లలో నిధులు కూడా వెచ్చిస్తోంది. అయితే ఆయా పార్కుల్లో వసతుల కల్పన, అభివృద్ధికి సంబంధించి వివరాలు మాత్రం ఉండడం లేదు. పార్కును ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు? ఆ తర్వాత దశల్లో ఎంత మేరకు అభివృద్ధి జరిగింది? పచ్చదనం, ల్యాండ్‌స్కేప్, వాక్‌వే ఎంత? ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి? సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సదుపాయాలేమిటి? తొలి రోజుల్లో ఎంతమంది సందర్శకులు వచ్చేవారు, ఇప్పుడెంత మంది వస్తున్నారు? ఇలా ప్రతిదీ ప్రశ్నార్థకమే! ఈ నేపథ్యంలో పార్కులకు సంబంధించి పై వివరాలతో సమగ్రంగా ‘గ్రీన్‌బుక్’లు రూపొందించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ నిర్ణయించారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో జీవవైవిధ్య విభాగం అధికారులను ఆదేశించారు. పార్కులకు సంబంధించి ఇలాంటి వివరాలు దేశంలోనే ఏ నగరంలోనూ అందుబాటులో లేవు. జీహెచ్‌ఎంసీనే తొలిసారిగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని పార్కులివీ...
జీహెచ్‌ఎంసీ నిర్వహణలో మేజర్ పార్కులు 17, థీమ్ పార్కులు 16, బయోడైవర్సిటీ పార్కులు 10, కాలనీ పార్కులు 806, ట్రీ పార్కులు 324 ఉన్నాయి. వీటికి సంబంధించి త్వరలోనే గ్రీన్‌బుక్‌లు తయారు చేయనున్నారు. తొలుత మేజర్ పార్కుల గ్రీన్‌బుక్‌లను 15 రోజుల్లోగా సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు. దీంతో పాటు మేజర్ పార్కుల్లో వివరాలు తెలిసేలా బోర్డులు సైతం ఏర్పాటు చేయాలని సూచించారు.
పచ్చదనం ఎంత?
జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. అయితే ఇందులో ప్రస్తుతం ఎంతశాతం పచ్చదనం ఉందో తెలుసుకోవాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఇందుకుగాను జీహెచ్‌ఎంసీ పార్కులు, ఖాళీ స్థలాలు, శ్మశానవాటికలు.. అటవీశాఖల కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు తదితర సంస్థల్లోని గ్రీనరీని లెక్కించాలన్నారు. అదే విధంగా జీహెచ్‌ఎంసీ గుర్తించిన 1049 ఖాళీ స్థలాల్లో కొత్త పార్కుల్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ నిధులతోనే కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కింద కార్పొరేట్ సంస్థల నుంచి సహకారం పొందాలని సూచించారు.
అదనంగా 5 లక్షల మొక్కలు...
ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగో విడత హరితహారంలో నాటనున్న 40లక్షల మొక్కలకు అదనంగా మరో 5లక్షలు నాటాలని కమిషనర్ సూచించారు.
తద్వారా నగరంలో గత మూడేళ్లలో రెండు కోట్ల మొక్కలు నాటినట్లవుతుందన్నారు. ప్రస్తుత హరితహారంలో ఇప్పటికే 30.60 లక్షల మొక్కలను ఉచితంగా పంపిణీ చేసినట్లు అధికారులు కమిషనర్‌కు తెలిపారు. ఖాళీ ప్రదేశాల్లో 3.59 లక్షల మొక్కల్ని జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నాటినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు హరిచందన, కృష్ణ, డైరెక్టర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
జేఎస్‌ఆర్ గ్రూప్ సన్ సిటీ కేరళ వరద బాధితులకు అండగా నిలిచింది. రూ.10 లక్షల నగదు ఆర్థిక సాయం అందజేసినట్లు జేఎస్‌ఆర్ గ్రూప్ సన్ సిటీ అధినేత దాక్టర్ జడపల్లి నారాయణ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా 100 క్వింటాళ్ల బియ్యం, 10 క్వింటాళ్ల కంది పప్పు, వాటర్ బాటిళ్లు, బట్టలు, బిస్కెట్ ప్యాకెట్లను ప్రత్యేక లారీలో కేరళలోని వరద బాధిత ప్రాంతాలకు పంపించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment