
ఎల్‌బీనగర్ జోన్‌లోని కామినేని ఫ్లైఓవర్ల కింద అతిపెద్ద ఉద్యానవనం అందుబాటులోకి రానుంది.
సాక్షి, హైదరాబాద్: నడక మార్గాలు, ఫౌంటెన్లు, శిల్పాలు, కూర్చునే బెంచీలు, పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక స్థలాలు, కెఫ్టేరియా.. ఇలా వివిధ సదుపాయాలతో ఆక్సిజన్‌ను అందించే పచ్చని మొక్కలతో ప్రత్యేక పార్కు త్వరలో నగర ప్రజలకు కనువిందు చేయనుంది. ఇన్ని సదుపాయాలు కలిగిన పార్కు బహిరంగ ప్రదేశంలో కాకుండా రెండు ఫ్లైఓవర్ల కింద ఏర్పాటవుతుండటమే విశేషం.
ఇప్పటికే షేక్‌పేట, బహదూర్‌పురా ఫ్లైఓవర్ల కింద సైతం పచ్చదనం ఉన్నప్పటికీ దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో ఇన్ని సదుపాయాలతో కూడిన అతిపెద్ద ఉద్యానవనం ఇదే కానుంది. ఎల్‌బీనగర్ జోన్‌లోని కామినేని ఫ్లైఓవర్ల కింద ఇది అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సివిల్ ఇంజినీరింగ్ పనులు జరుగుతున్న ఈ ప్రాంతంలో యాంఫీథియేటర్ సైతం రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (క్లిక్: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్)
దాదాపు కోటి రూపాయల వ్యయమవుతున్న ఈ పార్కుకు ఆక్సిజన్ పార్కుగా నామకరణం చేయనున్నారు. పరిసరాల్లో నివసించే ప్రజలకే కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆ మార్గంలో ప్రయాణించే వారికి సైతం పచ్చదనంతో కనువిందు చేయడంతోపాటు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించనుంది. ఖాళీ ప్రదేశాలను ప్రయోజనకరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ జీవవైవిధ్య విభాగం(యూబీడీ) డిజైన్ చేసిన ఈ ఆలోచన.. ఫ్లైఓవర్ల కింద పూర్తిస్థాయి పార్కు రాష్ట్రంలో ఇదే ప్రథమం. (క్లిక్: ఆర్టీసీకి ఆర్డరిస్తే మీ ఇంటికే బంగినపల్లి)