
అక్రమమా.. ఆస్తిపన్ను బాదుతాం!
►జరిమానాగా 25% నుంచి 100 % ఆస్తి పన్ను
►కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలపై జరిమానా విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా కట్టడాలపై 25 శాతం నుంచి 100 శాతం ఆస్తి పన్నును జరిమానాగా విధించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొ రేషన్(జీహెచ్‌ఎస్‌సీ)తో సహా రాష్ట్రం లోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపా లిటీలు, నగర పంచాయతీలను ప్రభు త్వం ఆదేశించింది. ఈ మేరకు కొత్త నిబంధ నలను అమల్లోకి తెస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఈ నెల 20న ఉత్తర్వులు జారీ చేశా రు. అక్రమ కట్టడాలను కూల్చివేసే వరకు సదరు కట్టడాలపై పెనాల్టీలను విధించాలని మున్సిపల్ కమిషనర్లను కోరారు.
జరిమానా విధింపు ఇలా...
బిల్డింగ్ ప్లాన్‌లో అనుమతించిన అంతస్తుల సెట్‌బ్యాక్‌ను 10 శాతం ఉల్లంఘిస్తే 25 శాతం ఆస్తి పన్నును జరిమానాగా విధిస్తారు. ప్లాన్‌లో అనుమతించిన అంతస్తుల సెట్‌బ్యాక్‌ను 10 శాతానికి మించి ఉల్లంఘిస్తే 50 శాతం ఆస్తి పన్నును జరిమానాగా వేస్తారు. అనుమతి లేని అంతస్తులను నిర్మిస్తే.. సదరు భాగానికి గాను 100 శాతం జరిమానా పడుతుంది. పూర్తిగా అక్రమ కట్టడాన్ని నిర్మిస్తే 100 శాతం ఆస్తి పన్నును జరిమానాగా విధించాలని ప్రభుత్వం ఆదేశించింది.
పెనాల్టీ కట్టినా అక్రమమే...
ప్రభుత్వ భూములు, వక్ఫ్, దేవాదాయ శాఖ భూములను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలతో పాటు స్థానిక నగర, పురపాలిక నుంచి బిల్డింగ్ ప్లాన్ అనుమతి లేకుండా అడ్డగోలుగా నిర్మించిన కట్టడాలపై కొరడా ఝుళిపించడానికి ప్రభుత్వం తాజాగా పెనాల్టీ నిబంధనలను జారీ చేసింది. పెనాల్టీ కట్టినా సదరు అక్రమ భవనాల క్రమబద్ధీకరణ జరగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్థానిక నగర, పురపాలికలు సదరు భవనాలకు నల్లా, డ్రైనేజీ, రోడ్డు, వీధి దీపాలు తదితర సౌకర్యాన్ని స్థానిక మున్సిపాలిటీలు కల్పిస్తున్నందున పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుందని పురపాలక శాఖ అధికారవర్గాలు తెలిపాయి. సదరు అక్రమ భవనాల కూల్చివేత వరకు పెనాల్టీలు వసూలు చేయనున్నారు.
అక్రమ కట్టడాలపై ప్రతి నెలా నివేదిక...
ప్రతి నెలా తమ వార్డు/డివిజన్ల పరిధిలోని అక్రమ కట్టడాల జాబితాతో తమ విభాగాధిపతికి నివేదికలను సమర్పించాలని క్షేత్ర స్థాయిలో పనిచేసే టౌన్‌ప్లానింగ్ ఓవర్సీయర్స్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ జాబితాలోని భవనాలపై పెనాల్టీలను నిర్ణయించి యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్లను కోరింది. నోటీసులు జారీ చేసిన 30 రోజుల తర్వాత నిర్ణీత పెనాల్టీ మొత్తాలను ఆస్తి పన్నులతో కలిపి కట్టాలని భవన యజమానులకు డిమాండ్ నోటీసులు జారీ చేయాలని సూచించింది. పెనాల్టీలకు ప్రత్యేక రశీదు జారీ చేయాలని, ప్రత్యేక రిజిస్టర్‌ను నిర్వహించాలని కోరింది.
‘కబ్జా’ భవనాలకు గులాబీ నోటీసులు
ప్రభుత్వ, వక్ఫ్, దేవదాయ, అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములను ఆక్రమించి నిర్మించిన భవనాలను 100 శాతం అక్రమం అని నిర్ధారించి పెనాల్టీల వసూళ్ల కోసం గులాబీ రంగు నోటీసులు జారీ చేయను న్నారు. ఈ భవనాలకు సంబంధించి ప్రత్యేక రిజిస్టర్‌ను కూడా నిర్వహిస్తారు.