అర్జీలకు దిక్కేది?
► జిల్లాలో అపరిష్కృత దరఖాస్తులు 1,33,220
► గడువు ముగిసినా పరిష్కారం కానివి 80,994
► రెండు, మూడురోజుల్లో గడువు ముగిసేవి 52,226
► తహసీల్దార్ కార్యాలయాల్లో భారీగా పెండింగ్ దరఖాస్తులు
► గడువు ముగిసినా పరిష్కరించని రెవెన్యూ అధికారులు
► చెప్పులరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అర్జీదారులు
జిల్లాలో పౌరసేవలు పడకేశాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్ దరఖాస్తులు గుట్టల్లా పేరుకుపోతున్నాయి. నిర్దేశిత గడువులోగా పరిష్కరించాల్సిన వాటిని పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఫలితంగా అర్జీదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలోని 37 మండలాల రెవెన్యూ కార్యాలయాల్లో గడువు దాటినా పరిష్కరించని దరఖాస్తులు 80,994 ఉన్నాయి. ఇవికాక మరో రెండు,మూడు రోజు ల్లోనే పరిష్కరించాల్సిన అర్జీలు 52,226 ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో 1,33,220 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా
సాక్షి, రంగారెడ్డి జిల్లా : భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ సాధారణ పాలనపై ప్రభావం చూపుతోంది. వివిధ పథకాల్లో లబ్ధికోసం అర్జీదారులు పెట్టుకున్న దరఖాస్తులు కార్యాలయాల్లో వేలల్లో మూలుగుతున్నాయి. అయితే వాటిని సకాలంలో పరిష్కరించాల్సిన అధికారులు భూ క్రమబద్ధీకరణ పనుల్లో భాగంగా చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో తలమునకలై ఉన్నారు. ఆయా మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నగర శివారు మండలాల్లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు.
దీంతో తహసీల్దార్ కార్యాలయాలు ఖాళీ కావడంతో క్షేత్రస్థాయిలో వచ్చే అర్జీల పరిష్కారం అటకెక్కింది. దాదాపు మూడు నెలలుగా రెవెన్యూ ఉద్యోగులంతా భూక్రమబద్ధీకరణ బిజీ పేరిట విధులు నిర్వహిస్తుండడంతో రోజువారీగా వచ్చే దరఖాస్తులన్నీ కార్యాలయాల్లో గుట్టల్లా పేరుకుపోయాయి.
కులధ్రువీకరణ అర్జీలే ఎక్కువ..
ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో పరిష్కారానికి నోచుకోని దరఖాస్తుల్లో అధికంగా కుల, ఆదాయ, అడంగల్ దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 9,904 కుల ధ్రువీకరణ దరఖాస్తులకు నిర్దేశిత గడువు ముగిసినా పరిష్కారం కాలేదు. అదేవిధంగా మరో 30,709 దరఖాస్తులకు త్వరలో గడువు ముగియనుంది. జిల్లాలో 6,867 ఆదాయ ధ్రువీకరణ దరఖాస్తుల పరిష్కారం కావాల్సి ఉండగా.. మరో 6,375 దరఖాస్తులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. వీటితోపాటు అడంగల్, పహాణీల దరఖాస్తులు మరో 15వేలు ఉన్నాయి.
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో పలువురు విద్యార్థులు పోటీ పరీక్షలు, కోర్సులలో ప్రవేశాలకు దూరమవుతున్నారు. ఇబ్రహీంపట్నం మండలం మండల్‌పల్లి గ్రామానికి చెందిన మహేందర్ ఇటీవల ఎస్‌బీఐ క్లర్క్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకుగాను కులధ్రువీకరణ కోరగా.. అధికారుల నిర్లక్ష్యంతో చివరకు జనరల్ కోటాలో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్నాడు. తనకు వచ్చిన మార్కులతో రిజర్వ్‌డ్ కోటాలో ఉద్యోగం దక్కేదని, స్థానిక అధికారుల నిర్లక్ష్యంతోనే ఉద్యోగానికి దూరమైనట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.