పెండింగ్ దరఖాస్తులు పరిష్కరిస్తే పెద్ద ఎత్తున ఆదాయం
కేబినెట్ సబ్ కమిటీకి నివేదించిన రెవెన్యూ శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సుమారు ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న జీవో 59ను అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయం రానుంది. ఈ జీవో కింద వచ్చిన 50వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా సుమారు రూ.6 వేల కోట్ల వరకు ఖజానాకు సమకూరుతుందని రెవెన్యూ శాఖ అంచనా వేసింది.
ఆదాయ వనరుల సమీకరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి దీనిపై నివేదిక కూడా సమర్పించింది. ఈ జీవో అమలును నిలిపివేయడానికి ముందువరకు రూ.534 కోట్ల ఆదాయం వచ్చిoదని.. మిగతా దరఖాస్తుల పరిష్కారం ద్వారా మరో రూ.500 కోట్లు వస్తాయని పేర్కొన్నట్టు తెలిసింది.
ఇదే జీవో కింద అధిక విలువ గల భూములను క్రమబద్దీకరిస్తే ఇంకో రూ.5,500 కోట్లు వస్తాయని... జీవో 76, 118 దరఖాస్తుల పరిష్కారం ద్వారా అదనంగా రూ.300 కోట్లు అందుతాయని వివరించినట్టు సమాచారం.
ఏడాది నుంచి ఎదురుచూపులే..
జీవో 59 కింద భూముల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఏడాది నుంచి ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ జీవోను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ హయాంలో కొందరు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నా... ఎలాంటి పలుకుబడి లేని సాధారణ ప్రజలు మాత్రం వీటి పరిష్కారం ఇంకెప్పుడు అంటూ ఆందోళన చెందుతున్నారు.
ఈ జీవో కింద పరిశీలన పూర్తయి డిమాండ్ నోటీసు మేరకు డబ్బులు పూర్తిగా చెల్లించినవారు, పాక్షిక మొత్తం చెల్లించినవారు, తనిఖీలు పూర్తిచేసుకున్న వారు, కన్వేయన్స్ డీడ్‌లు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం విధించిన స్టేతో ఆ భూములపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేనివారు వేల మంది ఉన్నారు. వారంతా కాంగ్రెస్ సర్కారు నిర్ణయం పట్ల ఆశతో ఉన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని, అదే క్రమంలో అర్హులైన వారికి భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రక్రియ కొనసాగుతుండగానే..
జీవో 59 కింద ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ కోసం 2022, 2023 సంవత్సరాల్లో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి 31 వేలు, మిగతా అన్ని జిల్లాల్లో 26 వేల వరకు.. మొత్తంగా 57 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రభుత్వం 32,788 దరఖాస్తులను ఆమోదించి సదరు లబ్దిదారులకు డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 10వేల మందికిపైగా ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి కన్వేయన్స్ డీడ్ (రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు) కూడా పొందారు.
డిమాండ్ నోటీసుల మేరకు డబ్బులు కట్టినా.. కన్వేయన్స్ డీడ్‌లు జారీకానివారు మరో 3 వేల మందికి పైగా ఉన్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం జరిగింది. గత ఏడాది డిసెంబర్ 7న కాంగ్రెస్ సర్కారు ఏర్పాటవగా.. అదే నెల 11వ తేదీ నుంచి ఈ జీవోకు సంబంధించిన పోర్టల్‌ను నిలిపివేశారు. ఆ జీవో కింద అప్పటికే చేసిన క్రమబద్దీకరణలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ జీవోను అడ్డుపెట్టుకుని విలువైన భూములను బీఆర్‌ఎస్ నేతలు క్రమబద్ధీకరించుకున్నారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్టు ప్రకటించింది. అయితే అలాంటివన్నీ ముందే జరిగిపోయాయని... సాధారణ ప్రజల దరఖాస్తులే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని దరఖాస్తు దారులు పేర్కొంటున్నారు. హక్కులు కల్పించని కారణంగా ఈ భూములు ఇటు తమవి కాకుండా, అటు ప్రభుత్వానివి కాకుండా మిగిలిపోతున్నాయని పేర్కొంటున్నారు.
అసలు జీవో 59 ఏంటి?
తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకుని ఉంటున్న పేదలకు ఆ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2014 డిసెంబర్ 30న తొలిసారి జీవో 59 విడుదల చేసింది. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 2022, 2023 సంవత్సరాల్లో ఆ జీవోలో స్వల్ప మా ర్పులు చేస్తూ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేశారు.
చివరిగా 2023లో విడుదల చేసిన జీవో ప్రకారం... క్రమబద్దీకరణ కోసం 125 నుంచి 250 గజాల వరకు స్థలాలకు మార్కెట్ విలువలో 25 శాతం... 250 గజాల నుంచి 500 గజాల ఉన్న స్థలాలకు 50శాతం, 500–750 గజాల స్థలాలకు 75శాతం, 750 గజాలపైన ఉంటే మార్కెట్ విలువలో 100 శాతం సొమ్ము చెల్లించాలి. క్రమబద్దీకరణ సంబంధించిన మరో జీవో 58 ప్రకారం... 125 చదరపు గజాలలోపు భూమిలో నిర్మాణాలుంటే ప్రభుత్వం ఉచితంగా క్రమబద్దీకరిస్తుంది.
తొలుత 2014 జూన్ 2 నాటికి ఆక్రమణలో ఉన్న భూములను క్రమబద్దీకరిస్తామని జీవోలో పేర్కొన్నా.. 2023లో విడుదల చేసిన జీవోలో దరఖాస్తు చేసుకునే నాటికి ఆక్రమణలో ఉన్నా క్రమబద్దీకరిస్తామని సర్కారు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment