మీరు..కాదు మీరే!
సాక్షి, సిటీబ్యూరో : హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమవుతోన్న వినాయక విగ్రహ వ్యర్థాల తొలగింపు వ్యవహారం ఎవరికీ పట్టని అంశంగా మారింది. సాగర్‌లో నిమజ్జనమైన విగ్రహాలను వెలికి తీయకపోవడంతో అవి సాగర గర్భంలోకి జారిపోతూ జలాశయాన్ని మరింత కలుషితం చేస్తున్నాయి. చవితినాడు మంటపాల్లో కొలువుదీరి పూజలందుకొన్న గణనాథుని మూడోరోజు నుంచే హుస్సేన్‌సాగర్‌లో జలప్రవేశం చేయించడం పరిపాటి. నిమజ్జనమైన విగ్రహాలు నీటి లోతుల్లోకి జారిపోకుండా ఏరోజుకారోజు వెలికితీసి బయటకు తరలిస్తుంటారు. ఏటా ఈ క్రతువును హెచ్‌ఎండీఏ నిర్వహించేది.
ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా నిమజ్జన వ్యర్థాల తొలగింపు కోసం ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకొని రూ.22 లక్ష ల వ్యయ అంచనాలతో టెండర్లు కూడా ఆహ్వానించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకొంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలపై ఇటీవల హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వద్ద జరిగిన సమావేశంలో నిమజ్జన వ్యవహారంపై చర్చించారు. సాగర్‌లో నిమజ్జనమయ్యే వినాయక విగ్రహ వ్యర్థాలను బయటకు తరలించే బాధ్యతను ఈసారి తామే నిర్వహిస్తామంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు హామీ ఇచ్చారు. దీంతో హెచ్‌ఎండీఏ అధికారులు నిమజ్జన వ్యర్థాల తొలగింపు వ్యవహారం నుంచి పక్కకు తప్పుకొన్నారు.
ఈ విషయమై ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో ఇప్పటికే పిలిచిన టెండర్‌ను సైతం హెచ్‌ఎండీఏ అధికారులు పక్కకు పెట్టేశారు. మూడోరోజైన శనివారం నుంచే వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం మొదలైంది. ఎన్టీఆర్ మార్గ్ వైపు 3 భారీ క్రేన్లు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. అయితే.... వీటి తాలూకు వ్యర్థాలను ఆదివారం నుంచే తొలగించాల్సి ఉండగా అటు జీహెచ్‌ఎంసీ కానీ, ఇటు హెచ్‌ఎండీఏ అధికారులుగానీ పట్టించుకోకపోవడంతో గణేష్ ప్రతిమలు నీటిలో మునిగిపోతున్నాయి. ఏరోజుకారోజు నిమజ్జన వ్యర్థాలను తొలగించకపోవడంతో వాటికి వినియోగించిన విష రసాయనాలు నీటిలో కరిగిపోయి సాగర్‌ను కాలుష్య కాసారంగా మార్చేస్తున్నాయంటూ పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎడ మొహం... పెడ మొహం :
హైదరాబాద్ నగరాన్ని అందంగా తీర్చిదిద్ది పౌర వసతులు కల్పించాల్సిన జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు పరస్పర అవగాహనా రాహిత్యంతో సమస్యలు సృష్టించుకొంటున్నాయి. ప్రజలకు ప్రాథమిక వసతులు, సౌకర్యాలు కల్పించాల్సిన రెండు ప్రధాన ప్రభుత్వ విభాగాల మధ్య సఖ్యత కొరవడటం హుస్సేన్‌సాగర్‌కు శాపంగా మారింది. అధికార పరిధులు, పరిమితులు, అనుమతుల విషయంలో నువ్వా... నేనా... అంటూ తలపడుతున్న ఈ రెండు విభాగాలు ఇప్పుడు గణేశ్ నిమజ్జన సందర్భాన్ని ఓ వేదికగా మార్చుకొన్నాయి.
ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవంటూ హెచ్‌ఎండీఏ భావిస్తుండగా, ఏటా జరుగుతున్న ప్రకారమే సాగర్ శుద్ధి ప్రక్రియ సాగుతుందని జీహెచ్‌ఎంసీ అధికారులు ఎవరికి వారు భీష్మించుకు కూర్చున్నారు. ఇలాంటి తరుణంలో పరస్పరం సహకరించుకోవాల్సిన జీహెచ్‌ఎంసీ - హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు ఎడ మొహం... పెడ మొహంగా ఉంటున్నారు. అయితే... హెచ్‌ఎండీఏ మాత్రం ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకుండా సాగర్ శుద్ధి విషయంలో జోక్యం చేసుకోరాదనుకొంటోంది.
కానీ ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే రంగంలోకి దిగేందుకు అందరూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ శాలినీ మిశ్రా అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. నిమజ్జన వ్యర్థాలను కవాడీగూడలోని డంపింగ్ యార్డ్‌కు తరలించేందుకు జీహెచ్‌ఎంసీ అంగీకరించట్లేదని, ఫలితంగానే ఈ వ్యవహారం గందరగోళంగా మారిందని తెలుస్తోంది.