సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధి అవతల కొత్త లేఔట్ల అనుమతులకు పురపాలక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. తాత్కాలిక లే ఔట్‌కు అనుమతి ఇచ్చే సమయంలోనే.. ఆ స్థలంలో 15 శాతాన్ని సంబంధిత మున్సిపాలిటీ/ కార్పొరేషన్‌కు మార్టిగేజ్(తనఖా) చేయాలని స్పష్టం చేసింది. అలా చేస్తేనే తాత్కాలిక లేఔట్ అనుమతి ఇవ్వాలని, తుది లే ఔట్ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే తనఖా పెట్టిన ప్లాట్లను విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో అపార్ట్‌మెంట్‌ల నిర్మాణానికి సంబంధించి మార్టిగేజ్ నిబంధన ఉంది. ఇప్పుడు హెచ్‌ఎండీఏ అవతల జిల్లాల్లోనూ దీనిని అమలు చేయనున్నారు.
ఖాళీ స్థలాన్ని ముందే చూపాలి
లే ఔట్ల విస్తీర్ణం ఆధారంగా వదలాల్సిన ఖాళీ స్థలా లను ముందుగానే గుర్తించి.. అనుమతికి దరఖాస్తు చేసుకునే సమయంలోనే తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. జిల్లాల్లోని లే ఔట్లలో కనీస ప్లాటు విస్తీర్ణం 50 చదరపు మీటర్లుగా నిర్ణయించారు. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో.. 1965, 1970ల నాటి లేఔట్ నిబంధనలన్నీ రద్దవుతాయని, కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని పురపాలక శాఖ స్పష్టం చేసింది. లేఔట్ కు వెళ్లే రహదారి కనీసంగా 18 మీటర్ల వెడల్పు ఉండాలని.. అంతకన్నా తక్కువగా ఉంటే ఆ రో డ్డును 18 మీటర్లకు విస్తరించే విధంగా వందశాతం రోడ్ ఇంపాక్ట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పే ర్కొంది. జిల్లాల్లో లే ఔట్ల అనుమతిపై కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు తుది నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది. లే ఔట్‌లో ఖాళీగా వదిలే స్థలాలను సంబంధిత స్థానిక సంస్థకు రిజిస్టర్ చేయాలని సూచించింది.
ప్రభుత్వ ఉత్తర్వుల్లోని మరిన్ని కీలక అంశాలు
♦ జిల్లాల్లో కలెక్టర్ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) మెంబర్ కన్వీనర్‌గా, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, నీటి పారుదల, డీటీసీపీవో, కలెక్టర్ నియమించే మరో నామినీ సభ్యులుగా ఉంటారు.
♦ లే ఔట్‌కు దరఖాస్తు చేసుకునే వారు వంద రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్‌పై సెల్ప్ సర్టిఫికేషన్ ఇవ్వాలి.
♦ దరఖాస్తు సమయంలో రూ. పదివేలు ఫీజు చెల్లించాలి. తాజా ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్, భూమార్పిడి సర్టిఫికెట్, అనుమతించిన మాస్టర్‌ప్లాన్/డీటెయిల్డ్ టౌన్ ప్లానింగ్ స్కీమ్ కాపీ జత చేయాలి.
♦ నది/సరస్సు/చెరువు/కుంట/నాలాకు 200 మీటర్ల దూరంలో లేఔట్ ఉన్నట్టు నీటిపారుదల శాఖ ఎన్‌వోసీ తీసుకోవాలి.
♦ 50 హెక్టార్లపైబడిన లే ఔట్‌కు పర్యావరణ అనుమతులు తప్పనిసరి.
♦ లేఔట్‌కు రోడ్డు పొడవు ఆధారంగా.. రోడ్డు వెడల్పు ఎంత ఉండాలన్నది వర్తిస్తుంది. 300 మీటర్ల రోడ్డు అయితే 9 మీటర్ల వెడల్పు, 500 మీటర్లలోపు ఉంటే 12 మీటర్లు, 1000 మీటర్లలోపు ఉంటే 18 మీటర్లు, వెయ్యి మీటర్ల కంటే ఎక్కువ పొడవైన రోడ్డు ఉంటే 24 మీటర్ల వెడల్పుతో రహదారి ఉండాలి.
♦ లే ఔట్‌లో కనీసం పది శాతం ఖాళీ స్థలం ఉండాలి. అందులో 9 శాతం పచ్చదనానికి, ఒక శాతం ఇతర అవసరాల కోసం వినియోగించాలి.
♦ సామాజిక మౌలిక సదుపాయాల కోసం అదనంగా 2.5శాతం కేటాయించాలి
♦ కనీస ప్లాటు విస్తీర్ణం 50 చదరపు మీటర్లు.. వెడల్పు కనీసం ఆరు మీటర్లు ఉండాలి.
♦ ప్లాటెడ్ ఏరియాలో 15 శాతాన్ని మున్సిపాలిటీ/కార్పొరేషన్‌కు తనఖా చేయాలి. 50 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో లే ఔట్ ఉంటే.. విద్య, ఆరోగ్య, వాణిజ్య అవసరాలకు అదనంగా స్థలాలు కేటాయించాలి.
♦ నీటి వనరులకు దగ్గర ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్)లో ఎలాంటి అనుమతులు ఇవ్వరు.
♦ నదులు/వాగులకు 50 మీటర్లలోపు అనుమతులు ఇవ్వరు. చెరువులు/కుంటలు/ట్యాంకులకు కనీసం 30 మీటర్ల దూరంలో ఉంటేనే 10 హెక్టార్ల లే ఔట్‌లకు అనుమతిస్తారు. పదిహెక్టార్లలోపు ఉంటే 9 మీటర్ల సరిహద్దు ఉండాలి.
♦ నాలాలు, కాలువలు, వాగు, వరద నీటి కాలువల (పది మీటర్ల వెడల్పు ఉన్నవి)కు రెండు మీటర్ల కనీస సరిహద్దు ఉంటే అనుమతిస్తారు.
♦ హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు ఉంటే.. కింద స్థలాన్ని గ్రీన్‌ఫీల్డ్ జోన్‌గా గుర్తిస్తారు. వాటిలో రహదారులు వేసుకోవచ్చు, లేదా గ్రీనరీ పెంచాలి. గ్రీన్‌ఫీల్డ్ జోన్‌కు కనీసం మూడు దూరంలోనే ప్లాట్లు చేయాలి.
♦ రైల్వే ఆస్తులకు సమీపంలో కనీసం 30 మీటర్లు దూరంలో లే ఔట్ అభివృద్ధి చేయాలి.
♦ రక్షిత పురాతన నిర్మాణాల నుంచి కనీసం 100 నుంచి 200 మీటర్ల దూరంలోపు ఉంటే సంబంధిత శాఖ నుంచి ఎన్‌వోసీ తీసుకోవాలి. ఆయిల్, నేచురల్ గ్యాస్ పైపులైన్లకు సమీపంలో లేఔట్లు ఉంటే వారి దగ్గర నుంచి ఎన్‌వోసీ తీసుకోవాలి.
♦ లే ఔట్ కోసం అన్ని పత్రాలతో సరిగా దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో తాత్కాలిక అనుమతులు ఇస్తారు. లేని పక్షంలో అనుమతులు లభించినట్లు భావించాలి.
♦ దరఖాస్తులో ఏవైనా లోపాలు ఉంటే.. 10 రోజుల్లోగా సంబంధిత అధికారులు వాటిని వివరిస్తూ ఆన్‌లైన్‌లోనే సమాచారం ఇస్తారు. లే ఔట్ చేసే సంస్థలు/వ్యక్తులు వాటిని ఏడు రోజుల్లోగా సవరించి సమర్పించాలి.
♦ తాత్కాలిక లేఔట్‌ను ఆమోదించిన రెండేళ్లలో అన్ని సౌకర్యాలతో లేఔట్ పూర్తి చేయాలి. తాత్కాలిక లేఔట్ కోసం చెల్లించిన ఫీజులో అదనంగా 20 శాతం ఫీజు చెల్లిస్తే మరో సంవత్సరం పొడిగింపు ఇస్తారు.
♦ అన్నీ సక్రమంగా ఉంటే తుది లేఔట్ మంజూరు చేసి. తనఖా పెట్టిన స్థలాలను 21 రోజుల్లోగా విడుదల చేస్తారు.
HMDA:మార్టిగేజ్ చేశాకే తాత్కాలిక లేఔట్లు!
Published Tue, Jul 13 2021 12:26 PM | Last Updated on Tue, Jul 13 2021 4:23 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment