Mortgage Process
-
HMDA:మార్టిగేజ్ చేశాకే తాత్కాలిక లేఔట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధి అవతల కొత్త లేఔట్ల అనుమతులకు పురపాలక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. తాత్కాలిక లే ఔట్‌కు అనుమతి ఇచ్చే సమయంలోనే.. ఆ స్థలంలో 15 శాతాన్ని సంబంధిత మున్సిపాలిటీ/ కార్పొరేషన్‌కు మార్టిగేజ్(తనఖా) చేయాలని స్పష్టం చేసింది. అలా చేస్తేనే తాత్కాలిక లేఔట్ అనుమతి ఇవ్వాలని, తుది లే ఔట్ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే తనఖా పెట్టిన ప్లాట్లను విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో అపార్ట్మెంట్ల నిర్మాణానికి సంబంధించి మార్టిగేజ్ నిబంధన ఉంది. ఇప్పుడు హెచ్ఎండీఏ అవతల జిల్లాల్లోనూ దీనిని అమలు చేయనున్నారు. ఖాళీ స్థలాన్ని ముందే చూపాలి లే ఔట్ల విస్తీర్ణం ఆధారంగా వదలాల్సిన ఖాళీ స్థలా లను ముందుగానే గుర్తించి.. అనుమతికి దరఖాస్తు చేసుకునే సమయంలోనే తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. జిల్లాల్లోని లే ఔట్లలో కనీస ప్లాటు విస్తీర్ణం 50 చదరపు మీటర్లుగా నిర్ణయించారు. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో.. 1965, 1970ల నాటి లేఔట్ నిబంధనలన్నీ రద్దవుతాయని, కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని పురపాలక శాఖ స్పష్టం చేసింది. లేఔట్ కు వెళ్లే రహదారి కనీసంగా 18 మీటర్ల వెడల్పు ఉండాలని.. అంతకన్నా తక్కువగా ఉంటే ఆ రో డ్డును 18 మీటర్లకు విస్తరించే విధంగా వందశాతం రోడ్ ఇంపాక్ట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పే ర్కొంది. జిల్లాల్లో లే ఔట్ల అనుమతిపై కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు తుది నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది. లే ఔట్లో ఖాళీగా వదిలే స్థలాలను సంబంధిత స్థానిక సంస్థకు రిజిస్టర్ చేయాలని సూచించింది. ప్రభుత్వ ఉత్తర్వుల్లోని మరిన్ని కీలక అంశాలు ♦ జిల్లాల్లో కలెక్టర్ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) మెంబర్ కన్వీనర్‌గా, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటి పారుదల, డీటీసీపీవో, కలెక్టర్ నియమించే మరో నామినీ సభ్యులుగా ఉంటారు. ♦ లే ఔట్‌కు దరఖాస్తు చేసుకునే వారు వంద రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్‌పై సెల్ప్ సర్టిఫికేషన్ ఇవ్వాలి. ♦ దరఖాస్తు సమయంలో రూ. పదివేలు ఫీజు చెల్లించాలి. తాజా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, భూమార్పిడి సర్టిఫికెట్, అనుమతించిన మాస్టర్‌ప్లాన్/డీటెయిల్డ్ టౌన్ ప్లానింగ్ స్కీమ్ కాపీ జత చేయాలి. ♦ నది/సరస్సు/చెరువు/కుంట/నాలాకు 200 మీటర్ల దూరంలో లేఔట్ ఉన్నట్టు నీటిపారుదల శాఖ ఎన్వోసీ తీసుకోవాలి. ♦ 50 హెక్టార్లపైబడిన లే ఔట్‌కు పర్యావరణ అనుమతులు తప్పనిసరి. ♦ లేఔట్‌కు రోడ్డు పొడవు ఆధారంగా.. రోడ్డు వెడల్పు ఎంత ఉండాలన్నది వర్తిస్తుంది. 300 మీటర్ల రోడ్డు అయితే 9 మీటర్ల వెడల్పు, 500 మీటర్లలోపు ఉంటే 12 మీటర్లు, 1000 మీటర్లలోపు ఉంటే 18 మీటర్లు, వెయ్యి మీటర్ల కంటే ఎక్కువ పొడవైన రోడ్డు ఉంటే 24 మీటర్ల వెడల్పుతో రహదారి ఉండాలి. ♦ లే ఔట్లో కనీసం పది శాతం ఖాళీ స్థలం ఉండాలి. అందులో 9 శాతం పచ్చదనానికి, ఒక శాతం ఇతర అవసరాల కోసం వినియోగించాలి. ♦ సామాజిక మౌలిక సదుపాయాల కోసం అదనంగా 2.5శాతం కేటాయించాలి ♦ కనీస ప్లాటు విస్తీర్ణం 50 చదరపు మీటర్లు.. వెడల్పు కనీసం ఆరు మీటర్లు ఉండాలి. ♦ ప్లాటెడ్ ఏరియాలో 15 శాతాన్ని మున్సిపాలిటీ/కార్పొరేషన్‌కు తనఖా చేయాలి. 50 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో లే ఔట్ ఉంటే.. విద్య, ఆరోగ్య, వాణిజ్య అవసరాలకు అదనంగా స్థలాలు కేటాయించాలి. ♦ నీటి వనరులకు దగ్గర ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)లో ఎలాంటి అనుమతులు ఇవ్వరు. ♦ నదులు/వాగులకు 50 మీటర్లలోపు అనుమతులు ఇవ్వరు. చెరువులు/కుంటలు/ట్యాంకులకు కనీసం 30 మీటర్ల దూరంలో ఉంటేనే 10 హెక్టార్ల లే ఔట్లకు అనుమతిస్తారు. పదిహెక్టార్లలోపు ఉంటే 9 మీటర్ల సరిహద్దు ఉండాలి. ♦ నాలాలు, కాలువలు, వాగు, వరద నీటి కాలువల (పది మీటర్ల వెడల్పు ఉన్నవి)కు రెండు మీటర్ల కనీస సరిహద్దు ఉంటే అనుమతిస్తారు. ♦ హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు ఉంటే.. కింద స్థలాన్ని గ్రీన్‌ఫీల్డ్ జోన్‌గా గుర్తిస్తారు. వాటిలో రహదారులు వేసుకోవచ్చు, లేదా గ్రీనరీ పెంచాలి. గ్రీన్‌ఫీల్డ్ జోన్‌కు కనీసం మూడు దూరంలోనే ప్లాట్లు చేయాలి. ♦ రైల్వే ఆస్తులకు సమీపంలో కనీసం 30 మీటర్లు దూరంలో లే ఔట్ అభివృద్ధి చేయాలి. ♦ రక్షిత పురాతన నిర్మాణాల నుంచి కనీసం 100 నుంచి 200 మీటర్ల దూరంలోపు ఉంటే సంబంధిత శాఖ నుంచి ఎన్వోసీ తీసుకోవాలి. ఆయిల్, నేచురల్ గ్యాస్ పైపులైన్లకు సమీపంలో లేఔట్లు ఉంటే వారి దగ్గర నుంచి ఎన్వోసీ తీసుకోవాలి. ♦ లే ఔట్ కోసం అన్ని పత్రాలతో సరిగా దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో తాత్కాలిక అనుమతులు ఇస్తారు. లేని పక్షంలో అనుమతులు లభించినట్లు భావించాలి. ♦ దరఖాస్తులో ఏవైనా లోపాలు ఉంటే.. 10 రోజుల్లోగా సంబంధిత అధికారులు వాటిని వివరిస్తూ ఆన్లైన్లోనే సమాచారం ఇస్తారు. లే ఔట్ చేసే సంస్థలు/వ్యక్తులు వాటిని ఏడు రోజుల్లోగా సవరించి సమర్పించాలి. ♦ తాత్కాలిక లేఔట్‌ను ఆమోదించిన రెండేళ్లలో అన్ని సౌకర్యాలతో లేఔట్ పూర్తి చేయాలి. తాత్కాలిక లేఔట్ కోసం చెల్లించిన ఫీజులో అదనంగా 20 శాతం ఫీజు చెల్లిస్తే మరో సంవత్సరం పొడిగింపు ఇస్తారు. ♦ అన్నీ సక్రమంగా ఉంటే తుది లేఔట్ మంజూరు చేసి. తనఖా పెట్టిన స్థలాలను 21 రోజుల్లోగా విడుదల చేస్తారు. -
తనఖా తప్పనిసరి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలక సంస్థల్లో ఇకపై చేపట్టనున్న అన్ని భవన నిర్మాణాలకు తనఖా నిబంధన తప్పనిసరి కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సహా అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో 200 చదరపు మీటర్ల వరకు, మున్సిపాలిటీల్లో 300 చదరపు మీటర్ల వరకు ఉన్న స్థలాల్లో.. గరిష్టంగా 7 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు తనఖా నిబంధన నుంచి మినహాయింపు ఉంది. అంతకు మించిన స్థలాల్లో, ఎత్తుతో నిర్మించే భవనాల్లో పది శాతం నిర్మాణ స్థలాన్ని స్థానిక పురపాలక సంస్థకు తనఖా పెట్టాల్సి ఉంటుంది. భవన నిర్మాణ నిబంధనలను, అనుమతులను ఉల్లంఘిస్తే.. సదరు భవనం/నిర్మాణంలో తనఖా పెట్టిన భాగాన్ని సదరు పురపాలక సంస్థ స్వాధీనం చేసేసుకుంటుంది. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టకుండా నియంత్రించేందుకు ఈ ‘తనఖా’నిబంధనను అమలు చేస్తున్నారు. ఇక ముందు పురపాలక సంస్థల్లో చేపట్టే అన్ని భవన నిర్మాణాలకు ఎలాంటి మినహాయింపు లేకుండా ఈ నిబంధన వర్తించనుంది. ఉల్లంఘిస్తే స్వాధీనమే.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పట్టణాభివృద్ధికి, ఇళ్లు, భవనాల నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్, నిబంధనలు ఉంటాయి. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను నియంత్రించేందుకు పలు నిబంధనలు ఉన్నాయి. అయితే భవనం ముందుభాగంలో, చుట్టూ ఖాళీ స్థలం వదలడం (సెట్‌బ్యాక్), ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిమితులు, స్థలం విస్తీర్ణం మేరకు భవనం ఎత్తు, అంతస్తులు ఉండటం వంటి నిబంధనలను యజమానులు సరిగా పట్టించుకోవడం లేదు. దాంతో నిబంధనలను ఉల్లంఘించి విచ్చలవిడిగా నిర్మాణాలు జరపకుండా పురపాలక శాఖ ‘తనఖా’నిబంధనను అమల్లోకి తెచ్చింది. మున్సిపాలిటీల్లో 300 చదరపు మీటర్లకుపైగా, కార్పొరేషన్లలో 200 చదరపు మీటర్లకుపైగా విస్తీర్ణంలో భవనాలు నిర్మించేవారు.. ఆయా నిర్మాణ వైశాల్యంలో 10 శాతం భాగాన్ని స్థానిక పురపాలికకు తనఖా పెట్టిన తర్వాతే భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తున్నారు. ఈ మేరకు యజమానులు నిర్మాణ వైశాల్యంలోని 10 శాతం భాగాన్ని నోటరీ అఫిడవిట్ ద్వారా పురపాలక సంస్థకు తనఖా పెట్టాలి. రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన నిషేధిత ఆస్తుల జాబితాలో ఈ తనఖా పెట్టిన ప్రాంతాన్ని చేర్పించాలి. ఆ తర్వాతే భవన నిర్మాణ అనుమతులు జారీ అవుతాయి. అనుమతుల మేరకు భవన నిర్మాణం జరిగిందని అధికారులు ధ్రువీకరించిన తర్వాతే.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ అవుతుంది. ఈ సర్టిఫికెట్‌ను చూపిస్తేనే.. తనఖా పెట్టిన 10 శాతం భాగాన్ని యజమాని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుంటుంది. ఎవరైనా అనుమతులను ఉల్లంఘించి నిర్మాణాలు జరిపితే.. తనఖా పెట్టిన 10 శాతం భాగాన్ని స్వాధీనం చేసుకునే అధికారం స్థానిక మున్సిపాలిటీలకు ఉంటుంది. ప్లాట్లను విభజిస్తూ నిర్మాణాలు... తనఖా నిబంధన నుంచి తప్పించుకోవడానికి అధిక శాతం యజమానులు ప్లాట్లను విభజించి.. వేర్వేరు నిర్మాణాలుగా చూపిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. పెద్ద స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్నా.. వాటిని నిబంధనల మేరకు మున్సిపాలిటీల్లో 300 చదరపు మీటర్లలోపు, కార్పొరేషన్లలో 200 చదరపు మీటర్లలోపు నిర్మాణాలుగా విభజించి.. తనఖా పెట్టకుండానే భవన నిర్మాణ అనుమతులు పొందుతున్నట్టు తేల్చారు. అనంతరం నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరుపుతున్నారని గుర్తించారు. నిబంధనల ప్రకారం ఇలాంటి భవనాలను కూల్చివేయడం తప్ప ఇతర ఏ చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. కానీ కూల్చివేత వంటి తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి పురపాలికలు వెనకడుగు వేస్తున్నాయి. అసలు తనఖా నిబంధన నుంచి తప్పించుకోవడానికి ప్లాట్లను విభజించి అనుమతులు పొందాలని.. లైసెన్డ్ బిల్డింగ్ ప్లానర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, పురపాలికల టౌన్ ప్లానింగ్ సిబ్బందే సలహాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మినహాయింపులను తొలగించి.. అన్ని భవన నిర్మాణాలకు 10 శాతం తనఖా నిబంధనను వర్తింపజేయాలని రాష్ట్ర పురపాలక శాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే.. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనుంది. -
సామాన్యుని నెత్తిన ‘తనఖా’!
సాక్షి, హైదరాబాద్: సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి షాకివ్వనుంది. అనుమతి ప్రకారం నిర్మాణాలు జరిగేలా చూసేందుకంటూ తీసుకొచ్చిన తనఖా విధానం కాస్తా ఇప్పుడు జనం పాలిట గుదిబండలా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 200 చదరపు గజాలు, ఇతర ప్రాంతాల్లో 300 చదరపు గజాల స్థలంలో నిర్మించే ఇళ్లు విధిగా అనుమతించిన ప్రణాళిక (ప్లాన్) ప్రకారమే ఉండాలంటూ తనఖా విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ తనఖా కోసం గృహ నిర్మాణానికి అనుమతిచ్చే స్థానిక సంస్థకు సదరు యజమానులు రూ.100 స్టాంప్ పేపర్‌పై రాసిస్తే ఇప్పటిదాకా సరి పోయేది. దీని ఆధారంగా తనఖా పెట్టిన విస్తీర్ణాన్ని విక్రయించడానికి వీల్లేకుండా సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ప్రొహిబిటరీ రిజిస్టర్ (విక్రయాల నిషేధ పుస్తకం)లో నమోదు చేసేవారు. కానీ ఇలా నమోదు చేయడం వల్ల తనకొచ్చే ఆదాయమేమీ లేదని భావించిందో ఏమో, ఇకపై ఇలా విక్రయాల నిషేధ పుస్తకంలో నమోదు చేయాలంటే ఫీజు చెల్లించాల్సిందేనని ప్రభుత్వం మెలిక పెట్టింది. ఇందుకోసం 3 శాతం ఫీజు చెల్లించాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పట్టుబడుతున్నారు. ఇళ్లు కట్టుకునే వారికి ఇదో అదనపు భారంగా మారింది. తనఖా విస్తీర్ణం విలువపై 3 శాతమంటే వేలల్లో ఫీజు కట్టాల్సి వస్తుంది. పైగా తనఖాను విడిపించుకునే సమయంలోనూ మళ్లీ ఫీజు చెల్లించాలన్న అధికారుల వైఖరితో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. నిబంధనలను చూపుతూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఈ విధానాన్ని పలుచోట్ల వసూలు చేస్తున్నారు. ఇంకొన్నిచోట్ల రూ.100 బాండ్ పేపర్ రాసిచ్చినా ఆమోదిస్తున్నారు. ఇకపై అంతటా కొత్త విధానాన్నే అమలు చేయాలని పురపాలక శాఖ అధికారులు తాజాగా నిర్ణయించారు. స్టాంప్ పేపర్‌పై రాయడం కంటే ఇందుకోసం రూ.5,000 ఫీజు వసూలు చేయాలని నిర్ణయించి, ఫైలును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదానికి పంపారు. రిజిస్ట్రేషన్ శాఖ వసూలు చేసే ఈ ఫీజును తనఖా విడుదల సమయంలో తిరిగి చెల్లించడం కూడా ఉండబోదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పైగా తనఖా విధానాన్ని 100 చదనపు గజాలకు కుదించాలని కూడా ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. అదే జరిగితే ఖజానాకు ఆదాయం మరింత పెరుగుతుంది.