ఇలాగేనా.. అక్రమాలను అరికట్టలేరా.. | HMDA fires on panchayat secretaries | Sakshi
Sakshi News home page

ఇలాగేనా.. అక్రమాలను అరికట్టలేరా..

Published Sun, Jan 14 2018 10:37 AM | Last Updated on Sun, Jan 14 2018 10:37 AM

HMDA fires on panchayat secretaries - Sakshi

అక్రమ లేఅవుట్లపై హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) కన్నెర్ర జేసింది. అక్రమార్కులకు ముకుతాడు వేయడంలో పంచాయతీ కార్యదర్శులు నిర్లిప్త వైఖరి అవలంభిస్తున్నారని ఆక్షేపించింది. అనధికార లేఅవుట్లలో అనుమతులు మంజూరు చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తప్పుబట్టింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారికి లేఖ రాసింది. దీంతో తేరుకున్న జిల్లా యంత్రాంగం.. అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని కార్యదర్శులను హెచ్చరించింది. అక్రమ లేఅవుట్ల ఏర్పాటును ప్రోత్సాహించినా.. అనధికార బిల్డింగ్‌ పర్మిషన్లు ఇచ్చినా ఊరుకునేదిలేదని స్పష్టం చేసింది. ఎక్కడైనా ఇలాంటి లేఅవుట్లు వెలుస్తున్నట్లు తెలిస్తే తక్షణమే హెచ్‌ఎండీఏ దృష్టికి తేవాలని సూచించింది.  

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్, ఘట్‌కేసర్‌ గ్రామ పంచాయతీల్లో జరిగిన అవకతవకలను ఎత్తిచూపిన హెచ్‌ఎండీఏ.. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సహించేదిలేదని తేల్చిచెప్పింది. మాజీ సర్పంచ్‌లు పాత తేదీలతో అనుమతులు ఇస్తున్నారని.. కొందరు కార్యదర్శులు బిల్డింగ్‌ పర్మిషన్ల దరఖాస్తులను వేర్వేరు రిజిష్టర్లలో నమోదు చేస్తూ తెరచాటు వ్యవహారాలు నెరుపుతున్నట్టు నిగ్గు తేల్చింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారని హెచ్‌ఎండీఏ గుర్తించింది. లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా చోద్యం చూస్తున్న కార్యదర్శులు.. వెంచర్లు వెలవకముందే నిర్మాణ అనుమతులు ఇచ్చినట్లు రికార్డులు సృష్టించినట్లు విచారణలో తేలింది.

చట్టవిరుద్ధ లేఅవుట్లు, అనధికార నిర్మాణాలను నివారించడానికి సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని కోరింది. బిల్డర్‌/డెవలపర్‌ చేసే అక్రమ కట్టడాలను గుర్తించి తక్షణమే సదరు సంస్థలు/వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని సూచించింది. అంతేగాకుండా అనధికార నిర్మాణాలను కూల్చివేసే సమయంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా మొత్తం తంతును రికార్డింగ్‌ చేయాలని జిల్లా యంత్రాంగానికి రాసిన లేఖలో కోరింది. కాగా, తమ పరిధిలోని కార్యదర్శుల వ్యవహారశైలిపై పెదవివిరిచిన హెచ్‌ఎండీఏ.. అక్రమాలపై మేల్కొనకపోతే ప్రభుత్వం రాబడి కోల్పోవడమేగాకుండా కనీస సౌకర్యాల కల్పన కష్టమని స్పష్టం చేసింది.

ఇదేం కిరికిరి..
అక్రమ లేఅవుట్లపై జిల్లా యంత్రాంగం ద్వంద్వ విధానాన్ని అవలంభిస్తోంది. చట్ట విరుద్ధంగా వెలిసిన లేఅవుట్లపై కొరడా ఝళిపించమని ఒకవైపు చెబుతూ.. మరోవైపు వాటిలో పది శాతం స్థలాన్ని గిఫ్ట్‌డీడ్‌ కింద రిజిస్ట్రేషన్‌ చేయించుకోమనడం విడ్డూరంగా ఉంది. ఇది పంచాయతీ కార్యదర్శులకు తలనొప్పిగా తయారైంది.  స్థల స్వాధీనంతో లేఅవుట్‌కు ఒక విధంగా మనమే చట్టబద్ధత కల్పించి.. మరోవైపు ఆ లేఅవుట్‌లో బిల్డింగ్‌ అనుమతులు నిరాకరించడం ఎంతవరకు సబబనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశంపై డెవలపర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే లేనిపోని సమస్యలు కొనితెచ్చుకోవాల్సిందేనని కొందరు కార్యదర్శులు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement