సాక్షి, హైదరాబాద్: సర్విసుల రెగ్యులరైజేషన్ ప్రక్రియపై జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో (జేపీఎస్) ఆందోళన వ్యక్తమౌతోంది. ఉద్యోగాలు క్రమబద్ధీకరించేందుకు ఐదేళ్ల కిందట అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన జీవో ఆర్టీ ప్రామాణికమా? లేక తాజాగా పీఆర్ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన మెమో ప్రామాణికమా? అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
జేపీఎస్‌ల పనితీరును మదింపు చేసి మూల్యాంకనం చేసేందుకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా తాజాగా జిల్లాస్థాయిలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా ఎస్పీ, జిల్లా అటవీ అధికారులతో ఒక కమిటీని నియమిస్తూ మెమోను జారీచేశారు.
వివిధ అంశాల ప్రాతిపదికన... ఆయా విధుల నిర్వహణకు అనుగుణంగా వందమార్కులు కేటాయించి, నాలుగేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న జేపీఎస్‌ల పనితీరు మదింపు ఆధారంగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఉంటుందని స్పష్టంచేశారు.
జీవో ఆర్టీలో ఏముంది?
జిల్లా ఎంపిక కమిటీల ద్వారా జేపీఎస్‌ల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి 2018 ఆగస్టు 30న అప్పటి పీఆర్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ జీవో ఆర్టీ నెంబర్ 617ను జారీచేశారు. ప్రభుత్వం జేపీఎస్‌ల పోస్టులను మంజూరు చేసినందున, మూడేళ్ల సర్విసు పూర్తిచేసుకున్నాక సంతృప్తికరమైన పనితీరు కనబరిచిన జేపీఎస్‌లను గ్రేడ్–4 పంచాయతీ సెక్రటరీలుగా రెగ్యులరైజ్ చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు.
అయితే వీరి క్రమబద్ధికరణను పరిగణనలోకి తీసుకునేందుకు జేపీఎస్‌ల మూడేళ్ల సర్విసు కాలాన్ని నాలుగేళ్లకు పెంచుతూ గతేడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత మార్చినెలతో వారి నాలుగేళ్ల సర్విసు కూడా పూర్తయ్యింది. క్రమబద్ధికరణ ప్రక్రియ మాత్రం మొదలుకాలేదు. దీంతో జేపీఎస్‌లు నిరవధిక సమ్మెకు దిగి 16 రోజుల తర్వాత విర మించుకున్నారు.
జేపీఎస్‌లు విధుల్లో చేరేందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నపుడే అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పలేదని, మెరుగైన పనితీరు ఆధారంగా నిపుణుల కమిటీ నివేదిక మేరకు జరుగుతుందని పంచాయతీరాజ్ శాఖ స్పష్టంచేసింది. కొన్నిరోజుల తరువాత జేపీఎస్‌ల సర్విసులను క్రమబద్ధిక రించే చర్యలు చేపడతామని అధికారులు ప్రకటించారు.
సీఎస్ దృష్టికి...
ఈ నేపథ్యంలో తాజాగా పీఆర్ ముఖ్యకార్యదర్శి జారీచేసిన మెమో నేపథ్యంలో జేపీఎస్‌ల విధులు, బాధ్యతల పట్ల ఏమాత్రం సంబంధం లేని జిల్లా ఎస్పీలు, జిల్లా అటవీ అధికారులతో మూల్యాంకనం చేయించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. వివిధ విభాగాల పీఆర్ ఉద్యోగులు, సంఘాలు సైతం ఈ పరిణామంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితుల గురించి త్వరలోనే సీఎస్ దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉద్యోగ సంఘాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment