
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ అయి సంక్షిప్త సమాచారం అందుకున్న దరఖాస్తుదారులు దాదాపు 18,500 మంది వరకు ఇంకా ఫీజు చెల్లించాల్సి ఉంది. గేట్‌వే ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులకు గడువు సోమవారం రాత్రితో ముగియనుంది. కాగా ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ రూపంలో హెచ్‌ఎండీఏకు ఇంకా రూ.120 కోట్లు రావాల్సి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘ఇప్పటికే రెండుసార్లు ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ సమయాన్ని దాదాపు రెండు నెలల పాటు పెంచాం. అయినా కొందరు దరఖాస్తుదారులు ఫీజు కట్టేందుకు ముందుకు రాలేదు.
ఇలాంటి వారు ఫీజు చెల్లించేలా ఆదివారం కూడా తార్నాకలోని బ్యాంక్ కౌంటర్లు పనిచేసేలా చొరవ తీసుకున్నాం. ఎల్‌ఆర్‌ఎస్ క్లియర్ అయిన వారంతా ఫీజు చెల్లించి ఫైనల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాల’ని హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు సూచించారు.
లక్ష దరఖాస్తులు క్లియర్..: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు పరిశీలన ప్రక్రియ టైటిల్ స్క్రూటిని, టెక్నికల్ స్క్రూటిని పూర్తయిన తర్వాత సక్రమమని తేలితే క్లియరెన్స్ ఇస్తారు. ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు చెల్లించాలంటూ సదరు దరఖాస్తుదారుడి సెల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపుతారు. అది చెల్లించగానే ఫైనల్ ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. ఇలా హెచ్‌ఎండీఏకు వచ్చిన లక్షా 75వేల పైగా దరఖాస్తుల్లో దాదాపు లక్ష దరఖాస్తులకు ఆమోదముద్ర వేశారు. మిగిలిన 75 వేల దరఖాస్తులను తిరస్కరించారు.
ఇలా ఎల్‌ఆర్‌ఎస్ క్లియర్ అయి ఫీజు సమాచారం అందుకున్న లక్ష దరఖాస్తుదారుల్లో దాదాపు 18,500 మంది ఫీజు చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. సోమవారం రాత్రి వరకు వేచిచూసి ఫీజు చెల్లించని వారి దరఖాస్తులను తిరస్కరిస్తామన్నారు. అయితే ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు రూపంలో రూ.600 కోట్లు, నాలా ఫీజు రూపంలో రూ.150 కోట్ల వరకు హెచ్‌ఎండీఏ ఖజానాకు జమ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment