దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బెంగళూరు, థానే, పుణెల్లోని మెట్రో ప్రాజెక్ట్‌ల కోసం రూ.30,000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పింది. ఈ ప్రాజెక్ట్‌లను 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతోపాటు బగ్ద్‌గోరా, బిహ్తా, పాట్నా విమానాశ్రయాల పరిసరాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.3,000 కోట్లు కేటాయించేలా మంత్రివర్గం ఆమోదం లభించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘బెంగళూరు , థానే , పుణెల్లో దాదాపు రూ.30,000 కోట్ల విలువైన మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లను 2029లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంతోపాటు బగ్ద్‌గోరా, బిహ్తా, పాట్నా విమానాశ్రయ పరిసరాల్లో మౌలిక సదుపాయాలు విస్తరించేందుకు దాదాపు రూ.3,000 కోట్లు కేటాయించేలా అనుమతులు వచ్చాయి. ఈ కీలక ప్రాజెక్టులు ఆయా నగరాల వృద్ధికి దోహదపడుతాయి. 2014కి ముందు దేశంలో కేవలం ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో రైలు ఉండేది. కానీ ప్రస్తుతం 21 నగరాలకు మెట్రో విస్తరించింది. ఎన్‌డీఏ ప్రభుత్వం మూడోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2 లక్షల కోట్ల ఖర్చు చేసేలా ఆమోదం లభించింది’ అన్నారు.
ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాలు క్లోజ్.. సమస్య పరిష్కారానికి చర్చలు
‘బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్-3లో రెండు కారిడార్లను అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.15,611 కోట్ల భారం పడబోతోంది. ఈ ఫేజ్-3 ప్రాజెక్ట్ 44.65 కిలోమీటర్లతో 31 స్టేషన్లను అనుసంధానం చేస్తుంది. మెట్రో విస్తరణలో భాగంగా మూడో దశ పనులు పూర్తయిన తర్వాత బెంగళూరు నగరంలో 220.20 కిలోమీటర్ల మెట్రో రైలు నెట్‌వర్క్ ఉంటుంది. థానేలో కొత్తగా 22 స్టేషన్లతో ఏర్పాటు చేసే 29 కిమీ కారిడార్ కోసం రూ.12,200 కోట్లు ఖర్చు అవుతుంది. మహారాష్ట్రలో మంత్రివర్గం ఆమోదించిన మరో ప్రాజెక్ట్ కోసం రూ.2,954.53 కోట్లు ఖర్చు అవుతాయి’ అని మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment