ఆ ఇళ్లు ‘అందుబాటు’లోనే | Infra Industry Status to Aphardabul Housing | Sakshi
Sakshi News home page

ఆ ఇళ్లు ‘అందుబాటు’లోనే

Published Thu, Feb 2 2017 2:44 AM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

ఆ ఇళ్లు ‘అందుబాటు’లోనే

ఆ ఇళ్లు ‘అందుబాటు’లోనే

అఫర్డబుల్‌ హౌసింగ్‌కు ఇన్‌ఫ్రా పరిశ్రమ హోదా

  • ఆ రంగానికి చౌకగా దక్కనున్న రుణాలు
  • బిల్టప్‌ ఏరియాను కార్పెట్‌ ఏరియాగా మార్చిన జైట్లీ
  • దీంతో ఇంకాస్త పెద్ద ఇళ్లు కూడా అందుబాటు పరిధిలోకి
  • పీఎంవైఏకు రూ.23 వేల కోట్లు కేటాయింపు

సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు బడ్జెట్‌ మార్గం సుగమం చేసిందనే చెప్పాలి. 2019 నాటికి దేశంలో కోటి గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతంలోనే ప్రధాని నరేంద్రమోదీ చెప్పగా... జైట్లీ దానికి రోడ్‌మ్యాప్‌ వేశారు. అందుకు అనుగుణంగానే అందుబాటు గృహాల విభాగానికి మౌలిక రంగ హోదానిచ్చారు. గతేడాది రూ.15 వేల కోట్లుగా ఉన్న ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంవైఏ) కేటాయింపును ఈసారి బడ్జెట్‌లో రూ.23 వేల కోట్లకు పెంచారు. అలాగే అందుబాటు గృహాలను నిర్మించే డెవలపర్లను ప్రోత్సహించేందుకు గాను 80–ఏబీఏ సెక్షన్‌ను సవరించారు కూడా. ప్రస్తుతం మూడేళ్లుగా ఉన్న అందుబాటు ఇళ్ల ప్రాజెక్ట్‌ నిర్మాణ గడువును 5 ఏళ్లకు పెంచారు.
– హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో

మెట్రోలో 30 చ.మీ., నాన్‌మెట్రోలో 60 చ.మీ.
గతేడాది బడ్జెట్‌లో అందుబాటు ఇళ్లను ప్రోత్సహించేందుకు ఆదాయ పన్ను రాయితీలను కల్పించిన జైట్లీ.. ఈసారి అందుబాటు గృహాల బిల్టప్‌ ఏరియాలను కార్పెట్‌ ఏరియాలుగా మార్పు చేశారు. అంటే గతంలో 30 చ.మీ., 60 చ.మీ. బిల్టప్‌ ఏరియాలుంటే అందుబాటు గృహాలుగా పరిగణించేవి కాస్త తాజా బడ్జెట్‌తో మెట్రో నగరాల్లో 30 చ.మీ., నాన్‌మెట్రో నగరాల్లో 60 చ.మీ. కార్పెట్‌ ఏరియాలుగా ఉండాలన్నమాట. ఒక చదరపు మీటరంటే 9 చదరపు అడుగులు. ఈ లెక్కన 60  చదరపు మీటర్లంటే 540 చదరపు అడుగుల ఇళ్లన్న మాట. గతంలో సింగిల్‌ బెడ్‌ రూమ్‌ మాత్రమే అందుబాటు ఇళ్ల పథకం కిందకు వచ్చేది.

ఎటూ చాలదనే భావనతో అల్పాదాయ, దిగువ మధ్య తరగతుల వారు కొనేవారు కాదు. దాంతో డిమాండ్‌ లేక వీటి నిర్మాణానికి సంస్థలు కూడా సాహసించలేని పరిస్థితి ఉంది. తాజా మార్పుతో దాదాపు 900 చదరపు అడుగుల బిల్టప్‌ ఏరియా ( 650 – 700 అడుగుల కార్పెట్‌ ఏరియా) అవుతుంది. ఈ విస్తీర్ణంలో చిన్న డబుల్‌ బెడ్‌ రూమ్స్‌ వస్తాయి. దీంతో అల్పాదాయ, దిగువ మధ్య తరగతి వారు ఈ పథకం కింద ఇళ్ల కొనుగోలుకు ముందుకు వస్తారని, నిర్మాణ సంస్థలు ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తాయని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

2001 నాటి మార్కెట్‌ రేటు ఆధారంగా
ఇప్పటివరకు 1980 కంటే ముందుకొన్న ఫ్లాట్, ప్లాట్‌ ఏదైనా స్థిర, చరాస్తులను ఎప్పుడు విక్రయించినా సరే 1981 ఏప్రిల్‌ 1 నాటి మార్కెట్‌ రేటు ఆధారంగా మూలధన లాభాలు (క్యాపిటల్‌ గెయిన్‌) విలువలను లెక్కగట్టేవారు. కానీ, తాజా బడ్జెట్‌లో విలువ లెక్కింపు సంవత్సరాన్ని 2001 ఏప్రిల్‌ 1కి మార్చారు. దీంతో విక్రయదారుడికి సరైన మార్కెట్‌ రేటు వస్తుంది. గతంలో మూడేళ్లుగా ఉన్న దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్‌ పన్ను ప్రయోజనాలను 2 ఏళ్లకు కుదించారు. మూడేళ్ల కంటే ఎక్కువున్న స్థిరాస్తుల దీర్ఘకాలిక మూలధన లాభాలు 20 శాతం చెల్లించాలి.

మౌలిక రంగ హోదాతో ఏం జరుగుతుంది?
మౌలిక రంగ హోదా ఇవ్వటం వల్ల అఫర్డబుల్‌ ఇళ్లను నిర్మించే కంపెనీలకు ఇన్‌ఫ్రా రంగానికిచ్చే వడ్డీ రేటుతో రుణాలు లభించే అవకాశముంటుంది. అంటే తక్కువ వడ్డీకే అన్నమాట. దీనివల్ల అవి నిర్మాణానికి ముందుకొస్తాయి. ఆ మేరకు కలిగే లాభాన్ని వినియోగదారులకు బదలాయించే అవకావం కూడా ఉంటుంది.  

రూ.20 వేల కోట్ల గృహ రుణాలు..
గృహ రుణాలు అందించే బ్యాంకులకు 2017–18కి గాను నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ ద్వారా రూ.20 వేల కోట్ల రుణాలను అందించనున్నారు. మధ్య ఆదాయ వర్గాల కోసం కొత్తగా క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద రూ.1,000 కోట్లు కేటాయించారు. అలాగే నివాస విభాగంలో అమ్ముడుపోకుండా ఉండిపోయే ఇళ్లపై (ఇన్వెంటరీ) పన్ను రాయితీలను ప్రకటించారు. కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ పొందిన తర్వాత ఖాళీగా ఉన్న ఇళ్లపై అద్దెను ఆదాయ పన్నుకు లోబడి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం జాయింట్‌ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకోగానే ల్యాండ్‌ ఓనర్‌ చెల్లించే మూలధన రాబడిని కాస్త ప్రాజెక్ట్‌ పూర్తయ్యాక చెల్లించే వీలును కల్పించారు.

కార్పెట్‌..బిల్టప్‌ అంటే..
సాధారణంగా కార్పెట్‌ ఏరియా అంటే గోడలు కాకుండా మనం ఉపయోగించే స్థలాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. కానీ బిల్టప్‌ ఏరియా అంటే గోడలు కలుపుకొని ఇంట్లోని మొత్తం స్థలాన్ని బిల్టప్‌ ఏరియాగా పరిగణిస్తారు. ఇందులో బాల్కనీ కూడా వస్తుంది. ఈ లెక్కన చూస్తే గతంలోకన్నా కాస్తంత పెద్ద ఇళ్లు ఇపుడు అందుబాటు గృహాల పరిధిలోకి వస్తాయన్న మాట. ఆ మేరకు వాటికి వర్తించే ప్రోత్సాహకాలు, రాయితీలు దీనికీ వర్తిస్తాయి. సూపర్‌ బిల్టప్‌ ఏరియా అంటే మాత్రం లాబీ, లిఫ్టు, మెట్లు, స్విమ్మింగ్‌ పూల్, గార్డెన్, క్లబ్‌హౌస్‌ వంటి అన్ని రకాల వసతులకు కేటాయించే స్థలాన్ని కూడా కలుపుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement