ఇదీ రైల్వే బడ్జెట్
- ఐఆర్‌సీటీసీతో చేసే టికెట్ బుకింగ్‌లపై నో సర్వీస్ చార్జి
- దివ్యాంగులకు ఉపయుక్తంగా
- ఉండేలా 500 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ
- 2020 నాటికి కాపలాలేని లెవెల్‌క్రాసింగ్‌ల తొలగింపు
న్యూఢిల్లీ: 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి రైల్వే బడ్జెట్ ప్రణాళికను సాధారణ బడ్జెట్లో భాగంగా బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. గత సంవత్సరం కన్నా పదివేల కోట్ల రూపాయలు అధికంగా.. రూ. 1.31 లక్షల కోట్లతో రైల్వే బడ్జెట్‌ను జైట్లీ ప్రకటించారు. అందులో రూ. 55 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకు అందిస్తుంది. ఇటీవలి వరుస ప్రమాదాల నేపథ్యంలో ఏటా రూ. 20 వేల కోట్ల చొప్పున రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్లతో ప్రత్యేక జాతీయ రైలు భద్రత నిధి(నేషనల్ రైల్ సేఫ్టీ ఫండ్)ని ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ ప్రకటించారు. ట్రాక్స్‌తో పాటు సిగ్నలింగ్ వ్యవస్థల ఆధునీకరణ, కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల సంపూర్ణ తొలగింపు.. తదితర అవసరాలకు ఆ నిధిని వినియోగించనున్నారు.
అలాగే, 2017–18 సంవత్సరంలో 3500 కిమీల మేర రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నారు. గత సంవత్సరం అది 2800 కిమీలుగా ఉంది. రైల్వేలో ఇకపై ప్రధానంగా ప్రయాణికుల భద్రత, అభివృద్ధి పనులు, స్వచ్ఛత, ఆర్థిక, అకౌంటింగ్ సంస్కరణలపై దృష్టి పెట్టనున్నామని జైట్లీ చెప్పారు. కాగా, బడ్జెట్‌లోని రైల్వేలకు సంబంధించిన ప్రతిపాదనలను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు స్వాగతించారు. ప్రతిపాదిత భద్రత నిధి ప్రమాదాలను తగ్గించడంతో పాటు రైళ్ల వేగాన్ని పెంచేందుకు ఉపకరిస్తుందన్నారు. రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయడంపై స్పందిస్తూ.. ఇప్పుడు దాదాపు ప్రపంచమంతటా ఇదే విధానం అమలవుతోందన్నారు. రైలు, రోడ్డు, విమాన, జల మార్గాల అనుసంధానంతో నూతన విధానం దిశగా వెళ్తున్నామన్నారు. విలీనం వల్ల.. ఇకపై ఆర్థిక శాఖకు రైల్వే శాఖ డివిడెండ్లను చెల్లించాల్సిన అవసరం ఉండబోదని వెల్లడించారు.
ఇతర ముఖ్యాంశాలు..
► ఈ టికెటింగ్‌ను ప్రోత్సహించేందుకు ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకునే టికెట్లపై సర్వీస్ చార్జి మినహాయింపు. ఇప్పటివరకు స్లీపర్ కోచ్‌లకు రూ. 20, ఏసీ క్లాస్‌లకు రూ. 40 సర్వీస్ చార్జీగా ఉంది. తాజా మినహాయింపుతో ఐఆర్‌సీటీసీ ఏటా రూ. 500 కోట్ల వరకు నష్టపోనుంది.
► స్టాక్ ఎక్సేంజ్‌ల్లో రైల్వేలకు చెందిన సంస్థలైన ఐఆర్‌సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్), ఐఆర్‌ఎఫ్‌సీ(ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్), ఇర్కాన్‌ల నమోదు.
► ఉపాధి అవకాశాలను మరింత పెంచేలా త్వరలో నూతన మెట్రో రైలు విధానం. మెట్రో రైలు వ్యవస్థలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రస్తుత చట్టాలను మార్చి కొత్త చట్టం రూపకల్పన.
► 500 రైల్వే స్టేషన్లలో దివ్యాంగుల కోసం లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు.. తదితర సౌకర్యాల ఏర్పాటు.
► రైలు సేవలకు సంబంధించిన అన్ని ఫిర్యాదులు, సేవల కొరకు త్వరలో ‘క్లీన్ మిత్ర’ సింగిల్‌విండో.
► పర్యాటక, ఆధ్యాత్మిక పర్యటనల కోసం ప్రత్యేక రైళ్ల ఏర్పాటు.
► న్యూఢిల్లీ, జైపూర్ రైల్వేస్టేషన్లలో బయోడీగ్రేడబుల్ వ్యర్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటు.
► ఎంపిక చేసిన సరుకులకు సంబంధించి పూర్తిస్థాయి రవాణాకు సమగ్ర వ్యవస్థ ఏర్పాటు.
2019 నాటికి అన్ని బోగీల్లో బయో టాయిలెట్ల ఏర్పాటు. ‘క్లీన్ మై కోచ్’ యాప్ ద్వారా స్వచ్ఛతకు సంబంధించిన సేవలు పొందే అవకాశం
2020 నాటికి బ్రాడ్‌గేజ్ నెట్‌వర్క్‌లోని అన్ని కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల తొలగింపు