ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి
2,450 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి బదలాయించండి
కేంద్ర మంత్రులు మనోహర్‌లాల్ ఖట్టర్, రాజ్‌నాథ్ సింగ్‌లకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
పీఎం ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణ వ్యయం పెంచండి
స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితిని మరో ఏడాది పొడిగించండి
వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో తెలంగాణకు బీఎల్‌సీ మోడల్‌లో 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రికి వివరించారు.
సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. తెలంగాణలో రాష్ట్ర సర్కారు నిర్మించ తలపెట్టిన 25 లక్షల ఇళ్లలో 15 లక్షల ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని కేంద్ర మంత్రికి తెలిపారు. వాటిని లబ్ధిదారు ఆధ్వర్యంలో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం (బీఎల్‌సీ) విధానంలో నిర్మించనున్నామని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ)– పీఎంఏవై (యూ) పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద మంజూరు చేసే ఇంటి నిర్మాణ వ్యయం నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాము నిర్మించే ఇళ్లను పీఎంఏవై (యూ) మార్గదర్శకాల ప్రకారం నిర్మిస్తామని వివరించారు. పీఎంఏవై (యూ) కింద ఇప్పటివరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి, రూ.2,390.58 కోట్లు గ్రాంటుగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇందులో ఇప్పటివరకు రూ.1,605.70 కోట్లే ఇచ్చారని, మిగతా నిధులు విడుదల చేయాలని కోరారు.
స్మార్ట్‌సిటీ మిషన్ కాలపరిమితి పొడిగించండి
స్మార్ట్‌సిటీ మిషన్ కింద చేపట్టిన పనులు పూర్తికానందున మిషన్ కాలపరిమితిని 2025 జూన్ వరకు పొడిగించాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ నగరాల్లో పనులు చేపట్టినట్టు తెలిపారు.
వరంగల్‌లో 45 పనులు పూర్తయ్యాయని, రూ.518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయని.. కరీంనగర్‌లో 25 పనులు పూర్తయ్యాయని, రూ.287 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయని వివరించారు. స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితి ఈ ఏడాది జూన్ 30తో ముగుస్తోందని.. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనులు ముగిసేందుకు వీలుగా మరో ఏడాది పొడిగించాలని కోరారు.
రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి బదలాయించండి
హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాల కోసం 2,500 ఎకరాల రక్షణశాఖ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో రాజ్‌నాథ్‌సింగ్‌ను రేవంత్ కలిశారు. ర్యావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం ఉపయోగించుకుంటున్న విషయాన్ని రక్షణ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ భూములు కీలకమని చెప్పారు. ఆర్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వ భూములను వినియోగించుకుంటున్నందున.. బదులుగా రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగించాలని కోరారు. భూముల పరస్పర బదిలీకి అంగీకరించాలని విజప్తి చేశారు.
వరంగల్ సైనిక్ స్కూల్ ఇవ్వండి..
వరంగల్ నగరానికి కేంద్రం సైనిక్ స్కూల్ మంజూరు చేసినా.. గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం తెలిపారు. ఆ సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగిశాయని.. ఆ అనుమతులను పునరుద్ధరించాలని లేదా తాజాగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.
నీట్‌పై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి: రేవంత్
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించామని సీఎం రేవంత్ తెలిపారు. రక్షణ భూముల బదలాయింపు, మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైలు, పీఎంఏవై ఇళ్ల విషయంలో విజ్ఞప్తులు అందజేశామని చెప్పారు. కేంద్ర మంత్రులను కలసిన తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాం«దీలతో భేటీ రేవంత్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. డిఫెన్స్ శాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరామన్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరామని.. సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని చెప్పారు. యూపీలో మూడు, ఏపీలో రెండు సైనిక్ స్కూళ్లు ఉన్నాయని.. కానీ తెలంగాణలో ఒక్కటి కూడా లేదని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ పదేళ్ల పాటు అడగలేదని, ప్రధాని మోదీ ఇవ్వలేదని విమర్శించారు.
నీట్ పరీక్ష నిర్వహణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఈ కేసును సీబీఐతో కాకుండా జ్యుడీషియల్ విచారణ జరిపించాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఆ కేసును ఖతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘నీట్ పరీక్ష నిర్వహణలో మోదీ గ్యారంటీ ఏదీ? యువతకు మోదీ భరోసా ఏది?’అని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌తోనే నా రాజకీయ జన్మ ప్రారంభమైంది: పోచారం శ్రీనివాసరెడ్డి
తన రాజకీయ జన్మ కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైందని, చివరికి ముగిసేది కూడా కాంగ్రెస్‌లోనే అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం సీఎం రేవంత్‌రెడ్డితోపాటు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డికి ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తర్వాత పోచారం మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు ఎన్టీఆర్ పిలుపుతో తాను టీడీపీలో చేరానని, కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లు పనిచేశానని చెప్పారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమర్థ పాలన అందిస్తున్నారని.. రైతులకు మంచి జరగాలనే ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment