
సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం) : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ పథకం పేరుతో నిరక్షర్యాసులు, అమాయక గిరిజనుల నుంచి పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడిన మోసగాళ్లను సోమవారం స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి సత్తుపల్లి కోర్టుకు తరలించారు. కొద్ది రోజులుగా సాగుతున్న ఈ అక్రమ వసూళ్ల దోపిడీపై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘డబ్బులిస్తే డబుల్ ఇప్పిస్తాం’ అనే శీర్షికన కథనం వెలువడిన సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ కథనంతో ఈ మోసగాళ్ల కేసు దర్యాప్తు వేగవంతంచేసి కొంతమంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ అబ్బయ్య సోమవారం వివరాలను వెల్లడించారు.
మండలంలోని రెడ్డిగూడెం, తిరుమల కుంట, దురదపాడు, గాండ్లగూడెం, కన్నాయిగూడెం, దిబ్బగూడెం (రామన్నగూడెం), కావడిగుండ్లతో పాటు మరికొన్ని గ్రామాల్లో పదిహేను రోజులుగా కొంత మంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన్’ పథకం ద్వారా రూ.2500, రూ.2000వేలు చెల్లిస్తే రూ.3 .50 లక్షల విలువగల డబుల్ ఇళ్లు మంజూరు చేయిస్తామని చెప్పి గిరిజనుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారు. దీనిపై దురదపాడు వీఆర్‌ఓ కండికట్టు కాళిదాసు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా తొమ్మిది మంది బృందం ముఠా వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసగాళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, రిపబ్లిక్ పార్టీ పేరుతో నకిలీ దరఖాస్తులు సృష్టించి, వీటిని గిరిజనులకు చూపించి డబుల్ ఇళ్లు మంజూరు చేయిస్తామని మాయ మాటలు చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి ఆన్‌లైన్ కమిషన్ పేరుతో రూ.2500 నుంచి రూ.2000, రూ.1500 చొప్పున వసూళ్లకు పాల్పడ్డారు.
ఇది చదవండి : డబ్బులిస్తే డబుల్ ఇప్పిస్తాం..
ఇలా ఒక్క అశ్వారావుపేట మండలంలోని 164 మంది నుంచి రూ.2.90 లక్షలు వసూళ్లకు పాల్పడినట్లు కేసు దర్యాప్తులో తేలింది. వసూళ్లకు పాల్పడిన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన గ్రంది ఉదయ్‌కిరణ్ కుమార్, తాడేపల్లి మండలానికి చెందిన రేపాన పద్మారావు, క్రోసూరు మండలానికి చెందిన పగడాల ఆగస్టిన్, సత్తుపల్లి మండలం బేతుపల్లికి చెందిన కాకాని నాగేశ్వరరావు, అశ్వారావుపేట మండలం నందమూరినగర్‌కు చెందిన గుండేటి సీతారామస్వామి, కావడిగుండ్ల గ్రామానికి చెందిన కుంజా ప్రేమ్‌కుమారి, గాండ్లగూడేనికి చెందిన మలోతు నాగేశ్వరరావు, తిరుమలకుంట గ్రామానికి చెందిన కొత్తపల్లి సీతారాములు, ఏపీలోని ప్రకాశం జిల్లా ఉల్వపాడు మండలానికి చెందిన బాలాచంద్రా తో కలిసి ఓ ముఠాగా ఏర్పడి నకిలీ జీఓలు, దరఖాస్తులను సృష్టించి నిరుపేదలు, అమాయక గిరిజనులకు డబుల్ ఇళ్లు మంజూరు చేస్తామని వసూళ్లకు పాల్పడ్డారు. తొమ్మిది మంది నిందితుల్లో ఆరుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.25 వేల నగదును రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే మరో ముగ్గురు నిందితులైన పగడాల ఆగస్టిన్, కుంజా ప్రేమ్‌కుమారి, బాలాచంద్రా పరారీలో ఉన్నారు. వీరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని సీఐ తెలిపారు. ఈ మోసగాళ్ల బారిన పడిన బాధితులు నేరుగా 100 డయల్ చేసి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment