
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఈ మేరకు క్రీడలశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ రిజర్వేషన్లు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ తెలంగాణ ఏర్పాటు తర్వాత అమలు కాలేదు. వీటిని అమలు చేయాలంటే రూల్–22లో సవరణలు చేయాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. దీంతో ప్రభుత్వం అందుకు సంబంధించిన సవరణలు చేసింది. తాజా రిజర్వేషన్లు 29 రకాల క్రీడాకారులకు, 90 రకాల క్రీడల్లో పాల్గొన్న వారికి, పతకాలు సాధించిన వారికి వర్తించనున్నాయి.
క్రీడాకారులకు వరం: మంత్రి పద్మారావుగౌడ్
క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు వరమని మంత్రి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న రిజర్వేషన్లను పరిశీలించి రాష్ట్రంలో అమలు చేయాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ప్రతిపాదనలు తయారు చేశామని, వాటికి సీఎం ఆమోదం తెలిపారన్నారు. ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో విజయం సాధించిన వారితో మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రత్యేక రిజర్వేషన్ల హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చారన్నారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, వీసీఎండీ దినకర్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment