టాటా జేఎల్‌ఆర్‌లో 5,000 ఉద్యోగాలు!
లండన్: టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. దాదాపు 5,000 మందిని నియమించుకోవాలని ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ఇందులో 1,000కి పైగా ఉద్యోగాలు ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు కేటాయించినట్లు జేఎల్‌ఆర్ పేర్కొంది. ఇక మిగిలిన ఉద్యోగాలు తయారీ విభాగంలో ఉంటాయని తెలిపింది. ‘వాహన పరిశ్రమ కొత్త దశాబ్దంలోకి అడుగుపెడుతోంది. దీనికి నూతన సాఫ్ట్‌వేర్ ఆవిష్కరణలు ప్రధాన కారణం.
అందుకే మేం ఆటానమస్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ప్రధాన లక్ష్యంగా కొత్త టాలెంట్‌ను నియమించుకోవాలని చూస్తున్నాం’ అని జేఎల్‌ఆర్ హెడ్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) అలెక్స్ హెస్లోప్ తెలిపారు. సాఫ్ట్‌వేర్ సిస్టమ్, సైబర్ వ్యవస్థలు, యాప్ డెవలప్‌మెంట్, గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ వంటి పలు విభాగాల్లోకి కొత్త వారిని తీసుకుంటామని పేర్కొన్నారు. అభ్యర్థులు అసెంబ్లింగ్ జాగ్వార్ ఐ–పేస్ కాన్సెప్ట్, కోడ్–బ్రేకింగ్ వంటి పలు సవాళ్లను పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపారు. జేఎల్‌ఆర్ కెరిర్స్ వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్స్‌ను స్వీకరిస్తామని పేర్కొన్నారు.