సాక్షి, అమరావతి: టాటా మోటార్స్‌కు చెందిన బ్రిటిష్ లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్, ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్) రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. రాష్ట్రంలోనే తొలి జాగ్వార్, ల్యాండ్ రోవర్ షోరూంను మంగళగిరి సమీపంలో 5,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో లక్ష్మీ–అనికా మోటార్స్ ఏర్పాటు చేసింది. ఈ షోరూంను గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి మాట్లాడుతూ... సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్ లభించే విధంగా అత్యంత విశాలంగా ఈ షోరూంను రూపొందించినట్లు తెలిపారు. ఒకేసారి 10 కార్లను ప్రదర్శించడమే కాకుండా 20 కార్లకు సర్వీస్‌బేలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇక్కడ నుంచే సేవలను అందిస్తామని, ఇప్పట్లో మరో షోరూంను రాష్ట్రంలో ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు.
లక్ష్మీ –అనికా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కె.జయరామ్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో దక్షిణాదిలోనే అతిపెద్ద లగ్జరీ కార్ల షోరూంను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం తమ సంస్థ నాలుగు రాష్ట్రాల్లో హీరోమోటో కార్ప్, హ్యూందాయ్, నిసాన్, హోండా, హార్లీ డేవిడ్‌సన్, అశోక్ లేల్యాండ్, జేఎల్‌ఆర్ వంటి సంస్థలకు డీలర్లుగా ఉంటూ 4,100 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment