JLR
-
గుడ్ న్యూస్: టీసీఎస్ వేల కోట్ల రూపాయల మెగా డీల్
TCS deal with JLR దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మెగా డీల్ కుదుర్చుకుంది. టాటామోటార్స్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ, లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR)తో మెగా డీల్‌ను గెలుచుకున్నట్లు ప్రకటించింది. భవిష్య డిజిటల్ సేవల కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు తెలిపింది. (మోడ్రన్ కార్లలో సెక్స్ నుంచి పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్) జేఎల్ఆర్తో రానున్న ఐదేళ్లకుగాను రూ.8,300 కోట్ల( 1 బిలియన్ డాలర్ల) కొత్త భాగస్వామ్య డీల్ జరిగినట్లు టీసీఎస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. కొత్త భవిష్యత్-సిద్ధమైన, వ్యూహాత్మక సాంకేతిక నిర్మాణాన్ని రూపొందించే క్రమంలోఈ డీల్ 'రీఇమాజిన్' వ్యూహానికి మద్దతు ఇస్తుందని పేర్కొంది. (క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి!) టీసీఎస్ సేవల్లో అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్, ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, క్లౌడ్ మైగ్రేషన్, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సర్వీసెస్ లాంటివి ఉన్నాయి. ఈ డీల్‌పై ఇదరు సంస్థలు సంతోషాన్ని ప్రకటించాయి. అనిశ్చిత డిమాండ్ వాతావరణం, కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు లేక ఐటీ మేజర్లు అష్టకష్టాలు పడుతున్న తరుణంలో టీసీఎస్ ఐరోపాలో ఈ క్యాలెండర్ సంవత్సరంలో గెలిచిన ఆరవ ప్రధాన ఒప్పందం కావడం విశేషం. -
టాటా మోటార్స్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర నష్టం దాదాపు సగానికి తగ్గి రూ. 4,450 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 8,444 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రెట్టింపునకు ఎగసి రూ. 66,406 కోట్లను అధిగమించింది. గత క్యూ1లో రూ. 31,983 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. ఇక స్టాండెలోన్ పద్ధతిలో రూ. 1,321 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతంలో రూ. 2,191 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 2,687 కోట్ల నుంచి రూ. 11,904 కోట్లకు దూసుకెళ్లింది. ఎగుమతులతో కలసి హోల్‌సేల్ విక్రయాలు 351 శాతం వృద్ధితో 1,14,170 యూనిట్లను తాకాయి. జేఎల్ఆర్ జోరు...: క్యూ1లో లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 74 శాతం జంప్‌చేసి 5 బిలియన్ పౌండ్లను తాకింది. పన్నుకు ముందు నష్టం 11 కోట్ల పౌండ్లకు చేరింది. రిటైల్ వాహన అమ్మకాలు 68 శాతం ఎగసి 1,24,537ను తాకాయి. కాగా.. క్యూ2(జూలై–సెప్టెంబర్)లో సెమీకండక్టర్ల సరఫరా కొరత మరింత తీవ్రంకానున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో టోకు అమ్మకాలు 50 శాతం ప్రభావితమయ్యే వీలున్నట్లు అంచనా వేసింది. స్థానిక ఈవీ తయారీకి ప్రభుత్వ మద్దతు... స్థానికంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న విధానాలను ప్రభుత్వం కొనసాగిస్తుందని భావిస్తున్నట్లు ఫలితాల విడుదల సందర్భంగా టాటా మోటార్స్ సీఈవో పి.బాలాజీ పేర్కొన్నారు. ఫేమ్(ఎఫ్ఏఎంఈ)2 పథకంలో భాగంగా ప్రభుత్వం దేశీయంగా ఈవీ తయారీకి ప్రోత్సాహకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే యూఎస్ ఆటో దిగ్గజం టెస్లా దేశీయంగా వాహన అమ్మకాలకు వీలుగా దిగుమతి సుంకాన్ని తగ్గించమని కోరుతున్న నేపథ్యంలో టాటా మోటార్స్ స్పందనకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంజిన్ పరిమాణం, కారు ఖరీదు తదితరాల ఆధారంగా కార్ల దిగుమతుల్లో సీబీయూలపై 60–100 శాతం మధ్య కస్టమ్స్ డ్యూటీ అమలవుతోంది. వాహన దిగుమతుల్లో విజయవంతమైతే తదుపరి దేశీయంగా తయారీని ప్రారంభించగలమని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ గత వారం ప్రకటించడం గమనార్హం! ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు ఎన్ఎస్ఈలో 1% క్షీణించి రూ. 293 వద్ద ముగిసింది. -
అదిరిపోయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ కొత్త వర్షన్..!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) భారత మార్కెట్లోకి ల్యాండ్ రోవర్ డిస్కవరీ కొత్త వెర్షన్‌ను బుధవారం రోజున విడుదల చేసింది. కొత్త డిస్కవరీలో న్యూ ఎల్ఈడీ హెడ్లైట్లు, టెయిల్ లైట్లు, ఫ్రెష్ ఫ్రంట్ రియర్ బంపర్లను అమర్చారు. అంతేకాకుండా కారు ఇంటిరీయర్స్‌లో న్యూ పివి ప్రో ఇన్ఫోటైన్మెంట్తో 11.4 అంగుళాల హెచ్డి టచ్‌స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్‌తో ఆధునాతన కనెక్టివిటీ కల్గి ఉంది. న్యూ డిస్కవరీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ వేరియంట్లతో రానుంది.కారులో స్ట్రెయిట్-సిక్స్ ఇంజినియం ఇంజన్లను ఏర్పాటు చేశారు. పెట్రోల్ వేరియంట్ 265 కిలోవాట్ల సామర్థ్యాన్ని, 500ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజీల్వేరియంట్ 221 కిలోవాట్ల సామర్థ్యాన్ని 650ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డిస్కవరీ కొత్త వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ .88.06 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. డిస్కవరీ ఆధునాతన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌తో రానుంది. భారత్‌లో ల్యాండ్ రోవర్ శ్రేణిలో రేంజ్ రోవర్ ఎవోక్ (రూ .59.04 లక్షలు నుంచి), డిస్కవరీ స్పోర్ట్ (రూ .65.30 లక్షలు), డిఫెండర్ 110 (రూ .83.38 లక్షలు), రేంజ్ రోవర్ స్పోర్ట్ (రూ. 91.27 లక్షలు) రేంజ్ రోవర్ రూ. 2.10 కోట్లుగా ఉన్నాయి. జెఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ దర్శకుడు రోహిత్ సూరి మాట్లాడుతూ..కొత్త డిస్కవరీ, ల్యాండ్ రోవర్ కార్లలో తన సామర్ధ్యాన్ని నిలుపుకుంటూ, నూతన ఆవిష్కరణతో, లగ్జరీ లుక్‌ను అందిస్తోంది. అడ్వెంచరస్ ప్రయాణాలకు ఉత్తమమైన ఎస్యూవీ అని ఒక ప్రకటనలో తెలిపారు. -
జెఎల్ఆర్ దెబ్బ: టాటా మోటార్స్‌కు భారీ నష్టాలు
సాక్షి, ముంబై: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ లిమిటెడ్ క్యూ1 ఫలితాల్లో నిరాశపర్చింది. మంగళవారం మార్కెట్ ముగిసిన తరువాత ప్రకటించిన ఈ ఏడాది తొలి త్రైమాసిక ఫలితాల్లో అనూహ్య నష్టాలను నమోదు చేసింది. విశ్లేషకుల అంచనాలకు ఎక్కడా అందకుండా తీవ్ర నష్టాలను ప్రకటించింది. దాదాపు తొమ్మిది సంవత్సరాలలో ఇది అత్యంత ఘోరమైనదని ఎనలిస్టులు చెప్పారు . దాని లగ్జరీ కారు యూనిట్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ నష్టాలు సంస్థ ఫలితాలను దెబ్బతీసినట్టు పేర్కొన్నారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర నష్టం 1,902.4 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ .3,199 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. డిసెంబరు 2009 నాటి 2,599 కోట్ల రూపాయల నష్టం తరువాత ఇదే అతి పెద్ద నష్టంగి నిలిచింది. క్యూ1లో రూ. 920 కోట్ల లాభాలను విశ్లేషకులు అంచనా వేశారు. రెవెన్యూ 14.7 శాతం పెరిగి రూ .67,081 కోట్లకు చేరుకుంది. కాగా టాటా మోటార్స్ ఆదాయంలో దాదాపు 90శాతం వాటా ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ టాటా మోటార్స్ 210 మిలియన్ల పౌండ్ల నష్టాన్ని చవిచూసింది. ఐరోపా యూరోప్‌లో చైనా దిగుమతి సుంకంతోపాటు,డీజిల్ ఇంజీన్ తదితర సవాళ్లు జెఎల్ ఆర్ లాభాలను ప్రభావితం చేశాయని టాటా మోటార్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచనల ముందు ఆదాయాలు 9 శాతం పెరిగి రూ .5,430 కోట్లకు చేరగా .. మార్జిన్లు వార్షిక ప్రాతిపదికన 40 బేసిస్ పాయింట్లు క్షీణించి 8.1 శాతానికి చేరింది. ఈ ఫలితాలు బుధవారం నాటి మార్కెట్లో టాటా మోటార్స్ షేర్ ప్రతికూల ప్రభావాన్ని చూపించనున్నాయి. -
జేఎల్ఆర్లోఉద్యోగాల కోత
లండన్ : టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఉద్యోగులపై వేటు వేస్తోంది. 1000 మంది ఉద్యోగులను తీసేస్తూ... తన రెండు యూనిట్లలో ఉత్పత్తిని తగ్గించనున్నట్టు జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) ప్రకటించింది. ఓ వైపు బ్రెగ్జిట్, మరోవైపు డీజిల్ వాహనాల అమ్మకాలు తగ్గిపోవడం, రెగ్యులేటరీ సమస్యలు వంటి కారణాలతో ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు జేఎల్ఆర్ తెలిపింది. జాగ్వార్ విక్రయాలు ఈ ఏడాది 26 శాతం తగ్గగా.. ల్యాండ్ రోవర్ అమ్మకాలు 20 శాతం క్షీణించాయి. దీంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన తన రెండు ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న వెయ్యి మంది తాత్కాలిక ఉద్యోగులను తీసేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. యూకేలో జేఎల్ఆర్ కంపెనీలో 40వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారు ఏడాదికి 5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తున్నారు. సోలిహుల్ వద్ద 1000 ఏజెన్సీ స్టాఫ్ తమ కాంట్రాక్ట్‌లను రెన్యూవల్ చేయించుకోలేదని కంపెనీ అధికార ప్రతినిధి ధృవీకరించారు. అదేవిధంగా మరో వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ సైట్లో 362 మంది శాశ్వత ఉద్యోగులను సోలిహుల్కు తరలించినట్టు పేర్కొన్నారు. డీజిల్ ఉద్గారాల స్కాండల్ వల్ల యూరోప్‌లో జేఎల్ఆర్ వాహనాలకు డిమాండ్ తగ్గి, విక్రయాలు పడిపోయాయి. డీజిల్ వాహనాలకు డిమాండ్ భారీగా తగ్గిందని జేఎల్ఆర్ చెబుతోంది. ఈ ఏడాది మొదట్లో కూడా జేఎల్ఆర్ తన ఉత్పత్తి తగ్గించింది. జేఎల్ఆర్ ఉత్పత్తి చేసే వాహనాల్లో 90 శాతం డీడిజల్ ఇంజిల్వే. జేఎల్ఆర్ ఉద్యోగాల కోత ప్రకటించడంతో, భారత స్టాక్ మార్కెట్లో టాటా మోటార్స్ షేర్లు సుమారు 5 శాతం మేర కిందకి పడిపోయాయి. రూ.351.50 వద్ద ప్రారంభమైన కంపెనీ స్టాక్, ఇంట్రాడేలో రూ.337.90 వద్ద కనిష్ట స్థాయిలను తాకింది. చివరికి రూ.338.95 వద్ద ముగిసింది. -
సరికొత్తగా జేఎల్ఆర్ ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్‌రోవర్ (జేఎల్ఆర్) తాజాగా సరికొత్త అల్యూమినియం ఇంజినియం 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్లతో కూడిన ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్ సెడాన్ కార్లను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. జాగ్వార్ ఎక్స్ఈ ప్రారంభ ధర రూ.35.99 లక్షలుగా ఉంది. ఇక జాగ్వార్ ఎక్స్ఎఫ్ ధర రూ.49.80 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. ‘జాగ్వార్ ఎక్స్ఈ, ఎక్స్‌ఎఫ్‌లకు భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ సెడాన్లను సరికొత్త, అధిక సామర్థ్యం కలిగిన ఇంజినియం పెట్రోల్ ఇంజిన్లతో అప్‌గ్రేడ్ చేశాం. దీంతో ఈ రెండు కార్లు మరింత మంది కస్టమర్లకు చేరువవుతాయని భావిస్తున్నాం’ అని జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి తెలిపారు. ఎక్స్ఈ, ఎక్స్‌ఎఫ్‌లలో 8 స్పీడ్ ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌ను అమర్చామని పేర్కొంది. -
జాగ్వార్ రేంజ్ రోవర్ ఎవోక్ కొత్త ఎడిషన్
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ సరికొత్త వాహనాన్ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రేంజ్ రోవర్ ఎవోక్ లాండ్మార్క్ కొత్త ఎడిషన్‌ను ప్రారంభించింది.. దీని ధరను రూ. 50.20 లక్షల (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. ఇండియాలో ఎవాక్ మోడల్ లాంచ్ చేసి ఆరేళ్లయిన సందర్భంగా ఈ కొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చినట్టు చెప్పింది. ఆకర్షణీయమైన మెరైన్ బ్లూ షేడ్‌తో మూడురంగుల్లో ఇది లభిస్తుదని జాగ్వార్ ప్రకటించింది. పాత రేండ్ రోవర్ మాదిరిగానే ఉన్నప్పటికీ డిజైన్ 2.0 లీటర్ ఇంజినియం డీజిల్ ఇంజిన్ ప్రధాన ఆకర్షణగా ఉంది. అలాగే 'ల్యాండ్‌మార్క్’ లెటర్స్‌ను, గ్రాఫైట్ అట్లాస్ , ముందు భాగంలో ఫెండెర్ వెంట్స్ విజువల్ మార్పులను చేసింది. ఇది 180సీఎస్ పవర్ , 430 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను అమర్చింది. అలాగు తన స్టాండర్డ్ వైఫై హాట్ స్పాట్, ప్రో సేవలు, కీలేస్ ఎంట్రీ , గెశ్చర్ ఓరియెంటెడ్ టెయిల్ గేటు లాంటి ఆఫర్లు కూడా లభ్యం. మరోవైపు జాగ్వార్ స్పెషల్ వేరియంట్లో పోలిస్తే ఎవాక్ ఎల్ఈ 25వేల రూపాయలకు లభిస్తోంది. -
జేఎల్ఆర్ నుంచి ఎవోక్ ల్యాండ్‌మార్క్ 2018 ఎడిషన్
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా తాజాగా తమ రేంజ్ రోవర్ ఎవోక్ ల్యాండ్‌మార్క్ 2018 ఎడిషన్ ప్రత్యేక మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్యూవీ) ధర రూ. 50.20 లక్షలు (ఎక్స్ షోరూం). వైఫై హాట్‌స్పాట్, కీ లెస్ ఎంట్రీ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కేవలం తొమ్మిది సెకన్లలో ఇది గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 195 కిలోమీటర్లు. -
ఏపీలో తొలి జేఎల్ఆర్ షోరూం
సాక్షి, అమరావతి: టాటా మోటార్స్‌కు చెందిన బ్రిటిష్ లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్, ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. రాష్ట్రంలోనే తొలి జాగ్వార్, ల్యాండ్ రోవర్ షోరూంను మంగళగిరి సమీపంలో 5,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో లక్ష్మీ–అనికా మోటార్స్ ఏర్పాటు చేసింది. ఈ షోరూంను గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి మాట్లాడుతూ... సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్ లభించే విధంగా అత్యంత విశాలంగా ఈ షోరూంను రూపొందించినట్లు తెలిపారు. ఒకేసారి 10 కార్లను ప్రదర్శించడమే కాకుండా 20 కార్లకు సర్వీస్బేలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇక్కడ నుంచే సేవలను అందిస్తామని, ఇప్పట్లో మరో షోరూంను రాష్ట్రంలో ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు. లక్ష్మీ –అనికా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కె.జయరామ్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో దక్షిణాదిలోనే అతిపెద్ద లగ్జరీ కార్ల షోరూంను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం తమ సంస్థ నాలుగు రాష్ట్రాల్లో హీరోమోటో కార్ప్, హ్యూందాయ్, నిసాన్, హోండా, హార్లీ డేవిడ్సన్, అశోక్ లేల్యాండ్, జేఎల్ఆర్ వంటి సంస్థలకు డీలర్లుగా ఉంటూ 4,100 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు తెలిపారు. -
మేడిన్ ఇండియా జాగ్వార్ ‘ఎఫ్–పేస్’
ముంబై: టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఇండియా తాజాగా తన పాపులర్ ఎస్యూవీ ‘ఎఫ్–పేస్’ అసెంబుల్‌ను స్థానికంగానే ప్రారంభించింది. పుణే ప్లాంటులో దీన్ని తయారు చేస్తోంది. దీని ధర రూ.60.02 లక్షలు. దిగుమతి చేసుకుని విక్రయిస్తున్న మోడల్ ధర రూ.68.4 లక్షలతో పోలిస్తే దీని ధర రూ.8.4 లక్షలు తక్కువ. స్థానికంగా తయారుచేస్తున్న ఎఫ్–పేస్ బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. వీటిని నవంబర్ చివరి నుంచి కస్టమర్లకు డెలివరీ చేస్తామని పేర్కొంది. కంపెనీ పుణే ప్లాంటులో అసెంబుల్ చేస్తోన్న ఆరో మోడల్ ఇది. జాగ్వార్ ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్, ఎక్స్‌జే, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఎవోక్యూ వంటి మోడళ్లను ఇందులో అసెంబుల్ చేస్తోంది. మేకిన్ ఇండియా పాలసీకి తాము ఎంత ప్రాధాన్యమిస్తున్నామో ఎఫ్–పేస్ లోకల్ అసెంబుల్‌ను చూస్తే అర్థమౌతుందని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ రోహిత్ సూరి తెలిపారు. స్పోర్ట్స్ కారు డీఎన్ఏ, ఎస్యూవీ పనితీరు వంటి అంశాల మేళవింపుతో కంపెనీ ఎఫ్–పేస్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. -
టాటా మోటార్స్‌లో లేని వేగం
♦ జూన్ క్వార్టర్ కన్సాలిడేటెడ్ లాభంలో 41%వృద్ధి ♦ రూ.3,200 కోట్లకు చేరిక ♦ జేఎల్ఆర్ రూపంలో పెరిగిన లాభం ♦ స్టాండలోన్‌గా చూసుకుంటే రూ.467 కోట్ల నష్టం ♦ ఆదాయం 10 శాతం డౌన్ న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ జూన్ త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా లేవు. కన్సాలిడేటెడ్ లాభం 41.5 శాతం వృద్ధితో రూ.3,200 కోట్లకు చేరినప్పటికీ, స్టాండలోన్‌గా చూసుకుంటే మాత్రం రూ.467 కోట్ల నష్టాన్ని చవిచూడడం గమనార్హం. ముఖ్యంగా బ్రిటిష్ కార్ల విభాగం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్)లో పెన్షన్ పథకాలకు సంబంధించి చేసిన మార్పులతో ఏకకాల అదనపు లాభాన్ని పొందింది. ‘‘ జాగ్వార్ ల్యాండ్ రోవర్ పెన్షన్ పథకాల్లో చేసిన మార్పుల వల్ల వచ్చిన రూ. 3,609 కోట్ల లాభం కూడా మొత్తం లాభాల్లో కలిసి ఉంది’’ అంటూ టాటా మోటార్స్ తన ప్రకటనలో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కన్సాలిడేటెడ్ లాభం రూ.2,260 కోట్లు. ఇక జూన్ త్రైమాసికంలో ఆదాయం 10 శాతం పడిపోయి రూ.59,818 కోట్లకు పరిమితమైంది. స్టాండలోన్‌గా చూసుకుంటే టాటా మోటార్స్ జూన్ క్వార్టర్లో రూ.467 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. వాస్తవానికి అంతుకుముందు ఏడాది ఇదే కాలంలో రూ.25.75 కోట్ల లాభాన్ని ఆర్జించడం గమనార్హం. స్టాండలోన్ ఆదాయం సైతం 9% క్షీణించి రూ.11,435 కోట్ల నుంచి రూ.10,375 కోట్లకు దిగొచ్చింది. వాహన విక్రయాలు డౌన్ కమర్షియల్, ప్యాసింజర్ వాహనాల విక్రయాలు కూడా తక్కువగా నమోదు కావడం గమనార్హం. కంపెనీ మొత్తం 1,11,860 వాహనాలను విక్రయించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయించిన వాహనాల సంఖ్యతో పోల్చి చూస్తే 11.8 శాతం తగ్గాయి. దేశీయంగా మధ్య స్థాయి, భారీ వాణిజ్య వాహనాల విభాగంలో వృద్ధి క్షీణించడం, తేలికపాటి వాణిజ్య వాహనాల విక్రయాలు ఫ్లాట్‌గా ఉండడం, ప్యాసింజర్ వాహన విక్రయాలు మధ్యస్థంగా ఉండడం కారణాలుగా పేర్కొంది. కాగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆదాయం 5.6 బిలియన్ పౌండ్లు(రూ.47,040 కోట్లు)గా నమోదైంది. గతేడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఇది 244 మిలియన్ పౌండ్లు (రూ.2,050 కోట్లు) వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. ఏడీఆర్ డౌన్... భారత్ మార్కెట్ ముగిసిన తర్వాత టాటా మోటార్స్ ఫలితాలు వెల్లడికాగా, బీఎస్ఈలో ఈ షేరు 3 శాతం క్షీణతతో రూ. 417 వద్ద ముగిసింది. అయితే బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లో టాటా మోటార్స్ ఏడీఆర్ 7 శాతం పతనమై 30.9 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే స్థాయిలో ఏడీఆర్ ముగిస్తే, గురువారంనాడిక్కడ టాటా మోటార్స్ షేరు మరింత పతనమయ్యే అవకాశం వుంది. అంచనాలకు అనుగుణంగా లేవు ఫలితాలు మా అంచనాలను అందుకోలేదు. వాణిజ్య, ప్రయాణికుల వాహన విభాగాల్లో పనితీరు మెరుగుపరిచే విషయమై మా విధానాన్ని నవీకరించడంపై దృష్టి సారించాం. –సీఈవో గుంటెర్ బుట్స్‌చెక్, టాటా మోటార్స్ ఎండీ -
టాటా జేఎల్ఆర్లో 5,000 ఉద్యోగాలు!
లండన్: టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. దాదాపు 5,000 మందిని నియమించుకోవాలని ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ఇందులో 1,000కి పైగా ఉద్యోగాలు ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు కేటాయించినట్లు జేఎల్ఆర్ పేర్కొంది. ఇక మిగిలిన ఉద్యోగాలు తయారీ విభాగంలో ఉంటాయని తెలిపింది. ‘వాహన పరిశ్రమ కొత్త దశాబ్దంలోకి అడుగుపెడుతోంది. దీనికి నూతన సాఫ్ట్వేర్ ఆవిష్కరణలు ప్రధాన కారణం. అందుకే మేం ఆటానమస్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ప్రధాన లక్ష్యంగా కొత్త టాలెంట్‌ను నియమించుకోవాలని చూస్తున్నాం’ అని జేఎల్ఆర్ హెడ్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) అలెక్స్ హెస్లోప్ తెలిపారు. సాఫ్ట్వేర్ సిస్టమ్, సైబర్ వ్యవస్థలు, యాప్ డెవలప్మెంట్, గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ వంటి పలు విభాగాల్లోకి కొత్త వారిని తీసుకుంటామని పేర్కొన్నారు. అభ్యర్థులు అసెంబ్లింగ్ జాగ్వార్ ఐ–పేస్ కాన్సెప్ట్, కోడ్–బ్రేకింగ్ వంటి పలు సవాళ్లను పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపారు. జేఎల్ఆర్ కెరిర్స్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్స్‌ను స్వీకరిస్తామని పేర్కొన్నారు. -
జేఎల్ఆర్ నుంచి కొత్త రేంజ్ రోవర్
ప్రారంభ ధర రూ.49.1 లక్షలు న్యూఢిల్లీ: టాటా మోటార్స్ అనుబంధ కంపెనీ ‘జాగ్వార్ ల్యాండ్ రోవర్’ తాజాగా కొత్త ఏడాది కోసం కొత్తమోడల్‌ను ఆవిష్కరించింది. ఇది తన పాపులర్ ఎస్యూవీ రేంజ్ రోవర్ ఇవోక్‌లో 2017 మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.49.1 లక్షల నుంచి రూ.67.9 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. ఇది ఆరు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఇది వరకు మోడళ్లతో పోలిస్తే తాజా కొత్త వాహనంలో కంపెనీ కొన్ని మార్పులు చేసింది. ఇందులో ప్రధానమైనది 2.0 లీటర్ ఇంజీనియమ్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చడం. కంపెనీ నుంచి వచ్చిన ఇదివరకు ఇంజిన్లతో పోలిస్తే దీనిబరువు 20 కేజీలు తక్కువ. ల్యాండ్ రోవర్ నుంచి వచ్చిన కొత్త ఇంజిన్ ఇది. ఇక కొత్త రేంజ్ రోవర్ ఇవోక్‌లోని అదిరిపోయే డిజైన్, టాప్‌క్లాస్ టెక్నాలజీ, లగ్జరీ ఫీచర్లు కస్టమర్లను కట్టిపడేస్తాయని కంపెనీ పేర్కొంది. ఆల్ ఫోర్ వీల్ డ్రైవ్, 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఇన్‌కంట్రోల్ టచ్ ప్రొ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని వివరించింది. -
స్టాక్స్ వ్యూ
టాటా మోటార్స్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.471 టార్గెట్ ధర: రూ.595 ఎందుకంటే: టాటా మోటార్స్ ఆదాయం (కన్సాలిడేటెడ్) 7 శాతం వృద్ధితో రూ.65,900 కోట్లకు పెరిగింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 23 శాతం వృద్ధి సాధించింది. జేఎల్ఆర్ వాహన విక్రయాలు 19 శాతం పెరుగుదలతో 1,39,235కు పెరిగాయి. జేఎల్ఆర్ విభాగం ఇబిటా 10 శాతంగా ఉంది. జేఎల్ఆర్ ఇటీవల ఎక్స్ఈ, ఎఫ్-పేస్ మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. ఇక ల్యాండ్ రోవర్ త్వరలో ఈవోక్ కన్వర్టిబుల్, కొత్త డిస్కవరీ మోడళ్లను మార్కెట్లోకి తేనున్నది.పౌండ్ కరెన్సీ పతనం కావడం జేఎల్ఆర్కు లాభించనున్నది. కొన్ని ఇంజిన్ ప్లాట్ఫార్మ్లపైననే మరిన్ని మోడళ్లను అందించాలన్న వ్యూహం కారణంగా వ్యయాలు తగ్గనుండడం, చైనా జాయింట్వెంచర్ను పునర్వ్యస్థీకరించనుండడం, స్లోవేకియాలో కొత్త ప్లాంట్అండుబాటులోకి రానుండడం... వీటన్నింటి ఫలితంగా జేఎల్ఆర్ నికర లాభం 18 శాతం చక్రగతిన వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నాం. జేఎల్ఆర్ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా వృద్ధి సాధిస్తోంది. జేఎల్ఆర్ మోడళ్లలో కొత్త వేరియంట్లను, కొత్త మోడళ్లను అందించనుండడంతో జేఎల్ఆర్ మార్కెట్ వాటా పెరుగుతోంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా స్వల్ప కాలంలో దేశీయంగా అమ్మకాలపై ప్రభావం పడుతుంది. అయితే 95 శాతానికి పైగా వాణిజ్య వాహనాల విక్రయాలు రుణాల ద్వారానే అమ్ముడవుతున్నందున ఈ ప్రభావం స్వల్పమేనని అంచనా వేస్తున్నాం. ఇక మరో నాలుగేళ్ల వరకూ ఏడాదికి రెండు కొత్త మోడళ్లను అందుబాటులోకి తేనున్నందున ప్రయాణికుల వాహన విక్రయాలు కూడా పుంజుకుంటాయని భావిస్తున్నాం. మొత్తం మీద అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 15 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 18 శాతం పెరుగుతాయని అంచనా. ఇంద్రప్రస్థ గ్యాస్ బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.838 టార్గెట్ ధర: రూ.940 ఎందుకంటే: నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ)లను సరఫరా చేస్తున్న ఏకై క కంపెనీ ఇది. వాహనాలకు సీఎన్జీని, హోటళ్లు, హాస్పిటల్స్‌కు, రెస్టారెంట్లు, పరిశ్రమలకు పీఎన్జీని సరఫరా చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. సీఎన్జీ అవుట్లెట్లను పెంచడం, ఉత్తర ప్రదేశ్‌లో పీఎన్జీ అమ్మకాలు పుంజుకోవడం, ఎల్ఎన్జీ ధరలు బలహీనంగా ఉండడం తదితర కారణాల వల్ల అమ్మకాలు 12 శాతం పెరగడంతో నికర లాభం రూ.1,442 కోట్లకు ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.1,016 కోట్లు)తో పోల్చితే 42 శాతం వృద్ధి సాధించింది. కొత్త సీఎన్జీ అవుట్లెట్లను ప్రారంభించడవల్ల నిర్వహణ పెట్టుబడులు పెరగడంతో మార్జిన్లు సాధారణంగానే ఉన్నాయి. భారీ, మధ్య తరహా వాణిజ్య వాహనాలపై భారీగా పన్నులు విధించడం, సీఎన్జీ రేడియో ట్యాక్సీలకు మాత్రమే లెసైన్‌సలు ఇవ్వాలన్న ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలు కంపెనీకి ప్రయోజనం కలిగించేవే. త్వరలో హర్యానా మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. రహదారుల్లో సీఎన్జీ అవుట్లెట్లను ఏర్పాటు చేయనున్నది. ధరలు పడిపోవడం వల్ల పారిశ్రామిక రంగం నుంచి పీఎన్జీ వినియోగం పెరుగుతోంది. పీఎన్జీపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించింది.. ఇవన్నీ కంపెనీకి కలసివచ్చే అంశాలు. రెండేళ్లలో రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 20 శాతం, షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 17 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని భావిస్తున్నాం. ఈ క్యూ2లో సీఎన్జీ అమ్మకాలు 12 శాతం, పీఎన్జీ అమ్మకాలు 13 శాతం చొప్పున పెరిగారుు. రెండేళ్లలో అమ్మకాలు 11 శాతం చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. -
జేఎల్ఆర్ రికార్డ్ స్థాయి అమ్మకాలు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) అమ్మకాలు ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో బాగా వృద్ధిచెందాయి. జేఎల్ఆర్ అంతర్జాతీయ రిటైల్ విక్రయాలు ఈ ఏడాది జనవరి-జూన్ కాలానికి 22 శాతం వృద్ధితో రికార్డుస్థాయిలో 2,91,556కు పెరిగాయని జేఎల్ఆర్ వెల్లడించింది. యూరప్, యూకేల్లో డిమాండ్ జోరుగా ఉండడమే దీనికి కారణమని జేఎల్ఆర్ గ్రూప్ డెరైక్టర్ (సేల్స్ కార్యకలాపాలు) అండీ గాస్ చెప్పారు. జాగ్వార్ విక్రయాలు 64 శాతం అప్.. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో జాగ్వార్ మోడళ్ల అమ్మకాలు 64 శాతం వృద్ధితో61,651కు, ల్యాండ్ రోవర్ మోడళ్ల అమ్మకాలు 14 శాతం వృద్ధితో 2,29,905కు పెరిగాయని గాస్ చెప్పారు. జాగ్వార్ మోడల్ అన్నింటిలోనూ ఎఫ్-పేస్ మోడల్ బాగా అమ్ముడైందని, ఆ తర్వాతి స్థానాల్లో ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే అమ్మకాలు యూరప్‌లో 35 శాతం, యూకేలో 21%, ఉత్తర అమెరికాలో 21 శాతం, చైనాలో 19 శాతం, ఇతర మార్కెట్లలో 11 శాతం చొప్పున వృద్ధి చెందాయని వివరించారు. జూన్‌లో అమ్మకాలు 17% వృద్ధితో 46,456కు పెరిగాయని ఆండీ గాస్ వివరించారు. -
జేఎల్ఆర్ ‘డిస్కవరీ స్పోర్ట్’లో పెట్రోల్ వేరియంట్
ప్రారంభ ధర రూ.56.50 లక్షలు న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ అనుబంధ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్).. పెట్రోల్ వేరియంట్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ తాజాగా తన ప్రముఖ ఎస్యూవీ ‘లాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్’లో 2.0 లీటర్ పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ.56.50 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఇది కేవలం హెచ్ఎస్ఈ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉండనున్నది. కంపెనీ గతేడాదే డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో డిస్కవరీ స్పోర్ట్ మోడల్‌ను భారత్‌లోకి తీసుకువచ్చింది. డీజిల్ వేరియంట్లో ఏవైతే ఫీచర్లు ఉన్నాయో.. కొత్త వేరియంట్లోనూ అవే ప్రత్యేకతలు ఉన్నాయి. ఎలాంటి మార్పులు లేవు. -
రూ.56 లక్షలకు ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్
న్యూఢిల్లీ : బ్రిటీష్ ఆటోమోటివ్ లకు చిహ్నంగా నిలిచిన, భారత టాటా మోటార్స్ కు సబ్సిడిరీ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) భారత్ లో తన వ్యాపార వాతావరణాన్ని మారుస్తోంది. డీజిల్ వేరియంట్లపై పడిన దెబ్బతో, పెట్రోల్ వేరియట్ కార్లను ప్రవేశపెట్టడంలో ప్రస్తుతం ఎక్కువగా దృష్టిసారిస్తోంది. రెండు లీటర్ల పెట్రోల్ డెరివేటివ్ కొత్త కారును జేఎల్ఆర్ సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్టుతో ప్రవేశపెట్టిన ఈ వేరియంట్ ధర రూ.56.50లక్షలుగా(ఎక్స్ షోరూం ఢిల్లీ)నిర్ణయించింది. దేశ రాజధాని ప్రాంతాల్లో ఎక్కువ సామర్థ్యమున్న డీజిల్ వాహనాలపై నిషేధం విధించడంతో తన బిజినెస్ ప్లాన్స్ పై కొంతమేర ప్రభావం చూపిందని తెలిపింది. ఈ డిస్కవరీ స్పోర్ట్ పెట్రోల్ వేరియంట్ ను ముందే ప్లాన్ చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టలేదని, అనుకోకుండా ఈ కారు ఆవిష్కరణకు ప్లాన్ చేశామని జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ సూరీ చెప్పారు. ఈ కారు అమ్మకాలు తమ ప్లాన్స్ పై కచ్చితంగా ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. కేవలం డీజిల్ వాహనాల నిషేధంతోనే పెట్రోల్ వేరియంట్లను తీసుకురావడం లేదని, పెట్రోల్ వెహికిల్స్ కు పెరుగుతున్న డిమాండ్ తో తమ డిమాండ్లను చేరుకోవడానికి వీటిపై దృష్టిపెట్టామని చెప్పారు. రెండు ఇంధన వేరియంట్లకు మధ్య ధరల్లో తేడా కొంత మాత్రమే ఉండటతో, కంపెనీ భారత్ లో పెట్రోల్ వేరియంట్లను ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు రచిస్తోందని సూరీ తెలిపారు. శక్తిమంతమైన పెట్రోల్ ఇంజన్ సామర్థ్యంతో, కస్టమర్లకు ప్రీమియం ఎస్‌యూవీలను విస్తృతపరుస్తామని పేర్కొన్నారు. భారత్ లో అందుబాటులో ఉన్న ల్యాండ్ రోవర్ ఎస్‌యూవీలు.. రేంజ్ రోవర్ రూ.2.12 కోట్లు, రేంజ్ రోవర్ స్పోర్ట్ రూ.1.18 కోట్లు, డిస్కవరీ స్పోర్ట్ రూ.47.6లక్షలు, కొత్త రేంజ్ రోవర్ ఎవోక్యూ రూ.48.60 లక్షలకు ఎక్స్ షోరూం ఢిల్లీలో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో గతేడాది ఇదే త్రైమాసికం కంటే 45 శాతం ఎక్కువ వృద్ధి నమోదైందని, ఈ వృద్ధిని డబుల్ డిజిట్ వృద్ధిగా నమోదుచేయాలని ఆశిస్తున్నామని కంపెనీ పేర్కొంది. -
టాటా మోటార్స్‌కు జేఎల్ఆర్ బ్రేక్‌లు
49% క్షీణించిన నికర లాభం ముంబై : టాటా మోటార్స్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 49 శాతం క్షీణించింది. గత క్యూ1లో రూ.5,398 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.2,769 కోట్లకు తగ్గింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) అమ్మకాలు తగ్గడమే ఈ క్షీణతకు కారణమని కంపెనీ పేర్కొంది. నికర అమ్మకాలు కూడా రూ.64,151 కోట్ల నుంచి రూ.60,181 కోట్లకు తగ్గాయి. జేఎల్ఆర్ ఆదాయం రూ.54,426 కోట్ల నుంచి 10 శాతం క్షీణించి రూ.49,179 కోట్లకు తగ్గిందని, గత క్యూ1లో జోరుగా ఉన్న జేఎల్ఆర్ విభాగపు పనితీరు ఈ క్యూ1లో అంతంతమాత్రంగానే ఉందని కంపెనీ వివరించింది. ఇంగ్లాండ్, యూరోప్, ఉత్తర అమెరికాలో అమ్మకాలు పుంజుకున్నా, చైనాలో మాత్రం దెబ్బ కొట్టాయని పేర్కొంది. వాణిజ్య, ప్రయాణికుల వాహన విక్రయాలు(ఎగుమతులతో కలిపి) 6% వృద్ధితో 1,17,439కు పెరిగాయని తెలియజేసింది. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.394 కోట్ల నుంచి 35 శాతం క్షీణించి రూ.258 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. నికర అమ్మకాలు రూ.7,613 కోట్ల నుంచి రూ.9,198 కోట్లకు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేర్ ధర బీఎస్ఈలో 3% వృద్ధితో రూ.393కు పెరిగింది. -
జేఎల్ఆర్ ‘ఎక్స్ఎఫ్ సెలూన్’.. కొత్త వేరియంట్
ధర రూ. 52 లక్షలు న్యూఢిల్లీ : టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) జాగ్వార్ ఎక్స్ఎఫ్ సెలూన్లో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్ఎఫ్ ఏరో-స్పోర్ట్ పేరుతో అందిస్తున్న ఈ కొత్త వేరియంట్ ధర రూ.52 లక్షలు(ఎక్స్ షోరూమ్, ముంబై)అని జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ సూరి చెప్పారు. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందిస్తున్న ఈ కారు ఎక్స్టీరియర్స్ను ఒక రేంజ్లో అప్‌గ్రేడ్ చేశామని పేర్కొన్నారు. టచ్ స్క్రీన్, నావిగేషన్ సిస్టమ్, సన్‌రూఫ్ వంటి అదనపు ఫీచర్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. 19 నగరాల్లోని 21 అవుట్లెట్లలో జాగ్వార్ మోడళ్లు లభ్యమవుతాయని ఆయన వివరించారు. -
9 శాతం పెరిగిన జేఎల్ఆర్ విక్రయాలు
లండన్: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి అమ్మకాలు(4,62,678) సాధించింది. 2013 అమ్మకాలతో పోల్చితే ఇది 9 శాతం అధికమని, 2008 అమ్మకాలతో పోల్చితే ఇది రెట్టింపని జేఎల్ఆర్ సీఈఓ రాల్ప్ స్పెత్ చెప్పారు. జాగ్వార్ బ్రాండ్ అమ్మకాలు 6 శాతం వృద్ధితో 81,570 అమ్ముడయ్యాయని, ల్యాండ్ రోవర్ అమ్మకాలు 9 శాతం వృద్ధితో 3,81,108కు పెరిగాయని వివరించారు. చైనాలో అమ్మకాలు 28 శాతం, ఇంగ్లండ్‌లో 7 శాతం, ఉత్తర అమెరికాలో 2 శాతం చొప్పున వృద్ధి చెందాయని పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది 5 లక్షల కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ ఏడాది 12 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేనున్నామని... వీటిల్లో జాగ్వార్ ఎక్స్ఈ, ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఫోర్డ్‌లు కూడా ఉన్నట్లు చెప్పారు. 1,300 కొత్త కొలువులు... జేఎల్ఆర్ సంస్థ కొత్తగా 1,300 ఉద్యోగాలివ్వనున్నది. వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న కొత్త మోడల్ కారు కోసం ఈ కొత్త కొలువులు ఇవ్వనున్నామని రాల్ఫ్ స్పెత్ చెప్పారు. ఇంగ్లండ్‌లోని సోల్హిల్ ప్లాంట్‌లోని ఈ ఉద్యోగాల కోసం ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించామని పేర్కొన్నారు. -
జోరుగా జేఎల్ఆర్ అమ్మకాలు
అంతర్జాతీయ అమ్మకాలు 20 శాతం వృద్ధి న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) అంతర్జాతీయ అమ్మకాలు 20 శాతం పెరిగాయి. జాగ్వార్ బ్రాండ్ అమ్మకాలు 4 శాతం వృద్ధితో 6,450కు, ల్యాండ్ రోవర్ అమ్మకాలు 23 శాతం వృద్ధితో 32,381కు పెరిగాయని జేఎల్ఆర్ గ్రూప్ డెరైక్టర్ (సేల్స్ ఆపరేషన్స్) ఆండీగాస్ తెలిపారు. మొత్తం మీద జేఎల్ఆర్ అమ్మకాలు 20 శాతం వృద్ధితో 38,831కు చేరాయని పేర్కొన్నారు. జేఎల్ఆర్ అమ్మకాలు చైనాలో 53 శాతం, ఉత్తర అమెరికాలో 19 శాతం, ఇంగ్లాండ్‌లో 15 శాతం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 11 శాతం, యూరప్‌లో 8 శాతం చొప్పున వృద్ధి సాధించాయని వివరించారు. జాగ్వార్ మోడళ్లలో ఎఫ్-టైప్ కన్వర్టిబుల్, కూప్ మోడళ్లు, ల్యాండ్ రోవర్ మోడళ్లలో రేంజ్ రోవర్ స్పోర్ట్, ఇవోక్లు మంచి అమ్మకాలు సాధిస్తున్నాయని గాస్ పేర్కొన్నారు.