టాటా మోటార్స్‌కు జేఎల్‌ఆర్ బ్రేక్‌లు
49% క్షీణించిన నికర లాభం
ముంబై : టాటా మోటార్స్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 49 శాతం క్షీణించింది. గత క్యూ1లో రూ.5,398 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.2,769 కోట్లకు తగ్గింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్) అమ్మకాలు తగ్గడమే ఈ క్షీణతకు కారణమని కంపెనీ పేర్కొంది. నికర అమ్మకాలు కూడా రూ.64,151 కోట్ల నుంచి రూ.60,181 కోట్లకు తగ్గాయి. జేఎల్‌ఆర్ ఆదాయం రూ.54,426 కోట్ల నుంచి 10 శాతం క్షీణించి రూ.49,179 కోట్లకు తగ్గిందని, గత క్యూ1లో జోరుగా ఉన్న జేఎల్‌ఆర్ విభాగపు పనితీరు ఈ క్యూ1లో అంతంతమాత్రంగానే ఉందని కంపెనీ వివరించింది.
ఇంగ్లాండ్, యూరోప్, ఉత్తర అమెరికాలో అమ్మకాలు పుంజుకున్నా, చైనాలో మాత్రం దెబ్బ కొట్టాయని పేర్కొంది. వాణిజ్య, ప్రయాణికుల వాహన విక్రయాలు(ఎగుమతులతో కలిపి) 6% వృద్ధితో 1,17,439కు పెరిగాయని తెలియజేసింది. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.394 కోట్ల నుంచి 35 శాతం క్షీణించి రూ.258 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. నికర అమ్మకాలు రూ.7,613 కోట్ల నుంచి రూ.9,198 కోట్లకు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేర్ ధర బీఎస్‌ఈలో 3% వృద్ధితో రూ.393కు పెరిగింది.