టాటా మోటార్స్‌ నష్టాలు 3,679 కోట్లు | Tata Motors Q1 loss doubles to Rs 3,679 crore | Sakshi
Sakshi News home page

టాటా మోటార్స్‌ నష్టాలు 3,679 కోట్లు

Published Fri, Jul 26 2019 5:32 AM | Last Updated on Fri, Jul 26 2019 7:44 AM

Tata Motors Q1 loss doubles to Rs 3,679 crore - Sakshi

న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌కు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో భారీగా నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ1లో రూ.1,863 కోట్లుగా ఉన్న నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ1లో దాదాపు రెట్టింపై రూ.3,680 కోట్లకు పెరిగాయి. చైనాతో పాటు భారత్‌లో కూడా అమ్మకాలు తగ్గడం, మార్కెటింగ్‌ వ్యయాలు అధికంగా ఉండటం, అమ్మకాలు పెంచుకోవడానికి పెద్ద మొత్తాల్లో డిస్కౌంట్లు ఆఫర్‌ చేయడంతో ఈ స్థాయి నికర నష్టాలు వచ్చాయని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ పి.బి. బాలాజీ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.66,701 కోట్ల నుంచి 8 శాతం తగ్గి రూ.61,467 కోట్లకు చేరిందని పేర్కొన్నారు.  స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, గత క్యూ1లో రూ.1,188 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ1లో రూ.97 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వివరించారు. వడ్డీ వ్యయాలు రూ.336 కోట్ల నుంచి నాలుగు రెట్లు పెరిగి రూ.1,712 కోట్లకు చేరాయని తెలిపారు.  

23 శాతం తగ్గిన అమ్మకాలు...
లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) నికర నష్టాలు గత క్యూ1లో 26 కోట్ల పౌండ్ల నుంచి ఈ క్యూ1లో 39.5 కోట్ల పౌండ్లకు పెరిగాయని టాటా మోటార్స్‌ కంపెనీ తెలిపింది. ఈ క్యూ1లో జేఎల్‌ఆర్‌ విక్రయాలు 12 శాతం తగ్గి 1.28 లక్షలకు తగ్గాయని పేర్కొంది. ఈ క్యూ1లో మొత్తం వాహన విక్రయాలు 23 శాతం క్షీణించి 1.36 లక్షలకు తగ్గాయని తెలిపింది.  

మందగమనం...
వినియోగదారుల సెంటిమెంట్‌ బలహీనంగా ఉండటం, లిక్విడిటీ సమస్య, యాగ్జిల్‌ లోడ్‌కు సంబంధించిన నిబంధనలు.. వీటన్నింటి కారణంగా డిమాండ్‌ తగ్గి వాహన పరిశ్రమలో మందగమనం చోటు చేసుకుందని టాటా మోటార్స్‌ సీఈఓ, ఎమ్‌డీ గుంటర్‌ బషెక్‌   చెప్పారు.

లాభాల గైడెన్స్‌ కొనసాగింపు
ప్రపంచ వ్యాప్తంగా వాహన పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తమ ఆర్థిక ఫలితాలు ప్రతిఫలిస్తున్నాయని టాటా మోటార్స్‌ సీఈఓ, ఎమ్‌డీ గుంటర్‌ బషెక్‌  చెప్పారు.  పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఈ ఆర్థిక సంవత్సరంలో 250 కోట్ల పౌండ్ల లాభం ఆర్జించగలమన్న గైడెన్స్‌ను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. చైనాలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాయని, కొత్త మోడళ్ల కారణంగా జేఎల్‌ఆర్‌ వృద్ధి పుంజుకోగలదన్న ధీమాను వ్యక్తం చేశారు. ఇక దేశీయంగా  కూడా పరిస్థితులు మెరుగుపడగలవని పేర్కొన్నారు.

రిటైల్‌ అమ్మకాల వృద్ధిపై దృష్టిపెట్టామని, డీలర్ల లాభదాయకత మెరుగుపడగలదని, డిమాండ్‌ పుంజుకునే కొత్త ఉత్పత్తులను అందించనున్నామని, పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్థతులు పాటించనున్నామని ఆయన వివరించారు. భారీ మార్పు దశలో టాటా మోటార్స్‌ ఉందని జేఎల్‌ఆర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాల్ఫ్‌ స్పెత్‌ వ్యాఖ్యానించారు. కఠినమైన మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటున్నామని, నిర్వహణ సామర్థ్యం పెంచుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సంరలోనే మళ్లీ లాభాల బాట పడుతామని బషెక్‌ ధీమా వ్యక్తం చేశారు.

ఏడీఆర్‌ 3 శాతం డౌన్‌
మార్కెట్‌ ముగిసిన తర్వాత టాటా మోటార్స్‌ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ఈ కంపెనీ భారీగా నష్టాలను ప్రకటిస్తుందనే అంచనాలతో బీఎస్‌ఈలో ఈ షేర్‌ భారీగా పతనమైంది. బీఎస్‌ఈలో టాటా మోటార్స్‌ షేర్‌ 4.5 శాతం నష్టంతో రూ.144 వద్ద ముగిసింది. గత మూడు నెలల కాలంలో ఈ షేరు 35 శాతం పతనమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఈ షేర్‌ ఏడాది కనిష్ట స్థాయి, రూ.129ను తాకింది. ఇక అమెరికా స్టాక్‌ మార్కెట్లో టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 3 శాతం నష్టంతో 10.74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావంతో శుక్రవారం టాటా మోటార్స్‌కు భారీ నష్టాలు తప్పవని నిపుణులు పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement