లండన్ : టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఉద్యోగులపై వేటు వేస్తోంది. 1000 మంది ఉద్యోగులను తీసేస్తూ... తన రెండు యూనిట్లలో ఉత్పత్తిని తగ్గించనున్నట్టు జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్) ప్రకటించింది. ఓ వైపు బ్రెగ్జిట్, మరోవైపు డీజిల్ వాహనాల అమ్మకాలు తగ్గిపోవడం, రెగ్యులేటరీ సమస్యలు వంటి కారణాలతో ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు జేఎల్‌ఆర్ తెలిపింది. జాగ్వార్ విక్రయాలు ఈ ఏడాది 26 శాతం తగ్గగా.. ల్యాండ్ రోవర్ అమ్మకాలు 20 శాతం క్షీణించాయి. దీంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన తన రెండు ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న వెయ్యి మంది తాత్కాలిక ఉద్యోగులను తీసేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. యూకేలో జేఎల్‌ఆర్ కంపెనీలో 40వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారు ఏడాదికి 5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తున్నారు.
సోలిహుల్ వద్ద 1000 ఏజెన్సీ స్టాఫ్ తమ కాంట్రాక్ట్‌లను రెన్యూవల్ చేయించుకోలేదని కంపెనీ అధికార ప్రతినిధి ధృవీకరించారు. అదేవిధంగా మరో వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ సైట్‌లో 362 మంది శాశ్వత ఉద్యోగులను సోలిహుల్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. డీజిల్ ఉద్గారాల స్కాండల్ వల్ల యూరోప్‌లో జేఎల్‌ఆర్ వాహనాలకు డిమాండ్ తగ్గి, విక్రయాలు పడిపోయాయి. డీజిల్ వాహనాలకు డిమాండ్ భారీగా తగ్గిందని జేఎల్‌ఆర్ చెబుతోంది. ఈ ఏడాది మొదట్లో కూడా జేఎల్‌ఆర్ తన ఉత్పత్తి తగ్గించింది. జేఎల్‌ఆర్ ఉత్పత్తి చేసే వాహనాల్లో 90 శాతం డీడిజల్ ఇంజిల్‌వే. జేఎల్‌ఆర్ ఉద్యోగాల కోత ప్రకటించడంతో, భారత స్టాక్ మార్కెట్‌లో టాటా మోటార్స్ షేర్లు సుమారు 5 శాతం మేర కిందకి పడిపోయాయి. రూ.351.50 వద్ద ప్రారంభమైన కంపెనీ స్టాక్, ఇంట్రాడేలో రూ.337.90 వద్ద కనిష్ట స్థాయిలను తాకింది. చివరికి రూ.338.95 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment