న్యూఢిల్లీ : బ్రిటీష్ ఆటోమోటివ్ లకు చిహ్నంగా నిలిచిన, భారత టాటా మోటార్స్ కు సబ్సిడిరీ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) భారత్ లో తన వ్యాపార వాతావరణాన్ని మారుస్తోంది. డీజిల్ వేరియంట్లపై పడిన దెబ్బతో, పెట్రోల్ వేరియట్ కార్లను ప్రవేశపెట్టడంలో ప్రస్తుతం ఎక్కువగా దృష్టిసారిస్తోంది. రెండు లీటర్ల పెట్రోల్ డెరివేటివ్ కొత్త కారును జేఎల్ఆర్ సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్టుతో ప్రవేశపెట్టిన ఈ వేరియంట్ ధర రూ.56.50లక్షలుగా(ఎక్స్ షోరూం ఢిల్లీ)నిర్ణయించింది. దేశ రాజధాని ప్రాంతాల్లో ఎక్కువ సామర్థ్యమున్న డీజిల్ వాహనాలపై నిషేధం విధించడంతో తన బిజినెస్ ప్లాన్స్ పై కొంతమేర ప్రభావం చూపిందని తెలిపింది.
ఈ డిస్కవరీ స్పోర్ట్ పెట్రోల్ వేరియంట్ ను ముందే ప్లాన్ చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టలేదని, అనుకోకుండా ఈ కారు ఆవిష్కరణకు ప్లాన్ చేశామని జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ సూరీ చెప్పారు. ఈ కారు అమ్మకాలు తమ ప్లాన్స్ పై కచ్చితంగా ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. కేవలం డీజిల్ వాహనాల నిషేధంతోనే పెట్రోల్ వేరియంట్లను తీసుకురావడం లేదని, పెట్రోల్ వెహికిల్స్ కు పెరుగుతున్న డిమాండ్ తో తమ డిమాండ్లను చేరుకోవడానికి వీటిపై దృష్టిపెట్టామని చెప్పారు. రెండు ఇంధన వేరియంట్లకు మధ్య ధరల్లో తేడా కొంత మాత్రమే ఉండటతో, కంపెనీ భారత్ లో పెట్రోల్ వేరియంట్లను ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు రచిస్తోందని సూరీ తెలిపారు.
శక్తిమంతమైన పెట్రోల్ ఇంజన్ సామర్థ్యంతో, కస్టమర్లకు ప్రీమియం ఎస్యూవీలను విస్తృతపరుస్తామని పేర్కొన్నారు. భారత్ లో అందుబాటులో ఉన్న ల్యాండ్ రోవర్ ఎస్యూవీలు.. రేంజ్ రోవర్ రూ.2.12 కోట్లు, రేంజ్ రోవర్ స్పోర్ట్ రూ.1.18 కోట్లు, డిస్కవరీ స్పోర్ట్ రూ.47.6లక్షలు, కొత్త రేంజ్ రోవర్ ఎవోక్యూ రూ.48.60 లక్షలకు ఎక్స్ షోరూం ఢిల్లీలో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో గతేడాది ఇదే త్రైమాసికం కంటే 45 శాతం ఎక్కువ వృద్ధి నమోదైందని, ఈ వృద్ధిని డబుల్ డిజిట్ వృద్ధిగా నమోదుచేయాలని ఆశిస్తున్నామని కంపెనీ పేర్కొంది.
రూ.56 లక్షలకు ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్
Published Mon, Jun 20 2016 4:03 PM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement
Advertisement