9 శాతం పెరిగిన జేఎల్‌ఆర్ విక్రయాలు
లండన్: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి అమ్మకాలు(4,62,678) సాధించింది. 2013 అమ్మకాలతో పోల్చితే ఇది 9 శాతం అధికమని, 2008 అమ్మకాలతో పోల్చితే ఇది రెట్టింపని జేఎల్‌ఆర్ సీఈఓ రాల్ప్ స్పెత్ చెప్పారు. జాగ్వార్ బ్రాండ్ అమ్మకాలు 6 శాతం వృద్ధితో 81,570 అమ్ముడయ్యాయని, ల్యాండ్ రోవర్ అమ్మకాలు 9 శాతం వృద్ధితో 3,81,108కు పెరిగాయని వివరించారు.
చైనాలో అమ్మకాలు 28 శాతం, ఇంగ్లండ్‌లో 7 శాతం, ఉత్తర అమెరికాలో 2 శాతం చొప్పున వృద్ధి చెందాయని పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది 5 లక్షల కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ ఏడాది 12 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేనున్నామని... వీటిల్లో జాగ్వార్ ఎక్స్‌ఈ, ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఫోర్డ్‌లు కూడా ఉన్నట్లు చెప్పారు.
1,300 కొత్త కొలువులు...
జేఎల్‌ఆర్ సంస్థ కొత్తగా 1,300 ఉద్యోగాలివ్వనున్నది. వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న కొత్త మోడల్ కారు కోసం ఈ కొత్త కొలువులు ఇవ్వనున్నామని రాల్ఫ్ స్పెత్ చెప్పారు. ఇంగ్లండ్‌లోని సోల్‌హిల్ ప్లాంట్‌లోని ఈ ఉద్యోగాల కోసం ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించామని పేర్కొన్నారు.