న్యూఢిల్లీ: డిమాండ్ గణనీయంగా పేరుకుపోయిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయంగా ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదు కావచ్చని టాటా మోటర్స్ ఎండీ (ప్యాసింజర్ వెహికల్స్ విభాగం) శైలేష్ చంద్ర తెలిపారు. 38 లక్షల పైచిలుకు యూనిట్లు అమ్ముడు కావచ్చని అంచనాలు ఉన్నట్లు వివరించారు. మూడో త్రైమాసికంలో కాస్త మందగించినా, నాలుగో త్రైమాసికంలో విక్రయాలు తిరిగి పుంజుకుంటాయని ఆయన చెప్పారు.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 19 లక్షల విక్రయాలతో ప్యాసింజర్ వెహికల్స్ విభాగం పటిష్టమైన పనితీరు కనపర్చినట్లు తెలిపారు. భారతీయ వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం 2021–22లో పీవీల అమ్మకాలు 30.69 లక్షలుగా నమోదయ్యాయి. అంతక్రితం 2018–19లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 33.77 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో సెమీ–కండక్టర్లు వంటి కీలక భాగాల సరఫరా సమస్యలతో కొన్నాళ్లుగా డెలివరీలు నెమ్మదించి, డిమాండ్ పెరిగిపోయిన సంగతి తెలిసిందే.
మరోవైపు, 2023–24లో వాహన విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరం తరహాలో ఉండకపోవచ్చని చంద్ర చెప్పారు. ఇప్పటికే పేరుకుపోయిన డిమాండ్‌కు దాదాపు సరిపడేంత అమ్మకాలు జరిగాయని, ఇక నుండి కొత్తగా ఆవిష్కరించేవి మార్కెట్‌కు ఊతంగా ఉండగలవని పేర్కొన్నారు. ఉద్గార ప్రమాణాలకు సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీఎస్ 6 రెండో దశ అమల్లోకి రానుండటంతో రేట్లు పెంచాల్సి వస్తే కొన్ని సెగ్మెంట్లు.. ముఖ్యంగా ఎంట్రీ స్థాయి విభాగంపై కొంత ప్రతికూల ప్రభావం పడవచ్చని చంద్ర చెప్పారు. తమ ఎలక్ట్రికల్ వాహనాల విషయానికొస్తే.. సెప్టెంబర్ త్రైమాసికంలో అత్యధికంగా 12,000 యూనిట్లు విక్రయించినట్లు, 87 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment