టాటా మోటార్స్‌లో లేని వేగం
♦ జూన్ క్వార్టర్ కన్సాలిడేటెడ్ లాభంలో 41%వృద్ధి
♦ రూ.3,200 కోట్లకు చేరిక
♦ జేఎల్‌ఆర్ రూపంలో పెరిగిన లాభం
♦ స్టాండలోన్‌గా చూసుకుంటే రూ.467 కోట్ల నష్టం
♦ ఆదాయం 10 శాతం డౌన్
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ జూన్ త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా లేవు. కన్సాలిడేటెడ్ లాభం 41.5 శాతం వృద్ధితో రూ.3,200 కోట్లకు చేరినప్పటికీ, స్టాండలోన్‌గా చూసుకుంటే మాత్రం రూ.467 కోట్ల నష్టాన్ని చవిచూడడం గమనార్హం. ముఖ్యంగా బ్రిటిష్ కార్ల విభాగం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్)లో పెన్షన్ పథకాలకు సంబంధించి చేసిన మార్పులతో ఏకకాల అదనపు లాభాన్ని పొందింది. ‘‘ జాగ్వార్ ల్యాండ్ రోవర్ పెన్షన్ పథకాల్లో చేసిన మార్పుల వల్ల వచ్చిన రూ. 3,609 కోట్ల లాభం కూడా మొత్తం లాభాల్లో కలిసి ఉంది’’ అంటూ టాటా మోటార్స్ తన ప్రకటనలో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కన్సాలిడేటెడ్ లాభం రూ.2,260 కోట్లు. ఇక జూన్ త్రైమాసికంలో ఆదాయం 10 శాతం పడిపోయి రూ.59,818 కోట్లకు పరిమితమైంది. స్టాండలోన్‌గా చూసుకుంటే టాటా మోటార్స్ జూన్ క్వార్టర్లో రూ.467 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. వాస్తవానికి అంతుకుముందు ఏడాది ఇదే కాలంలో రూ.25.75 కోట్ల లాభాన్ని ఆర్జించడం గమనార్హం. స్టాండలోన్ ఆదాయం సైతం 9% క్షీణించి రూ.11,435 కోట్ల నుంచి రూ.10,375 కోట్లకు దిగొచ్చింది.
వాహన విక్రయాలు డౌన్
కమర్షియల్, ప్యాసింజర్ వాహనాల విక్రయాలు కూడా తక్కువగా నమోదు కావడం గమనార్హం. కంపెనీ మొత్తం 1,11,860 వాహనాలను విక్రయించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయించిన వాహనాల సంఖ్యతో పోల్చి చూస్తే 11.8 శాతం తగ్గాయి. దేశీయంగా మధ్య స్థాయి, భారీ వాణిజ్య వాహనాల విభాగంలో వృద్ధి క్షీణించడం, తేలికపాటి వాణిజ్య వాహనాల విక్రయాలు ఫ్లాట్‌గా ఉండడం, ప్యాసింజర్ వాహన విక్రయాలు మధ్యస్థంగా ఉండడం కారణాలుగా పేర్కొంది. కాగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆదాయం 5.6 బిలియన్ పౌండ్లు(రూ.47,040 కోట్లు)గా నమోదైంది. గతేడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఇది 244 మిలియన్ పౌండ్లు (రూ.2,050 కోట్లు) వృద్ధి చెందినట్టు తెలుస్తోంది.
ఏడీఆర్ డౌన్...
భారత్ మార్కెట్ ముగిసిన తర్వాత టాటా మోటార్స్ ఫలితాలు వెల్లడికాగా, బీఎస్‌ఈలో ఈ షేరు 3 శాతం క్షీణతతో రూ. 417 వద్ద ముగిసింది. అయితే బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లో టాటా మోటార్స్ ఏడీఆర్ 7 శాతం పతనమై 30.9 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే స్థాయిలో ఏడీఆర్ ముగిస్తే, గురువారంనాడిక్కడ టాటా మోటార్స్ షేరు మరింత పతనమయ్యే అవకాశం వుంది.
అంచనాలకు అనుగుణంగా లేవు
ఫలితాలు మా అంచనాలను అందుకోలేదు. వాణిజ్య, ప్రయాణికుల వాహన విభాగాల్లో పనితీరు మెరుగుపరిచే విషయమై మా విధానాన్ని నవీకరించడంపై దృష్టి సారించాం.
–సీఈవో గుంటెర్ బుట్స్‌చెక్, టాటా మోటార్స్ ఎండీ