జేఎల్ఆర్ రికార్డ్ స్థాయి అమ్మకాలు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్) అమ్మకాలు ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో బాగా వృద్ధిచెందాయి. జేఎల్‌ఆర్ అంతర్జాతీయ రిటైల్ విక్రయాలు ఈ ఏడాది జనవరి-జూన్ కాలానికి 22 శాతం వృద్ధితో రికార్డుస్థాయిలో 2,91,556కు పెరిగాయని జేఎల్‌ఆర్ వెల్లడించింది. యూరప్, యూకేల్లో డిమాండ్ జోరుగా ఉండడమే దీనికి కారణమని జేఎల్‌ఆర్ గ్రూప్ డెరైక్టర్ (సేల్స్ కార్యకలాపాలు) అండీ గాస్ చెప్పారు.
జాగ్వార్ విక్రయాలు 64 శాతం అప్..
ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో జాగ్వార్ మోడళ్ల అమ్మకాలు 64 శాతం వృద్ధితో61,651కు, ల్యాండ్ రోవర్ మోడళ్ల అమ్మకాలు 14 శాతం వృద్ధితో 2,29,905కు పెరిగాయని గాస్ చెప్పారు. జాగ్వార్ మోడల్ అన్నింటిలోనూ ఎఫ్-పేస్ మోడల్ బాగా అమ్ముడైందని, ఆ తర్వాతి స్థానాల్లో ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎఫ్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే అమ్మకాలు యూరప్‌లో 35 శాతం, యూకేలో 21%, ఉత్తర అమెరికాలో 21 శాతం, చైనాలో 19 శాతం, ఇతర మార్కెట్లలో 11 శాతం చొప్పున వృద్ధి చెందాయని వివరించారు. జూన్‌లో అమ్మకాలు 17% వృద్ధితో 46,456కు పెరిగాయని ఆండీ గాస్ వివరించారు.