న్యూఢిల్లీ: దేశీయ కార్పొరేట్ రంగంలో ఈ ఏడాది ఉద్యోగుల నియామకాలు ఆశాజనకంగానే ఉంటాయని, 10–15 శాతం మేర వృద్ధి ఉంటుందని పీపుల్స్ స్ట్రాంగ్ అనే హెచ్‌ఆర్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 2017లో ఉద్యోగ నియామకాలు మందగించిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ మేరకు ఇండియా స్కిల్స్ నివేదిక 2018ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 120 సంస్థలు, 5,10,000 మంది విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సమీకరించింది.
గడిచిన ఐదేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఉపాధి 45.6 శాతానికి పెరిగిందని పేర్కొంది. ‘‘మనం మార్పు దశలో ఉన్నాం. డిజిటల్ ప్రభావాన్ని అలవాటు చేసుకుంటున్నాం. ఈ దశను ఫలవంతంగా పూర్తి చేసేందుకు డిమాండ్, సరఫరా వైపు చర్యలు అవసరం. అయితే, మనం సరైన దిశలోనే వెళుతున్నామని డేటా తెలియజేస్తోంది’’అని పీపుల్ స్ట్రాంగ్ సీఈవో పంకజ్ బన్సాల్ అన్నారు.
ఈ రాష్ట్రాల్లో అధిక ఉపాధి
ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ అధిక ఉపాధి అవకాశాలు కలిగిన రాష్ట్రాల్లో ఉన్నాయని ఈ నివేదిక తెలియజేసింది. ఐటీ రాజధానిగా పేరు తెచ్చుకున్న బెంగళూరు ఉపాధిలో ముందుంది. సర్వేలో ఈ నగరమే టాప్‌లో ఉంది. ఆ తర్వాత చెన్నై, ఇండోర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్ వరుసగా అధిక ఉపాధి అవకాశాలు కలిగిన నగరాలు కావడం గమనార్హం. ఢిల్లీ 7వ స్థానంలో ఉండగా, పుణె, తిరుచిరాపల్లి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు ఎక్కువగా ఉన్నది ఢిల్లీలోనే. ఇక్కడ ప్రతీ ముగ్గురిలో ఇద్దరికి ఆ అర్హతలు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. 18–25 సంవత్సరాల వయసులో ఉన్న ఉద్యోగ అభ్యర్థుల శాతం 46 శాతం కాగా, 26–29 వయసులోని వారు 26 శాతంగా ఉన్నారు. మొత్తం మీద ఉపాధి అవకాశాలు అంతకు ముందు సంవత్సరంలో ఉన్న 40.44 శాతం నుంచి 45.60 శాతానికి పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment