
న్యూయార్క్: ఉద్యోగ నియామకాల కోసం ప్రముఖ కంపెనీలు ఇచ్చే ప్రకటనలను నిర్దిష్ట వయసు వారికే కనిపించేలా ఫేస్‌బుక్ చూస్తోంది. ఎంపిక చేసిన వయసు పైబడిన ఉద్యోగులకు ఆయా ప్రకటనలు కనిపించకుండా చేస్తోంది. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రో పబ్లికా, ది న్యూయార్క్ టైమ్స్ సంయుక్తంగా జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. వెరిజాన్, అమెజాన్, గోల్డ్‌మన్ శాక్స్, టార్గెట్ వంటి సంస్థలు ఇచ్చే ఉద్యోగ ప్రకటనలను ఓ నిర్ణీత వయసున్న వారికే ఫేస్‌బుక్ అందిస్తోంది. ‘ప్రకటనదారుల సందేశాన్ని, వారు కోరుకున్న నిర్దిష్ట వ్యక్తులకు చేరవేయడమే.. ఫేస్‌బుక్ వ్యాపార నమూనాకు మూలస్తంభం. అయితే ఈ విధానం వల్ల వయసు పైబడిన ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది’ అని ప్రో పబ్లికా, ది న్యూయార్క్ టైమ్స్ సంస్థలు తమ నివేదికలో పేర్కొన్నాయి.