టీ.నగర్: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరుగుతుండడంతో హైకోర్టు ఏసీబీ, సీబీఐ అధికారుల వివరణ కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు టీఎన్‌పీఎస్సీ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేసి ఉద్యోగాలలో నియమిస్తున్నారు. అలాగే ఉపాధ్యాయ ఉద్యోగాలకు టీచర్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నియామకాలు జరుపుతున్నారు. ఈ ఉద్యోగాలకు పలువురు లంచాలు ఇచ్చి ఉద్యోగాల్లో చేరినట్లు పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. దీని ప్రాతిపదికన మదురై హైకోర్టు సుమోటోగా ప్రజాహిత కేసును స్వీకరించింది.
ఈ పిటిషన్ న్యాయమూర్తి కృపాకరన్, తారణి సమక్షంలో మంగళవారం విచారణకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి టీఎన్‌పీఎస్సీ, సీబీఐ డైరెక్టర్, ఏసీబీలను ప్రతివాదులుగా చేర్చేందుకు న్యాయమూర్తులు ఉత్తర్వులిచ్చారు. ఈ విచారణ సమయంలో న్యాయమూర్తులు ఉద్యోగాలను సేవాభావంతో చేయాల్సి ఉందని, ఈ పనులను లంచాలు అందజేసి ఉద్యోగాల్లో చేరినవారు ఎలా నిజాయితీగా చేయగలరని ప్రశ్నించారు. ఎంతమంది ఉద్యోగాల్లో లంచాలు అందజేసి చేరారో, ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలపాలంటూ ఏసీబీ, సీబిఐ, టీఎన్‌పీఎస్సీ అధికారులు ఫిబ్రవరి 16న కోర్టులో వివరాలు దాఖలు చేయాలంటూ న్యాయమూర్తులు కేసు విచారణను వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment