ఉప ఎన్నికలో మద్దతిచ్చేందుకు సీపీఐ సుముఖత?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో ఖాళీ అయిన పాలేరు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో బరిలోకి దిగాలని సీపీఎం నిర్ణయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సీపీఎం పోటీచేసింది. ఆ పార్టీ అభ్యర్థి పోతినేని సుదర్శనరావు 44,245 (25 శాతం) ఓట్లు, టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన బేబి స్వర్ణకుమారి మద్దినేని 47,844 ఓట్లు (27శాతం) సాధించగా... రాంరెడ్డి వెంకటరెడ్డి 69,707 (39.28 శాతం) ఓట్లు సాధించి 21,863 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన రావెళ్ల రవీంద్రకు కేవలం 4,041 ఓట్లు (2.28 శాతం) వచ్చాయి.
మారిన రాజకీయ పరిస్థితులు: గతంలో టీడీపీలో బలమైన నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరాక ఆ పార్టీ బలోపేతమైంది. ఇటీవలి ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పూర్తి ఆధిక్యతను ప్రదర్శించింది కూడా. ఇదే సమయంలో టీడీపీ బాగా బలహీనపడింది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఈ ఉప ఎన్నికల్లో సానుభూతి పవనాలనే నమ్ముకోవాల్సి ఉంటుందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐకు పొత్తు ఉండగా.. ఇప్పుడది కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. ఇటీవలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావుకు కాంగ్రెస్ మద్దతునివ్వగా, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతునిచ్చింది. వీటిల్లో సీపీఐ, సీపీఎం విడిగానే పోటీచేశాయి. కానీ తాజాగా పాలేరు ఉప ఎన్నికలో మద్దతివ్వాల్సిందిగా సీపీఐని సీపీఎం కోరగా.. సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈసారి కాంగ్రెస్‌కు కాకుం డా సీపీఎం అభ్యర్థికే మద్దతివ్వాలని సీపీఐ జిల్లా పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీచేసిన పోతినేని సుదర్శనరావునే మళ్లీ బరిలోకి దింపే అవకాశాలున్నాయి. ఇక ఈ ఉప ఎన్నికలో టీడీపీ పోటీచేస్తుందా, లేదా?, ఒకవేళ పోటీ చేయకపోతే సీపీఎంకు మద్దతిచ్చే అవకాశాలున్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి.
పాలేరు బరిలో సీపీఎం!
Published Wed, Apr 13 2016 4:06 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement