'కేసీఆర్ అహంభావానికి నిదర్శనం'
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆ రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. దివంగత ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సాంప్రదాయాన్ని కాదని.. పాలేరులో టీఆర్ఎస్ పోటీకి దిగడం కేసీఆర్ అహంభావానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.
వివిధ వ్యవస్థలను వాడుకుంటూ కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే కాంగ్రెస్కు సహకరించాలని ఇతర పక్షాలను కోరుతున్నామన్నారు. అందులోభాగంగా పాలేరు ఉప ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని టీడీపీ, సీపీఎం, సీపీఐ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను కోరినట్లు ఆయన వివరించారు.
రాంరెడ్డి వెంకట్రెడ్డి కుటుంబసభ్యుల్లో ఒకరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారని మల్లు భట్టి విక్రమార్క్ చెప్పారు. తీవ్ర కరువు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ పథకం నీరుగార్చడం వల్ల కూలీలు వలస పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఉపాధి బకాయిలు కింద రూ. 310 కోట్లు చెల్లించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.