ప్రభుత్వ భూములు ఎవరూ కొనొద్దు  | Telangana Clp Leader Mallu Bhatti Vikramarka Slams Cm Kcr | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూములు ఎవరూ కొనొద్దు 

Published Sun, Jun 13 2021 8:44 PM | Last Updated on Mon, Jun 14 2021 8:11 AM

Telangana Clp Leader Mallu Bhatti Vikramarka Slams Cm Kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అమ్మేందుకు తలపెట్టిన ప్రభుత్వ భూములను కొనేందుకు ఎవరూ ముందుకు రావొద్దని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఒకవేళ ఎవరైనా కొన్నా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాధీనం చేసుకుని పేదలకు ఇస్తామని చెప్పారు. ఓ వైపు ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు గత ప్రభుత్వాలు ఆస్తులుగా ఇచ్చిన ప్రభుత్వ భూములను కూడా అమ్మి రాష్ట్రాన్ని దివాళా తీయించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ భూముల అమ్మకాలపై చర్చించేందుకు ఆదివారం సీఎల్పీ అత్యవసరంగా సమావేశమైంది. జూమ్‌ ద్వారా వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు డి. శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా ఎమ్మెల్యే పొడెం వీరయ్య హాజరు కాలేదు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, భూముల అమ్మకాలపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ భూములను అమ్మి నిధులను సమీకరించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన సీఎల్పీ.. ఈ వ్యవహారంపై జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. ముందుగా గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని, ఆ తర్వాత అమ్మాలని తలపెట్టిన భూములను సందర్శించి వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించింది. అయినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే వేలాన్ని అడ్డుకోవాలని నిర్ణయించింది.  


మనమే కాపాడుకోవాలి 
సీఎల్పీ సమావేశం అనంతరం భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ ‘ఆస్తులు మనవి. రాష్ట్రం మనది. ఇక్కడి వనరులు ఇక్కడి ప్రజలకు ఉపయోగపడాలి కానీ అడ్డగోలుగా తెగనమ్ముకుంటుంటే చూస్తూ కూర్చోం. ఇక్కడి వనరులు ఇక్కడి ప్రజలకే చెందాలనే ఉద్దేశంతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో భూముల అమ్మకాలను వ్యతిరేకించిన కేసీఆర్‌ ఇప్పుడు భూములను అమ్మేందుకు యత్నిస్తున్నారు. అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఒక ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం’అని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లను అప్పుగా తెచ్చిందని, ఈ భారాన్ని భరించలేని స్థితిలో ఉండగా మళ్లీ ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. అమ్మకానికి పెట్టిన భూములు, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మియాపూర్‌ భూములు, నయీం అక్రమ భూములు ఎంత సురక్షితంగా ఉన్నాయో ప్రజలకు వివరించాలని కోరారు.  


నాది చిన్న పాత్ర 
టీపీసీసీ అధ్యక్ష ఎంపిక వ్యవహారంలో తనది చిన్న పాత్ర అని భట్టి అన్నారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. సీఎల్పీ నాయకుడిగా తన పనితీరుపై సీనియర్‌ నేత వీహెచ్‌కు సొంత అభిప్రాయం ఉండడంలో తప్పేం లేదన్నారు. ఏదిఏమైనా అందరూ కాంగ్రెస్‌ జెండా కింద సోనియా, రాహుల్‌ గాంధీ నాయకత్వంలో పనిచేయాల్సిందేనని స్పష్టంచేశారు.    


చదవండి: 290 కోట్ల భారీ కుంభకోణం.. 9 మంది అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement