
పోటీ చేయాలా? వద్దా?
విజయవాడ: తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు సమావేశం ముగిసింది. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపికపై చర్చించారు. చంద్రబాబుతో భేటీలో పాల్గొన్న వారిలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యతోపాటు పాలేరు ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా భావిస్తున్న నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. పాలేరులో పోటీ చేయాలా? వద్దా? అనేది సబ్ కమిటీ నిర్ణయించాలని చంద్రబాబు సూచించారని రేవంత్ రెడ్డి తెలిపారు. దీని పై రేపు సమావేశమై నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇదిలా ఉంటే పాలేరు ఉప ఎన్నికలో కూడా తమ పార్టీదే విజయమని టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని టీఆర్ఎస్ అధిష్టానం ఎంపిక చేసింది. అయితే టీఆర్ఎస్ను ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉంది. అందులోభాగంగా ఆ పార్టీ నేతలు రాష్ట్రంలోని రాజకీయ పక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమకే మద్దతు ఇవ్వాలని ఇప్పటికే టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షా పార్టీల నేతలతో టీ కాంగ్రెస్ నేతలు కోరుతున్న విషయం విదితమే.
2014లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి రాంరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. అయితే ఆయన అనారోగ్యంతో ఇటీవల మరణించారు. దీంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. కాగా రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులను ఏకగ్రీవం చేసేందుకు టీకాంగ్రెస్ పార్టీ తొలుత ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. కానీ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఏకం చేసి... టీఆర్ఎస్ను ఓటమి పాలు చేసేందుకు టీ కాంగ్రెస్ నేతలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.