పాలేరుపై ఉన్న శ్రద్ధ కరువు సాయంపై లేదు
* సీఎం కేసీఆర్‌పై సీపీఐ నేత
* చాడ వెంకట్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు పాలేరు ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ కరువు సహాయక చర్యలపై లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నిక కోసం మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరించడం ఏమిటని ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ర్టంలో కొంతకాలంగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులున్నా, ‘దొంగలు పడిన తర్వాత కుక్కలు మొరిగినట్లు’గా సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర సహాయాన్ని కోరారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు రబీ ప్రణాళికే లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. యుద్ధప్రాతిపదికన సహాయచర్యలను చేపట్టి ప్రజలను ఆదుకోవాలన్నారు. కరువుపై సీపీఐ తీవ్ర ఆందోళన జరిపినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.