పాలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తుమ్మల
♦ టీఆర్‌ఎస్ అధికారిక ప్రకటన
♦ కాంగ్రెస్ ఏకగ్రీవ యత్నాలకు చెక్
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ ఉప ఎన్నికకు మంత్రి కె.తారక రామారావు ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. అనారోగ్యంతో ఫాంహౌస్‌లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ ఉప ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులతో చర్చలు జరిపారు. అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై సీనియర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. జిల్లాలో పట్టు, బలమైన అనుచర వర్గం ఉన్న తుమ్మల నాగేశ్వర్‌రావు పాలేరుకు సరైన అభ్యర్థి అని పార్టీ నేతలు నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పాలేరు నుంచి పోటీ చేయాలని కేసీఆర్ స్వయంగా తుమ్మలను కోరారు. కేసీఆర్ సూచనతో పోటీకి ఆయన అంగీకరించారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మలకు మంత్రి పదవిచ్చి, అనంతరం శాసన మండలికి పంపిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా..
పాలేరు ఉప ఎన్నిక ఏకగ్రీవానికి టీపీసీసీ చేస్తున్న యత్నాలకు అధికార పార్టీ ముందే చెక్ పెట్టింది. ప్రజా పద్దుల సంఘం చైర్మన్‌గా ఉన్న రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మరణంతో పాలేరుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసేందుకు సహకరించాలంటూ టీపీసీసీ యత్నాలను ప్రారంభించింది. ఇప్పటికే పలు పార్టీల నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా అపాయింట్‌మెంట్ కోరారు. అయితే బుధవారం రాత్రి దాకా ముఖ్యమంత్రి.. అపాయింట్‌మెంట్ ఖరారు చేయలేదు. పాలేరులో ఏకగ్రీవం చేయాలని తాము కోరిన తర్వాత రాజకీయ అంశాలు ప్రతికూలంగా మారుతాయనే యోచనతోనే తుమ్మల అభ్యర్థిత్వాన్ని ఖరారు చే శారని కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత టీపీసీసీ నాయకులు అడగడానికి కూడా సాహసించబోరనే యోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నేతలంటున్నారు.