రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఇంత భయమెందుకు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేసీఆర్ ను ప్రశ్నించారు.
-పాలేరు అభ్యర్థిగా పోతినేని సుదర్శన్
ఖమ్మం
‘టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేశామని చెప్పుకుంటోంది. దీనిని చూసి ప్రజలు మీకే ఓట్లు వేస్తారనుకుంటే.. పాలేరు ఉప ఎన్నికకు కేటీఆర్‌తో సహా ఐదుగురు మంత్రులు ఎందుకు? అభివృద్ధి చేస్తే ఇంత భయమెందుకు’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. పాలేరు అభ్యర్థిగా తమ పార్టీ నుంచి పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌ను బరిలో దింపుతున్నామని వివరించారు. ఖమ్మంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఉపఎన్నికలో అవినీతి, అవకాశవాద రాజకీయాలతో రూ.50 నుంచి రూ.70కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు టీఆర్‌ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆరోపించారు. వామపక్షాలన్నీ తమకు మద్దతుగా నిలుస్తాయిని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు తమ పార్టీకి శత్రువులేనని.. బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నున్నా నాగేశ్వరరావు పాల్గొన్నారు.