పాలేరు ఉప ఎన్నికలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పోటీలో నిలపడంతోనే టీఆర్‌ఎస్ నైతికంగా ఓడిపోయిందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.
ఓటమి భయంతోనే రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉన్న తుమ్మలను టీఆర్‌ఎస్ ఎన్నికల బరిలోకి దించిందని తెలిపారు. పాలేరులో మొదటి నుంచి కాంగ్రెస్‌కు ఎంతో ఆదరణ ఉందని, అధికార టీఆర్‌ఎస్ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అహంకార ధోరణితో వ్యవహరిస్తూ.. పాలేరు ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలిపి తన దొరతనాన్ని చాటుకున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఉండి కూడా పోటీలో నిలపడం అవసరమా అని ఆమె ప్రశ్నించారు.