పాలేరులోనూ టీఆర్‌ఎస్ జైత్రయాత్ర
- ఉప ఎన్నికలో ఘన విజయం
- తుమ్మలకు 45,682 ఓట్ల రికార్డు మెజారిటీ
- కాంగ్రెస్‌కు కలసిరాని సానుభూతి
- సీపీఎం డిపాజిట్ గల్లంతు
- టీఆర్‌ఎస్‌కు 94,940 ఓట్లు.. హస్తానికి 49,258
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గులాబీ మళ్లీ గుబాళించింది. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో సానుభూతి పవనాలను కూడా తోసిరాజంటూ టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి, దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డిపై ఏకంగా 45,682 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. పాలేరు నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ. నాలుగు మండలాలు, పోస్టల్ బ్యాలెట్లతో కలిపి 1,68,288 ఓట్లలో టీఆర్‌ఎస్‌కు 94,940, కాంగ్రెస్‌కు 49,258 ఓట్లు రాగా సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ 15,538 ఓట్లతో డిపాజిట్ కోల్పోయూరు.
ఓట్ల లెక్కింపు ఖమ్మం పత్తి మార్కెట్ యార్డులో గురువారం ఉదయం ఎనిమిదింటికి మొదలవగా మధ్యాహ్నం 12కల్లా ఫలితం వెలువడింది. మొత్తం 18 రౌండ్లలో ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్సే భారీ ఆధిక్యత కనబరిచి 55.5 శాతం ఓట్లు కొల్లగొట్టింది. తిరుమలాయపాలెం మండలంలో 16,446 ఓట్లు, ఖమ్మం రూరల్‌లో 12,604, కూసుమంచిలో 9,190, నేలకొండపల్లిలో 7,441 ఓట్ల మెజారిటీ సాధించింది. దాంతో గులాబీ శ్రేణులు మార్కెట్ యార్డు వద్దే బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నాయి. తుమ్మలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.దానకిశోర్, రిటర్నింగ్ అధికారి బి.శంకర్ ధ్రువీకరణ పత్రం అందజేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణంతో పాలేరుకు ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.
పాలేరు చరిత్రలో రికార్డు మెజారిటీ
పాలేరు నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో ఈ ఎన్నికలోనే రికార్డు స్థాయిలో మెజారిటీ వచ్చింది. 1972 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కత్తుల శాంతయ్య సాధించిన 24,552 ఓట్ల మెజారిటీయే ఇప్పటిదాకా అత్యధికం. తిరుమలాయపాలెం మండలంలో భక్తరామదాసు ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయడం ఈ మండలంలో అత్యధిక మెజారిటీ రావడానికి దోహదపడిందని టీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఈవిజయం కోసం గులాబీ శ్రేణులు సర్వశక్తులూ ఒడ్డా యి. 10 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యే లు, ఎంపీలు, కా ర్పొరేషన్ మేయ ర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో అన్ని మండలాలూ కలియదిరిగారు.
కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ
పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిట్టింగ్ స్థానం తాలూకు సానుకూలతకు సానుభూతి, సంప్రదాయ ఓటింగ్ తోడై స్వల్ప మెజారిటీతోనైనా గట్టెక్కుతామన్న కాంగ్రెస్ నేతల అంచనాలు తలకిందులయ్యాయి. నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లోనైనా మెజారిటీ ఓట్లొస్తాయన్న అంచనాలూ తప్పాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ 69,707 ఓట్లు సాధించి టీడీపీ అభ్యర్థి మద్దినేని బేబి స్వర్ణకుమారిపై 21,863 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పట్లో టీఆర్‌ఎస్‌కు 4 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి!
నోటాకు 2,785 ఓట్లు!
మొత్తం 13 మంది అభ్యర్థుల్లో సీపీఎంతో పాటు మిగతా పదిమంది స్వతంత్రుల డిపాజిట్లూ గల్లంతయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులకు 8,552 ఓట్లు పోలయ్యాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగి 44,245 ఓట్లు సాధించిన సీపీఎం.. ఈసారి సీపీఐ బలపరిచినా 15,538 ఓట్లకు పరిమితమైంది. ఇక నోటాకు 2,785 ఓట్లు రావడం మరో విశేషం. నోటాకు ఓటెయ్యాలంటూ సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పిలుపివ్వడం కూడా ఇందుకు కారణమంటున్నారు.
పార్టీలవారీగా వచ్చిన ఓట్లు..
పార్టీ ఓట్లు శాతం
టీఆర్‌ఎస్ 94,940 55.5
కాంగ్రెస్ 49,258 28.79
సీపీఎం 15,538 9.08
స్వతంత్రులు 8,552 5.00
నోటా 2,785 1.3