ram reddy venkata reddy
-
పాలేరులోనూ టీఆర్ఎస్ జైత్రయాత్ర
- ఉప ఎన్నికలో ఘన విజయం - తుమ్మలకు 45,682 ఓట్ల రికార్డు మెజారిటీ - కాంగ్రెస్‌కు కలసిరాని సానుభూతి - సీపీఎం డిపాజిట్ గల్లంతు - టీఆర్ఎస్కు 94,940 ఓట్లు.. హస్తానికి 49,258 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గులాబీ మళ్లీ గుబాళించింది. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో సానుభూతి పవనాలను కూడా తోసిరాజంటూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి, దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డిపై ఏకంగా 45,682 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. పాలేరు నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ. నాలుగు మండలాలు, పోస్టల్ బ్యాలెట్లతో కలిపి 1,68,288 ఓట్లలో టీఆర్ఎస్కు 94,940, కాంగ్రెస్‌కు 49,258 ఓట్లు రాగా సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ 15,538 ఓట్లతో డిపాజిట్ కోల్పోయూరు. ఓట్ల లెక్కింపు ఖమ్మం పత్తి మార్కెట్ యార్డులో గురువారం ఉదయం ఎనిమిదింటికి మొదలవగా మధ్యాహ్నం 12కల్లా ఫలితం వెలువడింది. మొత్తం 18 రౌండ్లలో ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్సే భారీ ఆధిక్యత కనబరిచి 55.5 శాతం ఓట్లు కొల్లగొట్టింది. తిరుమలాయపాలెం మండలంలో 16,446 ఓట్లు, ఖమ్మం రూరల్‌లో 12,604, కూసుమంచిలో 9,190, నేలకొండపల్లిలో 7,441 ఓట్ల మెజారిటీ సాధించింది. దాంతో గులాబీ శ్రేణులు మార్కెట్ యార్డు వద్దే బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నాయి. తుమ్మలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.దానకిశోర్, రిటర్నింగ్ అధికారి బి.శంకర్ ధ్రువీకరణ పత్రం అందజేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణంతో పాలేరుకు ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. పాలేరు చరిత్రలో రికార్డు మెజారిటీ పాలేరు నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో ఈ ఎన్నికలోనే రికార్డు స్థాయిలో మెజారిటీ వచ్చింది. 1972 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కత్తుల శాంతయ్య సాధించిన 24,552 ఓట్ల మెజారిటీయే ఇప్పటిదాకా అత్యధికం. తిరుమలాయపాలెం మండలంలో భక్తరామదాసు ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయడం ఈ మండలంలో అత్యధిక మెజారిటీ రావడానికి దోహదపడిందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఈవిజయం కోసం గులాబీ శ్రేణులు సర్వశక్తులూ ఒడ్డా యి. 10 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యే లు, ఎంపీలు, కా ర్పొరేషన్ మేయ ర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో అన్ని మండలాలూ కలియదిరిగారు. కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిట్టింగ్ స్థానం తాలూకు సానుకూలతకు సానుభూతి, సంప్రదాయ ఓటింగ్ తోడై స్వల్ప మెజారిటీతోనైనా గట్టెక్కుతామన్న కాంగ్రెస్ నేతల అంచనాలు తలకిందులయ్యాయి. నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లోనైనా మెజారిటీ ఓట్లొస్తాయన్న అంచనాలూ తప్పాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ 69,707 ఓట్లు సాధించి టీడీపీ అభ్యర్థి మద్దినేని బేబి స్వర్ణకుమారిపై 21,863 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పట్లో టీఆర్ఎస్కు 4 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి! నోటాకు 2,785 ఓట్లు! మొత్తం 13 మంది అభ్యర్థుల్లో సీపీఎంతో పాటు మిగతా పదిమంది స్వతంత్రుల డిపాజిట్లూ గల్లంతయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులకు 8,552 ఓట్లు పోలయ్యాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగి 44,245 ఓట్లు సాధించిన సీపీఎం.. ఈసారి సీపీఐ బలపరిచినా 15,538 ఓట్లకు పరిమితమైంది. ఇక నోటాకు 2,785 ఓట్లు రావడం మరో విశేషం. నోటాకు ఓటెయ్యాలంటూ సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పిలుపివ్వడం కూడా ఇందుకు కారణమంటున్నారు. పార్టీలవారీగా వచ్చిన ఓట్లు.. పార్టీ ఓట్లు శాతం టీఆర్ఎస్ 94,940 55.5 కాంగ్రెస్ 49,258 28.79 సీపీఎం 15,538 9.08 స్వతంత్రులు 8,552 5.00 నోటా 2,785 1.3 -
నిలకడగా ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆరోగ్యం
హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీమంత్రి ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి(74) ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు శనివారం తెలిపారు. ఆయన జ్వరం, ఫిట్స్‌తో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లుగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధికి సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. జ్వరం, ఫిట్స్ రావడంతో తాజాగా ఆయన ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వెంకటరెడ్డి శరీరం చికిత్సకు సహకరిస్తోందని, మరో 3 రోజులు గడిస్తే పూర్తి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పగలమని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. -
సిట్టింగ్‌లు గట్టెక్కేనా ?
తొలి తెలంగాణ శాసనసభలో అడుగు పెట్టేందుకు ఎమ్మెల్యేల ఆరాటం కలసిరాని కాలం... తప్పని ఎదురీత మధిరలో భట్టికి గడ్డుకాలమే... మాజీ మంత్రిపైనా అసంతృప్తి భద్రాచలం, అశ్వారావుపేటల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పాట్లు కారెక్కినా జోరులేని అబ్బయ్య - చంద్రావతిదీ అదే పరిస్థితి గట్టిపోటీ ఎదుర్కొంటున్న తుమ్మల, సండ్ర త్రిముఖ పోరులో కూనంనేని ఆపసోపాలు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వీరంతా ఎమ్మెల్యేలే... కొందరు ఇప్పటికే రెండు, మూడుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించగా.. మరి కొందరు తొలిసారి ఎన్నికయ్యారు... ఐదేళ్లు జిల్లా ప్రజలను పాలించారు... మళ్లీ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లాలని ఆరాటపడుతున్నారు... తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటయ్యే తొలి శాసనసభ సభ్యులుగా ప్రమాణం చేయాలని తహతహలాడుతున్నారు. కానీ వీరందరికీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? ఐదేళ్ల వీరి పాలనపై ఆయా నియోజకవర్గాల ప్రజలు సంతృప్తితోనే ఉన్నారా? మళ్లీ గట్టెక్కుతారా? ఇదీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. జిల్లా నుంచి చాలా కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రులు రాంరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న మల్లు భట్టి విక్రమార్క లాంటి నేతలతోపాటు సండ్ర వెంకటవీరయ్య, కూనంనేని సాంబశివరావు, అబ్బయ్య, చంద్రావతి, సత్యవతి, మిత్రసేన భవితవ్యంపై పలు రకాలుగా చర్చ సాగుతోంది. వీరిలో కొందరు మళ్లీ 1, 2 స్థానాల్లో పోటీ ఇస్తుండగా, మరికొందరు పూర్తిగా వెనుకబడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రూపు తగాదాలు, నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోకపోవడం, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు సిట్టింగ్‌ల విజయావకాశాలను దెబ్బతీసేలా ఉండగా, వారు చేసిన అభివృద్ధి పనులు, వ్యక్తిగత చరిష్మా అనుకూలాంశాలుగా మారనున్నాయి. అన్నింటా అదే పరిస్థితి.... ఒక్క మాటలో చెప్పాలంటే.. జిల్లాలోని ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కచ్చితంగా గెలుస్తానని చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, టీడీపీ కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు, ఆయన వర్గానికి చెందిన మరో అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ప్రత్యర్థులకు గట్టిపోటీనే ఇస్తున్నారు. వారి వ్యక్తిగత పలుకుబడిని ఉపయోగిస్తూ మళ్లీ గట్టెక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నా... అవి ఎంతమేరకు సఫలీకృతమవుతాయనేది అనుమానమేననే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పాలేరులో వైఎస్సార్సీపీ బలపరిచిన సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ ప్రచార తీరు మాజీ మంత్రిని కలవరపెడుతోంది. ఇక ఖమ్మం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కూరాకుల నాగభూషణం, కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ ఇద్దరూ తుమ్మలను ధీటుగానే ఎదుర్కొంటున్నారు. అయితే, విశేష రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా తుమ్మల తన అస్త్రాలన్నింటినీ ప్రయోగించి ఇతర అభ్యర్థుల కన్నా వెనుకబడకుండా ఉండేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈసారి విచిత్ర పరిస్థితిలో ఉన్నారు. మొన్నటివరకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన ఆయన ఇప్పుడు అదే పార్టీ మద్దతుతో బరిలోకి దిగారు. ఇక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు మద్దతిచ్చే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయన్నది బహిరంగ రహస్యమే. వైఎస్సార్సీపీ అభ్యర్థి వనమాతో ఇక్కడి కాంగ్రెస్ కార్యకర్తలకు మంచి సంబంధాలే ఉన్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు కూడా తనకున్న సంబంధాలతో కూనంనేనిని ధీటుగానే ఎదుర్కొంటున్నారు. అయితే, మొన్నటివరకు టీఆర్ఎస్, సీపీఐ శ్రేణులు కలిసి పనిచేయడంతో ఇప్పుడు ఆ రెండు పార్టీల అభ్యర్థుల మధ్య కొంత గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో త్రిముఖ పోటీలో కూనంనేనికి కష్టకాలమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సత్తుపల్లి నుంచి టీడీపీ తరఫున బరిలో ఉన్న సండ్ర వెంకటవీరయ్య కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థి మట్టా దయానంద్ నుంచి మంచి పోటీనే ఎదుర్కొంటున్నారు. భట్టికి కటకటే... ఇక, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క హోరాహోరీగా తన ప్రత్యర్థులతో తలపడాల్సి వస్తోంది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ బలపరిచిన సీపీఎం అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ ప్రచారంలో దూసుకెళుతున్నారు. ైవె ఎస్సార్సీపీ ముఖ్య నాయకురాలు షర్మిల, పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ పర్యటించడంతో ఇరు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకెళుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక సీనియర్ నేత, మధిర టీడీపీ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు తనదైన శైలిలో చాపకింద నీరులా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పట్టించుకోలేదని, జాలిముడి ప్రాజెక్టు విషయంలో పేద రైతుల భూములు పోతున్నా పట్టించుకోలేదని, తన అనుచరులైన ఇద్దరు, ముగ్గురు నేతలకు మాత్రమే అభివృద్ధి పనుల కాంట్రాక్టులు ఇప్పించారనే విమర్శలను భట్టి ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన కూడా విజయం కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న మిత్రసేన, సత్యవతి కూడా ఈసారి గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలను నిర్లక్ష్యం చేశార ని మిత్రసేనపై ఉన్న ఆరోపణలు, భద్రాచలంలో సత్యవతికి వ్యతిరేకంగా ఉన్న గ్రూపు తగాదాలు తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశముంది. ఇక అనివార్య పరిస్థితుల్లో పార్టీ మారిన ఊకె అబ్బయ్య, బాణోతు చంద్రావతి కూడా ఏటికి ఎదురీదుతున్నారు. ఇద్దరూ కారెక్కినా ప్రచారంలో జోరు కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. అయితే, కేసీఆర్ బహిరంగ సభపై అబ్బయ్య కోటి ఆశలు పెట్టుకోగా, తన వ్యక్తిగత చరిష్మాపైనే ఆధారపడి చంద్రావతి వైరా రణరంగంలో తన అదృష్టాన్ని మరోమారు పరీక్షించు కుంటున్నారు. -
16న సోనియా పర్యటన
ముజ్జుగూడెం(నేలకొండపల్లి)న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 16 న సోనియాగాంధీ జిల్లాకు రానున్నట్లు రాష్ట్ర మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మండలంలోని ముజ్జుగూడెంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు ఓటుతో కృతజ్ఞతలు తెలపాలని చెప్పారు. త్వరలో ఖమ్మం లేదా నల్లగొండ జిల్లాలో రాహూల్‌గాంధీ పర్యటన ఉంటుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ 70-80 సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గంలో సీపీఐ పోటీ చేసే విధంగా పొత్తు కుదిరిందన్నారు. సార్వత్రిక, ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అత్యధిక స్థానాల్లో గెలిపించాలని ఆయన కోరారు. టీడీపీ-బీజేపీ పొత్తు నేపథ్యంలో మైనార్టీలందరూ కాంగ్రెస్ వైపు నిలుస్తారని అన్నారు. తాను ఈ నెల 9న పాలేరు అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాని, ఈ కార్యక్రమానికి కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని కోరారు. విలేకర్ల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాగుబండి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ వున్నం బ్రహ్మయ్య, మాజీ చైర్మన్ ఎనికె జానకిరామయ్య, పార్టీ మండల అధ్యక్షుడు కట్టెకోల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్రలో వైఎస్సాఆర్ సీపీ హవా ఉంది: మంత్రి రాంరెడ్డి