సిట్టింగ్‌లు గట్టెక్కేనా ? | who are the winner in elections | Sakshi
Sakshi News home page

సిట్టింగ్‌లు గట్టెక్కేనా ?

Published Tue, Apr 22 2014 4:53 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM

who are the winner in elections

  • తొలి తెలంగాణ శాసనసభలో అడుగు పెట్టేందుకు ఎమ్మెల్యేల ఆరాటం
  • కలసిరాని కాలం... తప్పని ఎదురీత
  • మధిరలో భట్టికి గడ్డుకాలమే... మాజీ మంత్రిపైనా అసంతృప్తి
  • భద్రాచలం, అశ్వారావుపేటల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పాట్లు
  • కారెక్కినా జోరులేని అబ్బయ్య - చంద్రావతిదీ అదే పరిస్థితి
  • గట్టిపోటీ ఎదుర్కొంటున్న తుమ్మల, సండ్ర
  • త్రిముఖ పోరులో కూనంనేని ఆపసోపాలు
  • సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వీరంతా ఎమ్మెల్యేలే... కొందరు ఇప్పటికే రెండు, మూడుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించగా.. మరి కొందరు తొలిసారి ఎన్నికయ్యారు... ఐదేళ్లు జిల్లా ప్రజలను పాలించారు... మళ్లీ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లాలని ఆరాటపడుతున్నారు... తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటయ్యే తొలి శాసనసభ సభ్యులుగా ప్రమాణం చేయాలని తహతహలాడుతున్నారు.

    కానీ వీరందరికీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? ఐదేళ్ల వీరి పాలనపై ఆయా నియోజకవర్గాల ప్రజలు సంతృప్తితోనే ఉన్నారా? మళ్లీ గట్టెక్కుతారా? ఇదీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. జిల్లా నుంచి చాలా కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రులు రాంరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న మల్లు భట్టి విక్రమార్క లాంటి నేతలతోపాటు సండ్ర  వెంకటవీరయ్య, కూనంనేని సాంబశివరావు, అబ్బయ్య, చంద్రావతి, సత్యవతి, మిత్రసేన భవితవ్యంపై పలు రకాలుగా చర్చ సాగుతోంది.
     
    వీరిలో కొందరు మళ్లీ 1, 2 స్థానాల్లో పోటీ ఇస్తుండగా, మరికొందరు పూర్తిగా వెనుకబడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రూపు తగాదాలు, నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోకపోవడం, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు సిట్టింగ్‌ల విజయావకాశాలను దెబ్బతీసేలా ఉండగా, వారు చేసిన అభివృద్ధి పనులు, వ్యక్తిగత చరిష్మా అనుకూలాంశాలుగా మారనున్నాయి.
     
    అన్నింటా అదే పరిస్థితి....
    ఒక్క మాటలో చెప్పాలంటే.. జిల్లాలోని ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కచ్చితంగా గెలుస్తానని చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, టీడీపీ కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు, ఆయన వర్గానికి చెందిన మరో అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ప్రత్యర్థులకు గట్టిపోటీనే ఇస్తున్నారు. వారి వ్యక్తిగత పలుకుబడిని ఉపయోగిస్తూ మళ్లీ గట్టెక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నా... అవి ఎంతమేరకు సఫలీకృతమవుతాయనేది అనుమానమేననే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పాలేరులో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ ప్రచార తీరు మాజీ మంత్రిని కలవరపెడుతోంది.
     
    ఇక ఖమ్మం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కూరాకుల నాగభూషణం, కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ ఇద్దరూ తుమ్మలను ధీటుగానే ఎదుర్కొంటున్నారు. అయితే, విశేష రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా తుమ్మల తన అస్త్రాలన్నింటినీ ప్రయోగించి ఇతర అభ్యర్థుల కన్నా వెనుకబడకుండా ఉండేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈసారి విచిత్ర పరిస్థితిలో ఉన్నారు. మొన్నటివరకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన ఆయన ఇప్పుడు అదే పార్టీ మద్దతుతో బరిలోకి దిగారు. ఇక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు మద్దతిచ్చే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయన్నది బహిరంగ రహస్యమే. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వనమాతో ఇక్కడి కాంగ్రెస్ కార్యకర్తలకు మంచి సంబంధాలే ఉన్నాయి.
     
    టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు కూడా తనకున్న సంబంధాలతో కూనంనేనిని ధీటుగానే ఎదుర్కొంటున్నారు. అయితే, మొన్నటివరకు టీఆర్‌ఎస్, సీపీఐ శ్రేణులు కలిసి పనిచేయడంతో ఇప్పుడు ఆ రెండు పార్టీల అభ్యర్థుల మధ్య కొంత గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో త్రిముఖ పోటీలో కూనంనేనికి కష్టకాలమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సత్తుపల్లి నుంచి టీడీపీ తరఫున బరిలో ఉన్న సండ్ర వెంకటవీరయ్య కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మట్టా దయానంద్ నుంచి మంచి పోటీనే ఎదుర్కొంటున్నారు.
     
    భట్టికి కటకటే...
    ఇక, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క హోరాహోరీగా తన ప్రత్యర్థులతో తలపడాల్సి వస్తోంది. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన సీపీఎం అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ ప్రచారంలో దూసుకెళుతున్నారు. ైవె ఎస్సార్‌సీపీ ముఖ్య నాయకురాలు షర్మిల, పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ పర్యటించడంతో ఇరు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకెళుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక సీనియర్ నేత, మధిర టీడీపీ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు తనదైన శైలిలో చాపకింద నీరులా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పట్టించుకోలేదని, జాలిముడి ప్రాజెక్టు విషయంలో పేద రైతుల భూములు పోతున్నా పట్టించుకోలేదని, తన అనుచరులైన ఇద్దరు, ముగ్గురు నేతలకు మాత్రమే అభివృద్ధి పనుల కాంట్రాక్టులు ఇప్పించారనే విమర్శలను భట్టి ఎదుర్కొంటున్నారు.
     
    ఈ పరిస్థితుల్లో ఆయన కూడా విజయం కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న మిత్రసేన, సత్యవతి కూడా ఈసారి గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలను నిర్లక్ష్యం చేశార ని మిత్రసేనపై ఉన్న ఆరోపణలు, భద్రాచలంలో సత్యవతికి వ్యతిరేకంగా ఉన్న గ్రూపు తగాదాలు తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశముంది. ఇక అనివార్య పరిస్థితుల్లో పార్టీ మారిన ఊకె అబ్బయ్య, బాణోతు చంద్రావతి కూడా ఏటికి ఎదురీదుతున్నారు. ఇద్దరూ కారెక్కినా ప్రచారంలో జోరు కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. అయితే, కేసీఆర్ బహిరంగ సభపై అబ్బయ్య కోటి ఆశలు పెట్టుకోగా, తన వ్యక్తిగత చరిష్మాపైనే ఆధారపడి చంద్రావతి వైరా రణరంగంలో తన అదృష్టాన్ని మరోమారు పరీక్షించు కుంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement